రాజమండ్రి, సెప్టెంబరు 25: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ బెయిలుపై బయటకు రావటం పట్ల జనంలో కనిపిస్తున్న స్పందన చూసిన తరువాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో గుబులు మొదలయింది. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకుల్లో చాలా మంది వైకాపావైపు చూస్తున్నట్టు సమాచారం అందుతుండటంతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుండటంతో, కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం కన్నా వైకాపా లేదా తెలుగుదేశం పార్టీలో చేరటమే మంచిదన్న అభిప్రాయానికి జిల్లాలోని చాలా మంది నాయకులు వస్తున్నట్టు తెలుస్తోంది. కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామాచేసి బయటకొచ్చి తమ దారి తాము వెదుక్కోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే పార్టీ విధానాన్ని దుయ్యబడుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం, జగన్ ఆస్తుల కేసులో సిబిఐ వ్యవహరించిన తీరు తదితర అంశాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీరు పట్ల కొంత మంది ఎమ్మెల్యేలు నిర్మొహమాటంగా ధ్వజమెత్తుతున్నారు. పరిస్థితి చూస్తుంటే జిల్లాలోని కొంత మంది ఎమ్మెల్యేలు వైకాపాలో మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా తమ పాత మిత్రులను తిరిగి ఆహ్వానించేందుకు సిద్ధంగానే ఉందని, అందువల్ల కొంత మంది నాయకులు తిరిగి తమ పార్టీలోకి వస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. నాయకుల భవిష్యత్తు రాజకీయంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతుండటంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఏ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియకపోవటంతో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. దాంతో అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల్లోను అనుమానపు చూపులు ఎక్కువయ్యాయి. తాము పార్టీని విడిచి వెళ్లేది లేదని నాయకులు ఎంత గట్టిగా చెప్పినా నమ్మగలిగే పరిస్థితుల్లో కార్యకర్తలు లేరు.
సీమాంధ్ర జిల్లాల వాహనాలకు
తెలంగాణలో ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లు
-ఉద్యోగుల సమ్మెతో ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఏర్పాట్లు - యజమానులకు దూరాభారం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, సెప్టెంబరు 25: సీమాంధ్ర జిల్లాల మోటారు వాహనాలకు పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ల కోసం రవాణాశాఖ తెలంగాణ జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాలకు చెందిన రవాణశాఖ ఉద్యోగులు, అధికారులు నిరవధిక సమ్మె చేస్తుండటంతో సీమాంధ్ర జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయాలు పూర్తిగా మూతపడిన సంగతి విదితమే. జిల్లాల్లో డిప్యుటీ కమిషనర్ స్థాయి అధికారి నుండి అటెండరు స్థాయి ఉద్యోగి వరకు అంతా సమ్మె బాట పట్టడంతో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దాంతో డ్రైవింగ్ లైసెన్సులు, కొత్త మోటారు సైకిళ్లు, కార్లు రిజిస్ట్రేషన్ తదితర అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే సీమాంధ్ర జిల్లాలకు చెందిన లారీలు, ప్రయివేటు బస్సులు, టాక్సీలు రాష్ట్రంలో తిరగటంతో పాటు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పర్మిట్లు అవసరమవుతాయి. బేసిక్ పర్మిట్‌కు 5ఏళ్లు, జాతీయ పర్మిట్‌కు ఏడాది గడువు ఉంటుంది. పర్మిట్ల గడువు ముగిసిన తరువాత మోటారు వాహనాల యజమానులు మళ్లీ కొత్తగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్మిట్లు జారీకి సీమాంధ్ర జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయాలు మూతపడటంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాంతో సీమాంధ్ర జిల్లాలకు చెందిన మోటారు వాహనాల యజమానులు బేసిక్ పర్మిట్లు, జాతీయ పర్మిట్ల కోసం హైదరాబాద్ పరుగెత్తాల్సి వస్తోంది. