Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్య ఉద్యమం ఆగకపోతే బ్రహ్మోత్సవాలకు భక్తుల రాకకు గండే

$
0
0

తిరుపతి, సెప్టెంబర్ 25: రాష్ట్ర విభజనకు సంబంధించి పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పడు తీసుకుంటారో తెలియదుకాని మరో 10 రోజులు సమైక్య ఉద్యమం ఇదే ఉద్ధృతంగా సాగితేమాత్రం స్వామివారి ఉత్సవాలు చూడటానికి వచ్చే భక్తుల రాకకు మాత్రం గండిపడే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారులు జాగ్రత్తపడి కేంద్ర రైల్వే శాఖ ద్వారా అధనపు రైళ్లు తిరుపతికి వేయించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం కనపడుతోంది. సమైక్యవాదులు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులను అనుమతించినా ఉత్సవాలను తిలకించడానికి రైళ్లలో వచ్చే భక్తులకు తగినన్ని అదనపు బస్సులను ఏర్పాటు చేయకపోతే భక్తులకు కూడా తిప్పలు తప్పవు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో ఏపి ఎన్‌జిఓలు తీసుకున్న నిర్ణయంతో ఆర్‌టిసి బస్సులు కూడా సమ్మెలోకి దిగాయి. తమిళనాడు బస్సులను కూడా అనుమతించడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయితే భక్తులు తిరుపతికి రావడానికి రైళ్లు, విమానమార్గాలు, సొంత వాహనాల ఎర్పాటు తప్ప మరో మార్గం లేదు. ఇక ప్రస్తుతం వున్న రైళ్లతో భక్తులు రావాలి అంటే ఇప్పటికే భక్తులు టిక్కెట్ల రిజర్వేషన్లు చేసుకుని వుండాలి. సర్వసాధారణంగా బ్రహ్మోత్సవాల సమయానికి ఏదో ఒక నిర్ణయం రాకపోతుందా? బస్సులు నడవకపోతాయా? అన్న ఆలోచనలు వున్నవారికి రైలు టిక్కెట్టు రిజర్వు చేసుకోవాలన్నా అవకాశం లేని పరిస్థితి. ఇక తత్కాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా భక్తులకు అవసరమైనన్ని టిక్కెట్లు అందుబాటులో వుండవన్నది అక్షర సత్యం. ఎందుకంటే సమ్మెకారణంగా దక్షణమధ్య రైల్వే నామమాత్రంగా ప్రత్యేక రైళ్లునడుపుతూ చేతులు దులుపుకుంటోంది. వాస్తవానికి వివిద ప్రాంతాల నుండి తిరుపతికి వచ్చే మొత్తం రైళ్ల సంఖ్య 40కుమించి లేవనే చెప్పుకోవాలి. ఈ రైళ్లలో వచ్చే వారి సంఖ్య ఎంత వుంటుంది, బ్రహ్మోత్సవాల్లో భక్తులతో తిరుమల ఎలా కళకళలాడుతుందన్నదే ప్రశ్న. సర్వసాధారణంగా ఉత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చే భక్తుల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ సంఖ్య వుంటుంది. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా కర్ణాటక నుండి వొల్వాబస్సులు మినహాయిస్తే సాదా, సీదా బస్సులు రావడం లేదు. ఇక ఈ సమయంలో సామాన్య భక్తులు తిరుమలకు రావాలంటే సదరన్ రైల్వేతో కచ్చితంగా సంప్రదింపులు చేయాల్సిందే. ఇక కేరళ రాష్ట్రం నుండి సౌత్, వెస్టు రైల్వే విభాగాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. ఇక సమైక్యవాదులు తిరుమల - తిరుపతి మధ్య బస్సులు నడపడానికి అనుమతించినా ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సంఖ్యకు