న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఎన్నికలలో పోటీకి నిలబడిన అభ్యర్థులపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ఓటు పొందగల అర్హుడే లేడని తెలియచేసే అవకాశాన్ని ఓటింగ్ పరికరంలో పొందుపరచవలసిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పోటీకి దిగిన అభ్యర్థులపై ఓటర్లు వ్యతిరేకతను వ్యక్తం చేయటం వల్ల పార్టీలు అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తాయని ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. అభ్యర్థులను తిరస్కరించే అవకాశం లభించటంతో పార్టీలు అలోచనలో పడతాయన్నారు. ఏంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎన్నికల సంస్కరణలు ఈ తాజా తీర్పుతో ఊపందుకుని మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయనే ఆశాభావాన్ని మోడీ ఈ సందర్భంగా వెలిబుచ్చారు. అభ్యర్థులను తిరస్కరించే అవకాశాన్ని ఓటర్లకు కలిగించాలని తాను చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నట్లు గుర్తుచేశారు.
అయితే రానున్న ఎన్నికల్లో ఈ తీర్పు అమల్లోకి వస్తుందా? అన్న విషయమై అనుమానాన్ని వ్యక్తం చేశారు. అభ్యర్థులను తిరస్కరించే అధికారాన్ని ఓటర్లకు కల్పిస్తూ నిర్భంధ ఓటింగ్‌కు సంబంధించిన బిల్లును 2008, 2009లో తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని చెప్పారు. అయితే గవర్నర్ ఈ బిల్లును తొక్కిపెట్టారని ఆరోపించారు. కాగా, నిర్బంధ ఓటింగ్ వల్ల అనేక లాభాలున్నాయని, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ఇవ్వటానికి నిర్బంధంగా బడికి పంపటం తప్పుకానట్లే ఇష్టంలేని అభ్యర్థులను తిరస్కరించే అధికారం, హక్కు ఓటర్లకుండాలని ఆయన వత్తాసు పలికారు. అయితే ఈ తీర్పుతో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావటంలో యువత కీలక పాత్ర వహించాల్సి ఉంటుందని మోడీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ తమ పేరును ఓటర్‌గా నమోదు చేయించుకోని యువత వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా 18 నుంచి 24 సంవత్సరాల లోపున్న అనేక మంది ఓటర్లుగా నమోదుకాకపోవటం కంటే దురదృష్టం మరొకటి ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత వెంటనే తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవలసిందిగా మోడీ సూచించారు.
ఈవిఎంలలో అనర్హత సూచికపై సుప్రీం తీర్పును స్వాగతించిన మోడీ
english title:
p
Date:
Saturday, September 28, 2013