న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడంతో అఖిలేష్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. మతకలహాలకు బాధ్యులైన వారిపై చర్యతీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందిని నిప్పులు చెరిగారు. తక్షణమే శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు యూపీలో రాష్టప్రతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిస్థితి ఎప్పటికప్పుడు క్షీణిస్తునే వచ్చిందని, అంతటా ఆటవిక రాజ్యమే కొనసాగుతోందని మాయావతి అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల మతకలహాలు తీవ్రస్థాయిలోనే చోటుచేసుకున్నాయని ముజఫర్‌నగర్ అల్లర్లు అందుకు పరాకాష్టఅని ఆమె తెలిపారు. ఈపరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు కోసం రాజ్యాంగంలోని 356 ఆధికరణ కింద తక్షణమే రాష్టప్రతి పాలన పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్టప్రతిని కలుసుకున్న అనంతరం ఆమె విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. అలాగే అల్లర్ల భయంతోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారపోయిన వారిలో ధైర్యాన్ని పాదుగొల్పడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాయావతి ఆరోపించారు. ఇప్పటికీ కూడా ఇళ్లకు తిరిగిరావడానికి భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మత ఘర్షణల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు సాగిస్తోందని, హింసను ప్రేరేపించారన్న ఆరోపణతో బిఎస్పీ, బిజెపి నేతలను అరెస్టు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్, ఎస్‌పిలకు చెందిన ముస్లిం నాయకులను అరెస్టు చేయలేదంటే అల్లర్ల విషయంలో అఖిలేష్ సర్కార్ ఎంతు ఉదాసీనంగా వ్యవహరిస్తోందో కళ్లకు కట్టేదేనని అన్నారు.
విలేఖర్లతో మాట్లాడుతున్న మాయావతి