ఇవి ఏమాత్రం సరితూగవు. ఎందుకంటే ప్రస్తుతం 107 బస్సులు మాత్రమే తిరుమల - తిరుపతి మధ్య నడుస్తున్నాయి. ఇదే జరిగితే ఉత్సవాలకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించడానికి ముందే ప్రయివేటు టాక్సీల యాజమానుల నిలువుదోపిడీకి గురి కాకతప్పదన్నది భక్తుల వాదన. ఈ పరిస్థితులను కూడా టిటిడి అంచనా వేసి ఇటు కేంద్ర రైల్వే బోర్డుతోనూ, రాష్ట్ర ఆర్‌టిసి యాజమాన్యాలతోనూ చర్చించి బ్రహ్మోత్సవాల భక్తుల కోసం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుంది. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే సర్వసాధారణంగా బ్రహ్మోత్సవాలు దశరా సెలవుల్లో నిర్వహిస్తారు. ఈ యేడాది కూడా దసరా సెలవుల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో ఏపి ఎన్‌జిఓలు ఇప్పటికే సీమాంధ్రలోని పాఠశాల దగ్గర నుండి వర్శిటిల వరకూ అన్నింటిని మూయించి వేశారు. ఈ పరిస్థితుల్లో దసరా సెలవుల్లో పాఠశాలలు, కళాశాలలు నడుపుకోవచ్చునని ఏపి ఎన్‌జిఓలు అనుమతి ఇచ్చారు. అది జరిగి విద్యార్ధులకు సెలవులు లేకపోయినా 13 సీమాంధ్ర జిల్లాల్లోని ప్రజలు మాత్రమే ఉత్సవాలకు తక్కువ మొత్తంలో హాజరు అవుతారు. తమిళనాడు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు లేకపోవడంతో దశరాకు విద్యాసంస్ధలకు కచ్చితంగా సెలవులు వుంటాయి. వారికి రవాణా సౌకర్యాలు లేకపోతే వారు కూడా తిరుమలకు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. టిటిడి యాజమాన్యం వీటన్నింటిని పూర్తి స్ధాయిలో అధ్యయనం చేస్తున్నట్లు కనిపిస్తున్నా మరో 10 రోజుల్లో జరుగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భరోసా ఇస్తూ అధికార ప్రకటన చేయలేకపోతుంది. ప్రత్యేక రైళ్లు, తిరుమలకు అదనపు బస్సులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నామన్న ప్రకటన ఇవ్వగలిగితే తప్ప భక్తులు తిరుమల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోలేరు. చివరి నిమిషంలో ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం లేదన్నది విశే్లషకుల వాదన. ఇక సీమాంధ్రలోని కర్నూలుకు చెందిన రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి టిటిడికి సహకారం అందించేందుకు వత్తిడి చేయాల్సిన అవసరం వుందని భక్తులు అంటున్నారు. అలా కాని పక్షంలో ప్రధాన మంత్రికి అయినా ప్రత్యేక రైళ్ల కోసం విజ్ఞప్తి చేయడం కోసం టిటిడి యాజమాన్యం ఒక అధికార బృందాన్ని ఢిల్లీకి పంపాలని భక్తులకు కోరుతున్నారు. అలా సాధ్యం కాని పక్షంలో పార్లమెంటు సభ్యుడుగాను, టిటిడి చైర్మన్‌గాను వున్న కనుమూరి బాపిరాజు చొరవతో అయినా ప్రత్యేక రైళ్లపై దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది.

పాత టిక్కెట్లు - కొత్త నిబంధనలు
* అమ్మవారి ఆర్జిత టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
* రోజూ... రచ్చ.. రచ్చే..
