న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: న్యాయస్థానం దోషులుగా నిర్ధారించిన చట్టసభల సభ్యులపై వెంటనే అనర్హత వేటుపడకుండా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలనుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుబట్టడంపై ప్రతిపక్షాలు శుక్రవారం ధ్వజమెత్తాయి. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వ చర్య అర్థరహితమైందిగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పనికిమాలినవని దుమ్మెత్తిపోశాయి. ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరాశానిస్పృహలకు లోనైందన్న విషయాన్ని రాహుల్ వ్యాఖ్యలు బయటపెట్టాయని బిజెపి విమర్శించింది. మన్మోహన్ సింగ్‌కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడే అర్థరహితమైనవిగా బహిరంగంగా విమర్శించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ తేవడానికి బాధ్యులైన వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌ను విమర్శించడం ఓ నాటకమని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న గందరగోళాన్ని ఆయన వ్యాఖ్యలు బట్టబయలు చేశాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్ విమర్శించారు. రాహుల్ చాలా ఆలస్యంగా స్పందించారని సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా విమర్శించారు. అయితే ఇలా ఆలస్యంగా స్పందించినప్పటికీ, అది తప్పేమీ కాదని, మంచిదేనని, ఘనతను కొట్టేయడానికే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆర్డినెన్స్ తేవడానికి కేంద్రం చర్యలు తీసుకొని చాలా రోజులయ్యాక, ప్రస్తుతం అది రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముందుకు వెళ్లాక రాహుల్ గాంధీ స్పందించడం ఏంటని సిపిఎం నేత బృందాకారత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్‌కు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని బిజెపి అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ విషయంలో ఘోర తప్పిదానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ దానినుంచి తప్పించుకునే వ్యూహంలో భాగంగానే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి విమర్శించారు. ఇది ప్రభుత్వమా? లేక డ్రామా కంపెనీయా? అని బిజెపి మరో నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు.
రాహుల్‌పై ప్రతిపక్షాల ధ్వజం ప్రధాని రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్