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి పర్మిట్లు తీసుకునేందుకు అయ్యే ఖర్చు కన్నా, సమ్మె కారణంగా హైదరాబాద్ వెళ్లి పర్మిట్ తెచ్చుకునేందుకు రెట్టింపు ఖర్చవుతోందని, మోటారు వాహనాల యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాహనం ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ కోసం అయితే పొరుగున ఉన్న తెలంగాణ జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తుకోవచ్చన్న వెసులుబాటును రవాణాశాఖ కల్పించింది. పర్మిట్ కోసం అయితే సంబంధిత పత్రాలను ఒక మనిషి తీసుకెళితే సరిపోతుందిగానీ, అదే ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ కోసం అయితే వాహనాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతో చాలా ఖర్చవుతోందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ రెండు లావాదేవీలకు మాత్రమే రవాణాశాఖ వెసులుబాటు కల్పించిందే తప్ప, మిగిలిన వాటికి మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. సమైక్యాంధ్ర కోసం తాము నిరవధిక సమ్మె చేస్తుంటే, సీమాంధ్ర జిల్లాలకు చెందిన లావాదేవీల కోసం తెలంగాణ జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం ఏమిటని రవాణాశాఖ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులకు తమ నిరసనను తెలిపామని రవాణాశాఖ ఉద్యోగులు చెప్పారు.
కిలాడీ లేడీతో ఎస్సై సంబంధాలపై
ఉన్నతాధికారులు సీరియస్
-సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ
కాకినాడ రూరల్, సెప్టెంబరు 25: దొంగనోట్ల కేసులో పట్టుబడిన యువతి తాడేపల్లి సలోని అలియాస్ మేరి కేసులో ఒక ఎస్సైకు సంబంధం ఉందనే అంశాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ నెల 24వ తేదీన ‘ఆంధ్రభూమి’లో కిలాడీ లేడీ అనే కథనం ప్రచురణ కావడంతో, జిల్లా ఎస్పీ శివశంకర్‌రెడ్డి, డిఎస్పీ విజయభాస్కరరెడ్డి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. విభిన్న కోణాల్లో ఎస్సై పాత్రపై ఆరా తీస్తున్నారు. మంగళవారం నుండి దర్యాప్తును ముమ్మరం చేసి కూపీ లాగుతున్నారు. నకిలీ నోట్ల వ్యవహారం, అందులోనూ నిందితురాలితో ఎస్సై సన్నిహిత సంబంధాలు అంశం పోలీసు శాఖ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కావడంతో ఏలూరు రేంజి డిఐజి విక్రమ్‌సింగ్‌మాన్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తుజరిపి, నిగ్గుతేల్చాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. కాగా నిందితురాలైన యువతి సెల్‌ఫోన్ కాల్ డేటాలో ఎస్సై ఫోన్ నెంబర్‌తో గంటలకొద్దీ మాట్లాడినట్టు వెల్లడవ్వడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉన్నతాధికార్ల విచారణ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఆర్‌కె శ్రీనివాస్‌పై తప్పుడు సమాచారం చెప్పాలని ఎస్సై యువతికి పంపిన లేఖ అధికార్లకు చిక్కడంతో ఆ యువతిని ఆరా తీయగా, ఆ యువతి ఎస్సై బండారాన్ని ఉన్నతాధికార్ల ముందు బయటపెట్టినట్లు తెలిసింది. గతంలో కుటుంబ వ్యవహారానికి సంబంధించిన కేసులో స్టేషన్‌కు వచ్చిన యువతితో ఎస్సై హోదాలో ఉండి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం, ఆ యువతి నకిలీ నోట్ల వ్యవహారంలో నిందితురాలు కావడం, తన పై అధికారిపై తప్పుడు సమాచారం చెప్పాలని యువతికి సూచించడం అనే మూడు అంశాలను ఉన్నతాధికార్లు సీరియస్‌గా పరిగణనిస్తున్నట్టు సమాచారంఈ కేసులో మరికొద్ది రోజుల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.