తిరుచానూరు, సెప్టెంబర్ 25: కొత్తసీసాలో పాత సిరా అన్న చందాన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పాత టిక్కెట్లపై కొత్త ధరలను ముద్రించి విక్రయిస్తుండటంతో భక్తుల్లో గందరగోళం నెలకొంటోంది. అలా అని ఇక్కడేదో మోసాలు జరిగిపోతున్నాయంటే అదేమి లేదు. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు టిటిడి యాజమాన్యం నిర్ణయించిన ధరకే విక్రయించినప్పటికి ఆ సేవకు అనుమతించే భక్తుల సంఖ్యపైనే తంటా వస్తోంది. పాత టిక్కెట్లపై భక్తుల అనుమతి సంఖ్య ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం అనుమతిస్తున్న భక్తుల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈ అంశంపై ప్రతినిత్యం ఆలయ అధికారులతోనూ, సిబ్బందితోనూ భక్తులు వాగ్వివాదాలకు దిగుతూ ఇక్కడేదో మోసం జరుగుతుందనే అపోహలు పెంచుకుంటున్నారు. ఈ తంటాకు ప్రధాన కారణం ఏమిటంటే ఆర్జిత సేవా విక్రయాలకు సంబంధించి టిటిడి పెద్ద సంఖ్యలో ప్రింటెండ్ టిక్కెట్లను ముద్రించింది. ఆ టిక్కెట్ల వెనుకభాగాన ఒక్కొక్క సేవ ధర ఎంత? ఆ సేవకు ఎంత మందిని అనుమతిస్తారు? ఎలాంటి ప్రసాదాలను ఉచితంగా ఇస్తారు? అనే అంశాలను ముద్రించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో సోమవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, గురువారం నిర్వహించే తిరుప్పావై, శుక్రవారం నిర్వహించే అభిషేకం వాటి పాత ధరలు ముద్రించి వున్నారు. ఈ యేడాది జూలైలో టిటిడి ధరల పట్టికలో మార్పులు తీసుకురావడంతో పాటు అనుమతించే భక్తుల సంఖ్యను కూడా కుదించి పేద, మధ్య తరగతి భక్తులు సైతం ఏ సేవలో అయినా పాల్గొనే అవకాశం కల్పించింది. ఇంత వరకూ బాగానే వుంది. ఆ పాత టిక్కెట్లపై అనుమతించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుండటం, ప్రస్తుతం అనుమతించే భక్తుల సంఖ్య తక్కువగా వుండటం అపోహలకు దారి తీస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. గతంలో కల్యాణోత్సవ సేవా టిక్కెట్లు 500 రూపాయలకు విక్రయించేవారు. ఈ టిక్కెట్టుపై ఇద్దరు గృహస్తులను, అధనంగా మరో ముగ్గుర్ని అనుమతించేవారు. ప్రస్తుతం టిక్కెట్టు ధర 500 రూపాయలే అయినప్పటికి భార్య, భర్తలను మాత్రమే అనుమతిస్తున్నారు. తక్కిన ప్రసాదాలు, ఇతర సౌకర్యాలు యధాతధంగానే వున్నాయి. ఈ ధరల మార్పులు తెలియని భక్తులు ఐదుగురిని టిక్కెట్టుపై ఎందుకు అనుమతించరంటూ సిబ్బందితో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఇది కల్యాణోత్సవ సమయంలో రచ్చరచ్చగా మారుతోంది. భక్తులకు వాస్తవాలను వివరించేటప్పటికి అధికారులకు తలప్రాణం తోకకు వస్తోంది. గురువారం నిర్వహించే తిరుప్పావై టిక్కెట్టును గతంలో 3వేల రూపాయలకు విక్రయించి ఐదుగురు భక్తులను అనుమతించేవారు. సామాన్య భక్తుల సౌలభ్యం, ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుప్పావైలో పాల్గొనాలనే ఒక సదాశయంతో ఒక టిక్కెట్టు ధరను 600 రూపాయలకు కుదించి ఒకర్ని అనుమతిస్తూ అందుకు ఇచ్చే జిలేబి, మురుకు లాంటి ప్రసాదాలను కూడా కుదించారు. పాత టిక్కెట్లపై వున్న ప్రకారం ఎందుకు అనుమతించరంటూ భక్తులు నానా హైరానా చేస్తున్నారు. ఇతర వారోత్సవ సేవలు సైతం వున్నాయి. