వాషింగ్టన్, సెప్టెంబర్ 27: అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలన్న దృఢ సంకల్పాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా అమెరికాతో అన్ని రకాలుగా సన్నిహిత సంబంధాలు పెంపొందాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపేందుకు మన్మోహన్ సింగ్ గురువారం ఇక్కడికి చేరుకున్నారు. మన్మోహన్, ఒబామాలు తమ శిఖరాగ్ర స్థాయి సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను సమీక్షించనున్నారు. ప్రత్యేకంగా రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, పౌర అణు ఇంధన సహకారం వంటి రంగాలలో భవిష్యత్తులో అమలు చేయనున్న విధానాలను రూపొందిస్తారు. అమెరికా వీసా నిబంధనల్లో మార్పుల వల్ల భారత్‌కు చెందిన ఐటి వృత్తినిపుణుల ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్ ఆందోళనగా ఉన్నందున, ఈ అంశాన్ని ఒబామాతో జరిగే చర్చల్లో మన్మోహన్ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇది మన్మోహన్, ఒబామాల మధ్య జరుగుతున్న మూడో శిఖరాగ్ర స్థాయి సమావేశం. అమెరికాతో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసుకునే ఉద్దేశంతో వచ్చిన మన్మోహన్‌కు ఇక్కడి ఆండ్రూస్ వైమానిక స్థావరంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటి చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ రోజ్‌మేరీ పౌలి స్వాగతం పలికారు. అనంతరం మన్మోహన్ వైమానిక స్థావరంలో మీడియాతో మాట్లాడుతూ అమెరికా భారత్‌కు ‘ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి’ అని అభివర్ణించారు. ఇరు దేశాలు తమ మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని విభిన్న రంగాలకు విస్తరించేందుకు, బలోపేతం చేసుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఇరు పక్షాలు ఇదివరకు తీసుకున్న చర్యల పురోగతిని సమీక్షించడంతో పాటు తమ భాగస్వామ్యాన్ని మరింత అర్థవంతమైనదిగా, పటిష్ఠమైనదిగా తీర్చిదిద్దేందుకు మున్ముందు ఏం చేయగలమనేదానిపై చర్చించడం జరుగుతుందని మన్మోహన్ తెలిపారు. ‘మాకున్న అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో అమెరికా ఒకటి. అధ్యక్షుడు ఒబామా హయాంలో ఇరు దేశాల మధ్య గల ఈ భాగస్వామ్యాన్ని విభిన్న రంగాలకు విస్తరించేందుకు, బలోపేతం చేసుకునేందుకు మేము చాలా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ఈ పర్యటనలో వాటి ప్రగతిని సమీక్షించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాం’ అని మన్మోహన్ వివరించారు. భారత్‌కు అమెరికా ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని, భారత్‌లో పెట్టుబడులు పెట్టే ముఖ్యమైన దేశమని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత్ అభివృద్ధికి ఎక్కువగా సాంకేతిక మద్దతును అందిస్తున్న దేశం అమెరికా అని ఆయన తెలిపారు. అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలను పట్టుదలగా ముందుకు తీసికెళ్తున్న భారత్‌కు అమెరికా అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ వెంట ఆయన భార్య గురుశరణ్ కౌర్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ఉన్నారు. చర్చల అనంతరం ఇరుదేశాల అధినేతలు మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటనను విడుదల చేయనున్నారు.
ప్రధానికి స్వాగతం పలుకుతున్న భారత రాయబారి నిరుపమారావు