జోరుగా ఉద్యమ హోరు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, సెప్టెంబరు 25: సమైక్యవాదులు వినూత్న నిరసనలతో హోరెత్తించారు... రాష్ట్ర విభజనను తీవ్రంగా నిరసిస్తూ జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం అంతే ఉత్సాహం, అదే ఊపుతో ఉద్యమాన్ని ముందుకు సాగించారు... రాజీలేని విధంగా జరుపుతున్న సమైక్య పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలంటూ నేతలు పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు వినూత్నంగా కనిపించడంతో ప్రజలు ప్రత్యేకించి ఆయా కార్యక్రమాలను తిలకించారు. రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా ఉద్యోగులు నెత్తిన రంగు రంగుల మెరుపు పోటీలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ప్రదర్శన చేశారు. జిల్లా పరిషత్ మహిళా ఉద్యోగులు వారి కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఒకే రంగు (ఎరుపు) చీరెలు ధరించి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా తరలివచ్చారు. మత్స్యశాఖ జెఎసి ఆధ్వర్యంలో సగం ధరకే చేపలు విక్రయించి ఆకట్టుకున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ ఎదురుగా మత్స్యశాఖ జెఎసి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది నిర్వహించారు. బతికివున్న తాజా చేపలను ఐస్‌బాక్స్‌ల్లో భద్రపరిచి, శిబిరం వద్ద అమ్మకానికి ఉంచారు. రకరకాల చేపలను అక్కడికి వచ్చిన వారికి విక్రయించారు. మార్కెట్ ధర కంటే ఏభై శాతం తక్కువ ధరకే చేపలు విక్రయించి తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మత్స్సశాఖ జెఎసి కన్వీనర్ వి కృష్ణారావు, మత్స్యశాఖ ఎడి కె కనకరాజు, మత్స్యశాఖ అసిస్టెంట్ ఇంజనీరు రుష్యేంద్రుడు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి చిన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో అధిక ప్రాధాన్యత సంతరించుకున్న బోనాల పండుగను మహిళా ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. అమ్మవారి బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. క్రైస్తవ జెఎసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష చేపట్టి వంటావార్పు నిర్వహించారు. కాకినాడ జెఎన్‌టియు వద్ద విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కాకినాడ నగరంలోని ఐడియల్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతరుల ఆధ్వర్యంలో కళాశాల వద్ద రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహించారు. వైద్య-ఆరోగ్య, విద్య, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు, న్యాయశాఖ, గృహ నిర్మాణం, ఆర్‌డబ్ల్యుఎస్, స్ర్తిశిశు సంక్షేమం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
చంపేస్తాం... ఇల్లు తగులబెడతాం!
రావులపాలెం సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్‌కు బెదిరింపు - షాపులు మూయించడమే నేరం
రావులపాలెం, సెప్టెంబరు 25: రావులపాలెం సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ పివిఎస్ సూర్యకుమార్‌కు చెందిన లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ వద్దకు మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి దౌర్జన్యం చేసి బెదిరించినట్టు బుధవారం జెఎసి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెఎసి నాయకులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మంగళవారం రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు రావులపాలెంలో నిర్వహించిన బంద్‌లో భాగంగా సాయంత్రం తెరిచివున్న కొన్ని షాపులను జెఎసి నాయకులు మూయించి వేశారు. ఈనేపధ్యంలో ఒక బ్రాందీషాపు వద్ద జెఎసి నాయకులతో కొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో జెఎసి నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా రాత్రి 11 గంటల సమయంలో వెదిరేశ్వరం రోడ్డులో ఉన్న సూర్యకుమార్‌కు చెందిన లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ వద్దకు కొందరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి బెదిరించారు. ఉద్యమం పేరుతో సూర్యకుమార్ షాపులు మూయించాలని ఒత్తిడి తెస్తే స్కూల్‌ను, అతని ఇంటిని తగులబెడతామని, చంపుతామని బెదిరించారు. దీంతో ఈ విషయాన్ని సిబ్బంది ఫోన్‌లో ఇంటి వద్దనున్న సూర్యకుమార్‌కు తెలిపారు. ఈమేరకు సూర్యకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి ఆ వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనను బుధవారం తీవ్రంగా ఖండించిన జెఎసి నాయకులు దీక్షా శిబిరం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, సిఐ సిహెచ్‌వి రామారావు, ఎస్‌ఐ ఆర్ గోవిందరాజులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం తామంతా ఉద్యమాలు చేస్తుంటే కొందరు వ్యక్తులు ఇలా భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదని, పోలీసులు దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కళా వెంకట్రావు సెంటర్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ పివిఎస్ సూర్యకుమార్, నాయకులు పోతంశెట్టి కనికిరెడ్డి, పడాల బాపిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, సాకా ప్రసన్నకుమార్, ఉపాధ్యాయ జెఎసి కన్వీనర్ గండ్రోతు నాగేశ్వరరావు, ఆర్టీసీ జెఎసి ఛైర్మన్ కె రామారావు, కన్వీనర్ జి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా సాయంత్రానికి ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్‌ఐ గోవిందరాజు తెలిపారు.
ఎమ్మెల్యే బండారు ఖండన
జెఎసి కన్వీనర్ పివిఎస్ స్యూరకుమార్‌ను కొందరు బెదిరించడాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీవ్రంగా ఖండించారు. సమైక్యాంధ్రకోసం ప్రజల తరఫున రేయింబవళ్లు శ్రమిస్తున్న జెఎసి నాయకులకు సహకరించాల్సింది పోయి ఇలా బెదిరించడం తగదన్నారు. పోలీసులు ఈ ఘటనకు బాధ్యులపైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సిఐ సిహెచ్‌వి రామారావు, ఎస్‌ఐ ఆర్ గోవిందరాజులకు ఎమ్మెల్యే సూచించారు.
మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలి
ముమ్మిడివరం, సెప్టెంబరు 25: రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవాలంటే రైతులంతా సమిష్టిగా మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని కోనసీమ రైతు జెఎసి కార్యదర్శి మట్ట మహలక్ష్మీ ప్రభాకర్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం శెట్టిబలిజ కల్యాణ మండపంలో డిసిసిబి డైరెక్టర్ గోదశి నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సమైక్యాంధ్రా కోనసీమ రైతు సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగితే ఉభయగోదావరి జిల్లాలతో పాటు సీమాంధ్ర ప్రాంతమంతా ఏడారిగా మారుతుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మొదటిగా నష్టపోయేది రైతులేనన్నారు. ఎన్‌జిఒ జెఎసి చేపట్టిన ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు రైతాంగమంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు రైతులు కృషి చేసి కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి సిద్ధం కావాలని ఆయన ప్రభాకర్ కోరారు. ఈనెల 30న ఐ పోలవరం మండలం ఎదుర్లంక జిఎంసి వారధి నుండి చించినాడ వరకూ కోనసీమ రైతు జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించే భారీ మోటార్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ఎన్‌జిఓ జెఎసి చేస్తున్న ఉద్యమానికి మరింత శక్తిని అందించేందుకు సీమాంధ్రలో ఉన్న రైతులంతా ముందుకు రావాలని కోనసీమ రైతు సంఘం నాయకులు అడ్డాల గోపాలకృష్ణ కోరారు. సమావేశంలో ఎడిఎ షంషీ, రైతు సంఘం నాయకులు ఎంఎస్ భాస్కరరావు, అడ్డాల గోపాలకృష్ణ, దంగేటి పండు, పెయ్యల చిట్టిబాబు, సర్పంచ్‌లు కడలి సుబ్బారావు, దానంకోట గోపాలస్వామి, గెడ్డం రవి, చెల్లు తాతబ్బాయినాయుడు తదితరులు రాష్ట్ర విభజన జరిగితే ఎదురయ్యే పరిణామాలను వివరించారు.