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే గతంలో 40, 10 రూపాయలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విక్రయించేవారు. వీటిని రెండేళ్లక్రితమే ఈ ధరలకు విక్రయించే టిక్కెట్లను టిటిడి నిలుపుదల చేసింది. ప్రస్తుతం టిటిడి ఆర్జిత సేవా టిక్కెట్లు విక్రయిస్తున్న కంప్యూటరైజ్డ్ టిక్కెట్లలో అవి అమల్లో వున్నట్లు ముద్రించి వున్నారు. ఇది కూడా ఒక గందరగోళానికి దారి తీస్తోంది. 10 రూపాయల టిక్కెట్టును 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. పలు రకాల సిఫార్సులతో పైరవీకారులు టిక్కెట్లు కూడా కొనుగోలు చేయకుండా అమ్మవారిని జబర్ దస్తీగా దర్శించుకుంటూ వచ్చారు. ఇది అమ్మవారి ఆదాయానికి గండి కొడుతుందని అప్పటి అధికారులు గోపాలకృష్ణ, వేణుగోపాల్‌లు ఈ విషయాన్ని ఇఓ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గతంలో వున్న ఇఓలు ఈ విషయాలను గమనించి విఐపిల కోసం 100 రూపాయలుగా నిర్ణయించి విక్రయిస్తున్నారు. దీంతో వచ్చేవారు ప్రభుత్వపు అతిథులు అయితే వారికి ఉచితంగా దర్శనం కల్పిస్తున్నారు. తక్కినవారు ఎవరైనా, ఎంతటి వారైనా వంద రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసి వెళ్లేలా నిబంధలు అమలు చేస్తున్నారు. తద్వారా అమ్మవారి ఆదాయం కూడా పెరిగింది. ఇక కుంకుమార్చనకు అప్పుడు, ఇప్పుడు కూడా 200 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఆ సేవ చేయదలచుకున్నవారు విధిగా ఆ టిక్కెట్టు కొనుగోలు చేయాల్సిందే. ఇదిలా వుండగా కొత్త ధరలు, కొత్తనిబంధనలు తెలియజేసే బోర్డును భక్తులెవరి కంటపడకుండా ఎక్కడో ఉంచడంతో అసలు సమస్య తలెత్తుతూ ఉంది. మరో నిర్లక్ష్యం ఏమిటంటే పాత టిక్కెట్ల ధరతో విక్రయించిన కంప్యూరైజ్డ్ టిక్కెట్లను కొత్తవాటిని ముద్రించి విక్రయిస్తే ఇటు భక్తులకు అటు అధికారులకు కూడా సమస్యలు తలెత్తే ప్రశే్నలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే పాత ధరలు, పాత నిబంధనలతో ముద్రించిన టిక్కెట్లు ఎక్కువగా వున్నాయని, అవి పూర్తి అయిన తరువాత కొత్తవాటిని ముద్రిస్తామంటూ అభిభాషణలు ఇస్తున్నారు. అధికారులకు, సిబ్బందికి తలనొప్పిగాను, భక్తుల్లో అపోహలు సృష్టించే పరిస్థితి వుండి టిటిడి ఆధ్వర్యంలోనే అత్యంత అధునాతనమైన ముద్రణాలయం వున్నప్పుడు అంత అలసత్వం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయిన వారు కాని వారు అడ్డదిడ్డంగా టిటిడిలో కోట్లకు కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడుతుంటే నిబంధనలు మార్చినప్పుడు కొత్త టిక్కెట్లు ముద్రించడానికి టిటిడికి వచ్చిన అడ్డేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని టిక్కెట్ల విక్రయంలో టిటిడికి కొంత ఆదాయం వస్తున్నప్పుడు చిన్నపాటి వ్యయం చేయడానికి అధికారులు మేథోమధనం చేయడం సమంజసం కాదంటున్నారు. అంతేకాకుండా కనీసం కొత్త ప్రింటెడ్ టిక్కెట్టు ముద్రించేంత వరకూ అయినా పెద్ద ఎత్తున సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని భక్తులకు కోరుతున్నారు. వాస్తవానికి బోర్డులు తయారు చేసే వ్యయంతో కొత్త టిక్కెట్లను ముద్రించవచ్చునన్నది మరో వాదన. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విషయంలో ఇలాంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడిన అధికారులు అమ్మవారి భక్తులకు సంబంధించిన అంశంపై అలసత్వం చూపడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇక టిటిడి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే...

