జమ్మూ, సెప్టెంబర్ 27: జమ్మూలోని కతువా, సాంబాలలో గురువారం జరిగిన జంట దాడులు లాంటి ఉగ్రవాద దాడులను అదుపు చేయడానికి రాష్ట్రంలో నిఘాను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం చెప్పారు. ఈ జంట దాడుల్లో సామాన్య పౌరులతో పాటు భద్రతా జవాన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరక్కుండా చూడడానికి రాష్ట్రంలో నిఘాను, భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారని ఒక అధికార ప్రతినిధి తెలిపారు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మఖ్యమంత్రి శుక్రవారం ఇక్కడి యూనిఫైడ్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ పని తీరును సమీక్షించారు. ఈ సమావేశంలో సైన్యం, ఇతర భద్రతా దళాలు, పోలీసు, రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి నిర్వహిస్తున్న ఆపరేషన్ల వివరాలను వారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారని ఆ ప్రతినిధి చెప్పారు. నిన్నటినుంచి జమ్మూలోనే ఉన్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ పని చేస్తున్న తీరును కూడా వివరించారని ఆయన చెప్పారు. ఉగ్రవాదుల దాడులను ముందుగా ఊహించి, వాటిని ఎదుర్కోవడంలో వివిధ భద్రతా ఏజన్సీల మధ్య ఉన్న సమన్వయం గురించి కూడా ముఖ్యమంత్రికి వారు ఈ సమావేశంలో వివరించారని ఆ ప్రతినిధి చెప్పారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి తారాచంద్, సైనిక దళాల ఉత్తర కమాండ్ ప్రధానాధికారి లెఫ్టెనెంట్ జనరల్ సంజీవ్ చాచ్రా, రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ ప్రసాద్, సైన్యం, ఇంటెలిజన్స్ ఏజన్సీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాదులు గురువారం జమ్మూ ప్రాంతంలోని ఒక పోలీసు స్టేషన్, మరో ఆర్మీ క్యాంప్‌పై జరిపిన ఆత్మాహుతి దాడిలో ఒక సైనికాధికారి సహా పది మంది చనిపోవడం తెలిసిందే.
....
కాశ్మీర్‌లో జరిగిన మిలిటెంట్ల దాడిలో మరణించిన
లెఫ్ట్‌నెంట్ కల్నల్ విక్రమ్‌సింగ్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న జవాన్లు
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా
english title:
kasmir
Date:
Saturday, September 28, 2013