సమైక్యాంధ్ర సాధించి తీరుతాం: మంత్రి తోట
గండేపల్లి, సెప్టెంబరు 25: ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న మహా ఉద్యమంతో సమైక్యాంధ్ర సాధించి తీరుతామని తోట నరసింహం అన్నారు. గండేపల్లిలో జాతీయ రహదారిపై బుధవారం మురారి గ్రామానికి చెందిన మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఏ విధంగాను జరగదని స్పష్టం చేశారు. ప్రజల హృదయాల్లోంచి వచ్చిన ఉద్యమాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు. ఈ సందర్భంగా ఇబిసి నాయకులు గ్రంథి నాగ సుబ్రహ్మణ్యం సమకూర్చిన 25 కిలోల బియ్యం, పప్పు ప్యాకెట్లను నాలుగో తరగతి ఉద్యోగులకు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు కోర్పు లచ్చయ్యదొర, తెలుగురైతు అధ్యక్షులు కందుల కొండయ్యదొర, పరిమి వెంకటేశ్వరరావు, మండల జెఎసి అధ్యక్షులు బి రామారావు, ఎంపిడిఒ ఎన్ మురళీధర్ పాల్గొన్నారు.
జగన్‌కు బెయిలు వెనుక కాంగ్రెస్ హస్తం:సోము
కాకినాడ, సెప్టెంబరు 25: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ ఇప్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని, ఇది కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిల మధ్య చీకటి ఒప్పందంలో భాగమేనని బిజెపి రాష్ట్ర కార్యదర్శి సోము వీర్రాజు అన్నారు. బుధవారం స్థానిక పైండా వెంకటచలపతి సత్రంలో జిల్లా కిసాన్ మహా సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సోము అంతకు ముందు విలేఖరులతో మాట్లాడారు. జగన్‌కు బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని అర్ధమవుతుందని చెప్పారు. సిబిఐ ఛార్జీ షీటు ముగింపు వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందన్నారు. సిబిఐ అధికారులను బదిలీ చేయడం ప్రణాళికలో భాగమేనని చెప్పారు. . కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అతలాకుతలమైనా దానిపై ఢిల్లీ పెద్దలు నోరు మెదపడం లేదన్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనకు ప్రవేశపెట్టే బిల్లు ఇరు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకురావాలని లేని పక్షంలో తమ పార్టీ బిల్లును అడ్డుకుంటుందని చెప్పారు. అనంతరం జిల్లా బిజెపి పదాధికారుల సమావేశం, పండిట్ దీన్ దయాళ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, నగర అధ్యక్షులు పైడా భవనప్రసాద్, నాయకులు పైడా కృష్ణమోహన్, ఎం అయ్యాజీ వేమా, బత్తుల లక్ష్మికుమారి, సింగిలిదేవి సత్తిరాజు, కూచిమంచి వేణుగోపాల్, బండారు భాస్కర్, పాపారావు, చంటి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా జాతీయ పారిశ్రామిక కాంగ్రెస్ పార్టీ:బివిఆర్
రాజమండ్రి, సెప్టెంబరు 25: రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు బివి రామారావు జాతీయ పారిశ్రామిక కాంగ్రెస్‌పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తమ పార్టీలో 50 శాతం సీట్లు మహిళలకు, 35 శాతం సీట్లు యువతకు, మిగిలిన సీట్లు 50ఏళ్ల పైబడిన వారికి కేటాయించనున్నట్లు తెలిపారు. నేటి రాజకీయాలు వ్యాపార మయంగా, కలుషితంగా మారాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద, బడుగు, బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కృషిచేస్తామన్నారు. సమ్మెలు, బంద్‌లు వీడి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవలో పాలుపంచుకోవాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత, ఆందోళనకర పరిస్థితులను తొలగించేందుకు రాష్టప్రతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఏడేళ్ల చిన్నారిపై వృద్ధుని లైంగిక వేధింపులు