తిరుపతి జువైనల్ హోమ్ నుండి 18 మంది బాలనేరస్థులు పరార్
* 9 మంది పట్టివేత - మిగతావారి కోసం గాలింపు
* హోమ్‌ను సందర్శించిన అర్బన్ ఎస్‌పి
* బాలనేరస్థులను ఇబ్బంది పెట్టడంతోనే పరారీ
తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుపతి మంగళంలోని బాలనేరస్తుల కేంద్రం నుండి మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో బాత్‌రూమ్ కిటికీ అద్దాలు పగులగొట్టి 18 మంది బాలనేరస్తులు పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న జువైనల్ హోమ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే రేణిగుంట చేరుకున్న 8 మంది బాలనేరస్తులను, తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉన్న మరో బాలనేరస్తుడ్ని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకున్నారు. సంఘటన సమాచారం అందుకున్న అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు మంగళవారం రాత్రి బాలనేరస్తుల హోమ్‌ను సందర్శించారు. అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. బాత్‌రూమ్ కిటికి అద్దాలు పగులగొట్టి అక్కడ నుండి పైపుల ద్వారా వెలుపలకు దిగి, అక్కడి నుండి బాలనేరస్తులు పరారయ్యారు. బాలనేరస్తుల కేంద్రంలో పిల్లలపట్ల సిబ్బంది కఠినంగా వ్యవస్తురిస్తున్నారని, సిబ్బంది వేదింపులతో పాటు సరైన భోజన ఆహారాలు అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఉడికీ ఉడకని అన్నం తినలేక బాలనేరస్తులు ఇబ్బందులు పడుతున్నారని, సరైన నిఘా లేకపోవడంతో సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని స్థానికులు అంటున్నారు. గతంలో అనేక మంది కూడా ఇక్కడి నుండి తప్పించుకుని పరారయ్యారని, అయితే గుట్టుచప్పుడు కాకుండా పట్టుకుని తిరిగి హోమ్‌లో పెట్టి బంధించిన సంఘటనలు కూడ లేకపోలేదు. అర్బన్ ఎస్‌పి ఈ సంఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా కాపాడుకుంటూ వస్తున్న తమ అవినీతి, అక్రమాల వ్యవహారం బాలనేరస్తుల పరారీతో అంతా బయటపడుతుందన్న భయం అక్కడ పనిచేసే ఉద్యోగ సిబ్బందిలో వ్యక్తమవుతోంది. ఈ విషయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో వేచిచూడాలి.
విధినిర్వహణలో అశ్రద్ధ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోండి
- రాటకొండ
తిరుపతి సమీపంలోని మంగళం బాలనేరస్తుల గృహం నుండి 18 మంది తప్పించుకుని పారిపోయిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి రాటకొండ విశ్వనాధ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతాయన్నారు. ఇప్పటికే ఈజువైనల్ హోమ్ నుండి అనేక మంది పిల్లలు తరచూ పారిపోతూ వుంటారని, బాహ్యప్రపంచానికి తెలియకుండా హోమ్ సూపరింటెండెంట్ మేనేజ్ చేస్తూ వస్తుంటారని విమర్శించారు. మంగళవారం పెద్ద సంఖ్యలో పిల్లలు పరార్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. హోమ్‌లో వుంటున్న పిల్లల పట్ల నిర్వాహకులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సరైన వసతి, సౌకర్యాలు కల్పించకపోవడం, నాణ్యమైన భోజనాలు అందించకపోవడంతోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. ఈ హోమ్‌లో జరుగుతున్న అనేక సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఫక్షంలో బిజెవైఎం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వుంటుందని ఆయన హెచ్చరించారు.

సమైక్యాంధ్ర కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నాం
* చిత్తూరు ఎంపి శివప్రసాద్ వెల్లడి
చంద్రగిరి, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర సాధనకోసం ఇప్పటి వరకూ తాము చెయ్యాల్సిన మానవ ప్రయత్నం చేశామని, ఇక దైవ ప్రయత్నం కోసం ప్రార్థనలు చేస్తున్నామని చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం చంద్రగిరిలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సప్పరాలు వేషం వేసి మూలస్థాన ఎల్లమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశామని, ఇక దైవ ప్రయత్నాలు ప్రాంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తాను పార్లమెంటు శ్రీకృష్ణ రాయభారం చేశామని, సీమాంధ్ర ఉద్యమాన్ని సిడి రూపంలో పార్లమెంటులో అందజేశానన్నారు. పార్లమెంటు ఎదుట కొరడాతో కొట్టుకుంటూ నిరసన తెలిపానన్నారు. రాష్ట్రాల విభజనకు ఒక పద్ధతి ఉందని, కేంద్రం ఆ పద్ధతిని విడిచిపెట్టి సీమాంధ్ర ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. మన సంక్షేమాన్ని పట్టించుకుంటారని కేంద్రలో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే ముక్కలు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలు పుష్పావతియాదవ్ పుష్పగిరిని తన కార్యకర్తలతో మోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పులివేషాలు, మహిళల నృత్యాలు తదితర వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, తెలుగుయవత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, వి దశరథ రామానాయుడు, శాప్స్ నగర జెఎసి కన్వీనర్ డాక్టర్ సుధారాణి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఎన్ రాజారెడ్డి, ఎంపిడిఓ రాజశేఖర్, తహశీల్దార్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై విహరించిన బొజ్జగణపయ్య
ఐరాల, సెప్టెంబర్ 25: కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకునికి జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తుల కోర్కెలు తీర్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, ఆలయ సిబ్బంది ఉభయదారులుగా వ్యవహరించారు. రాత్రి కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ చేసిన కల్పవృక్ష వాహనంలో ఉత్సవ మూర్తులను అధిరోహించి ఊరేగించారు. ఆలయ ఇఓ పూర్ణచంద్రరావు, ఎఇఓలు ఎన్‌ఆర్ కృష్ణారెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్‌పెక్టర్లు రవీంద్రబాబు, భక్తులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లో నేడు
ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పూలంగిసేవను నిర్వహించనున్నారు. ఈ సేవకు ఉభయదారులుగా రాజమాణిక్యం నాయుడు అండ్ సన్స్ వేలూర్, కె.రాథాకృష్ణ-కాణిపాకంలు ఉభయదారులుగా వ్యవహరిస్తారు.
చందనాలంకారంలో దర్శనమిచ్చిన గణనాధుడు
వరసిద్ధి వినాయకుడు బుధవారం చందనాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉభయదారులైన ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, ఉద్యోగులు స్వామివారి మూలవిరాట్‌కు ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందనాలంకారంతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వైభవంగా శతకళశ క్షీరాభిషేకం
ఉత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవ రోజుల ఆలయ అధికారులు అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం ఉదయం కార్యనిర్వహణ అధికారి ఇంటి వద్ద నుంచి ఉభయదారులుగా శతకలశాలలో పాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ అనే్వటి మండపంలో సిద్దిబుద్ది సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ మూర్తులకు ఘనంగా శతకళశాలలో తీసుకొచ్చిన పాలతో అభిషేకం నిర్వహించారు.