రామచంద్రపురం, సెప్టెంబరు 25: సభ్య సమాజం తలదించుకునేలా షష్టిపూర్తి వయస్సు కలిగిన ఒక వ్యక్తి అనె్నం పునె్నం ఎరుగని ఏడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన స్థానిక ఒకటో వార్డు కొత్తూరు గ్రామంలో బుధవారం జరిగింది. రామచంద్రపురం ఎస్సై బి యాదగిరి సంఘటన చోటుచేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ప్రజానీకాన్ని విచారించిన అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆయన అందించిన వివరాలిలావున్నాయి. ఏడు, అయిదు సంవత్సరాల అక్కాచెల్లెళ్లు వారి ఇంటి ఎదురుగా ఉన్న మొక్కల నుండి పువ్వులు కోస్తున్న సమయంలో పెంకే చంద్రరావు (60) ఏడేళ్ల బాలికను వరండా వద్దకు తీసుకెళ్లి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ హఠాత్పరిణామానికి ఆ బాలిక, ఆమె చెల్లెలు గట్టిగా ఏడ్చారు. ఏం జరిగిందోనని పరిసర ప్రాంత మహిళలు అక్కడకు చేరుకునే సరికి చిన్నారిపై చంద్రరావు చేస్తున్న దురాగతం కంటబడింది. దీంతో గ్రామస్థులంతా శివాలయం వద్దకు చేరి నిలదీశారు. దీంతో గ్రామస్థులంతా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించి చంద్రరావుకు ఎవరూ జామీను ఇవ్వరాదని కట్డడి చేశారు. అలాగే పోలీసు కేసు పూర్వాపరాల అనంతరం శిక్ష పడినా, విడుదలైనా గ్రామ బహిష్కారం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా దురాగతానికి పాల్పడిన చంద్రరావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై యాదగిరి చెప్పారు.
మంత్రి తోటకు సమైక్య సెగ
కోరుకొండ, సెప్టెంబరు 25: రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి తోట నరసింహంకు కోరుకొండలో సమైక్య సెగ తగిలింది. బుధవారం ఆయన రాజానగరం నుండి కోరుకొండ మీదుగా గోకవరం వెళుతుండగా, మండల కేంద్రం కోరుకొండ బస్టాండ్ సెంటర్‌లో ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు. దీంతో కారులో నుండి మంత్రి కిందకు దిగగా, మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి ఆమోదింప చేసుకోవాలని ఉద్యోగులు మంత్రిని చుట్టుముట్టారు. దీంతో మంత్రి తోట మాట్లాడుతూ రాజీనామా చేసి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశానని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తన సతీమణి వాణి ఆమరణ దీక్ష కూడా చేసిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులంతా సమైక్యవాదులు కావడంతోనే ఎపిఎన్‌జిఒలు హైదరాబాద్‌లో సభ నిర్వహించుకోగలిగారన్నారు. సమైక్యాంధ్రా కోసం ఏ కార్యక్రమం నిర్వహించినా, తాను పాలుపంచుకుంటానని మంత్రి తోట అన్నారు. ఉద్యోగ జెఎసి దీక్షలకు మంత్రి తోట సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడివోలు జెఎ ఝాన్సీ, వీణాదేవి, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రత్నకుమారి, పంచాయతీ కార్యదర్శులు రాణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో మండల పరిషత్ కార్యాలయ మహిళా సిబ్బంది, మహిళా పంచాయతీ కార్యదర్శులు, మహిళా విఆర్వోలు పాల్గొన్నారు. అదేవిధంగా కోఠికేశవరం నుండి అడపా సుధీర్ ఆధ్వర్యంలో యువకులు కోరుకొండ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోరుకొండ బస్టాండ్ సెంటర్‌లో సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.