అలరించిన కేరళ వాయిద్యం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి కల్పవృక్ష వాహనం సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకొంది. రాత్రి కల్పవృక్షవాహనం కాణిపాకం నాలుగు మాడవీధులలో ఊరేగుతుండగా వాహనం ముందు భాగంలో కేరళకు చెందిన కళాకారులు వాయించిన వాయిద్యం అందరినీ ఆకట్టుకొంది.

అర్ధరాత్రి వేళ.. టమోటా రైతుల ఆందోళన
* వేలానికి ససేమిరా
* ఆందోళనలో మార్కెటింగ్ అధికారులు, వ్యాపారులు
మదనపల్లె, సెప్టెంబర్ 25: జై సమైక్యాంధ్ర బంద్ మదనపల్లెలో జోరుగా సాగుతోంది. వీరికి మద్దతుగా వ్యవసాయ టమోటామార్కెట్‌యార్డు అధికారులు, మండీ యజమానులు, వ్యాపారులు సమ్మెకు దిగారు. బుధవారం ఉదయం నుంచి మార్కెట్‌లో వేలం జరుగుతుందని రైతులు సాగు చేసిన పంటను మంగళవారం అర్ధరాత్రి మార్కెట్‌కు తరలించగా.. రెండువైపుల గేట్లు మూసివేసి తాళాలు వేసివుండటంతో మార్కెట్‌కు వచ్చిన వాహనాలు జాతీయ రహహదారిపై నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారుల నుంచి వస్తున్న వేధింపులు తాళలేక రైతులు మార్కెట్‌గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెండవ పట్టణ పోలీసులు.. సమ్మెలో ఉన్న అధికారులు మాట్లాడి మార్కెట్‌యార్డు గేట్లు తెరిపించారు. దీంతో టమోటాలను ఆయా మండీల వద్ద వేలానికి సిద్ధం చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు జరగాల్సిన వేలం వ్యాపారులు రాకపోవడం, మండీ యజమానుల రైతులతో చర్చించారు. కొంతమంది మండీ యజమానులు రైతులు తీసుకువచ్చిన టమోటాలను కొనుగోలు చేసే యత్నం చేశారు. మండీ యజమానుల యత్నాలు రైతులు గ్రహించి ప్రతిఘటించారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన టమోటాలకు వేలం నిర్వహించాలని, లేనిపక్షంలో రెగ్యులర్‌గా వచ్చే టమోటాలు మదనపల్లె మార్కెట్‌కు తీసుకురాకుండా కర్నాటక, తమిళనాడు నుంచి వచ్చే వ్యాపారులకు నేరుగా అమ్ముకుంటామని రైతులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రైతులు ఆందోళన నిర్వహించి మార్కెట్‌లోని టమోటాలను తిరిగి తీసుకెళ్ళేందుకు వాహనాలను సిద్ధం చేసుకున్నారు. దీంతో వ్యాపారులను పిలిపించి మండీ యాజమానులు వేలం నిర్వహించడంతో సమస్య సద్దుమణిగింది.
టమోటాకు జాక్‌పాట్ వేలం..
నష్టపోతున్న రైతులు
మార్కెట్‌కు వచ్చిన టమోటాలు వెనక్కు వెళ్ళకుండా కొనుగోలుచేసేందుకు సిద్ధమైన వ్యాపారులు జాక్‌పాట్‌గా వేలం నిర్వహించాలని కోరారు. అధికారులు సమ్మెలో ఉండటంతో జాక్‌పాట్ వేలంపాట మూడుపువ్వులు ఆరుకాయలుగా నిర్వహించారు. బుధవారం కిలోటమోటా మొదటి రకం రూ.10లు పలుకగా, రెండవరకం రూ.6లు పలికింది. మూడవరకం రూ.3లు పలికింది. పక్క రాష్ట్రాలలో టమోటా డిమాండ్ కావడంతో ధరలు అధికంగా ఉన్నప్పటికీ వ్యాపారులు, దళారుల మద్య కుదుర్చుకున్న జాక్‌పాట్ వేలంపాటలతో రైతులు నష్టపోతున్నారు. అధికారులకు మొరపెట్టుకుందామంటే.. అధికారులు సమ్మెలో ఉన్నారు. దీంతో రైతులు చేసేదిలేక వచ్చినకాడికి టమోటాలను అమ్ముకుని వెనుదిరిగారు.

కళ్లకు గంతలు కట్టుకుని ఉద్యోగ జెఎసి నేతలు నిరసన
* డప్పుకొట్టిన ఆర్‌డిఓ రామచంద్రారెడ్డి
* గడ్డి తింటూ వ్యవసాయకళాశాల ఉద్యోగుల వినూత్న నిరసన
తిరుపతి, సెప్టెంబర్ 25: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట ఉద్యోగ జెఎసి శిబిరంలో బుధవారం నాడు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌డిఓ, తిరుపతి ఉద్యోగ జెఎసి కన్వీనర్ రామచంద్రారెడ్డి డప్పు కొడుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఎపి ఎన్‌జిఓలు చేసే సమ్మె ఉద్ధృతం కాకముందే కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని లేని పక్షంలో జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. సీమాంధ్రలో ఉద్యమం కారణంగా ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, వేలాది కోట్ల రూపాయలు ఉద్యోగులు జీతాలు నష్టపోయారని వీటిని కేంద్ర ప్రభుత్వమే భరించి నష్టాన్ని పూడాల్సి వుంటుందని హెచ్చరించారు. వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో ఆర్‌టిసి జెఎసి గౌరవాధ్యక్షుడు మునిసుబ్రహ్మణ్యం, ఆవుల ప్రభాకర్, ప్రకాష్, టీచర్స్ జెఎసి నేతలు గోపాల్, నిర్మల, ఏపి ఎన్‌జిఓలు ధనంజయులనాయుడు, గోవర్ధన్‌స్వామి, రెవెన్యూ అసోసియేషన్ నేతలు నరసింహులనాయుడు, అశోక్‌రెడ్డి, తహశీల్దార్లు నాగార్జునరెడ్డి, యుగంధర్, మనోహర్, వెంకటరమణ, డిటిలు శేషగిరిరావు, రమణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు ఈకలు, గడ్డి తింటూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే తమకు గడ్డి కూడా కరువు అవుతుందని, అన్నం లేక గడ్డి తిని బతకాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కుండలు చేస్తూ ఎమ్మెల్యే కరుణ నిరసన
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రోజుకో వృత్తితో వినూత్న నిరసనలు చేస్తున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి బుధవారం తుడా సర్కిల్ వైసిపి శిబిరంలో కుమ్మరి కుండలు చేస్తూ వినూత్న నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలు, పిజిలు చేసిన సీమాంధ్ర విద్యార్థులు తమకు ఇక దిక్కులేని పరిస్ధితుల్లో కులవృత్తులను చేసుకుని జీవించాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌పి తిరుపతి పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వి వరప్రసాదరావు, నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి,జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు ఎస్‌కెబాబు, ఎంవిఎస్‌మణి, హనుమంతనాయక్, తాళ్లూరి ప్రసాద్, లతారెడ్డి, సిద్దారెడ్డి, బొడ్డునాదమునిరెడ్డి, వెంకటేష్, కుసుమకుమారి, రాజేంద్ర, మంజుల, లత, గీత, వాణి తదితరులు పాల్గొన్నారు.

* ప్రత్యేక రైళ్లపై దృష్టిపెట్టకపోతే అసలుకే మోసం
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>