న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తమ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రశ్నించిన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ అధినాయకత్వం మండిపడుతోంది. కిరణ్‌కుమార్ రెడ్డి ధిక్కార వైఖరి ఆధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. కిరణ్‌కుమార్ రెడ్డికి గుణపాఠం నేర్పించేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.
‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రశ్నించిన కిరణ్‌కుమార్ రెడ్డి తనంత తాను రాజీనామా చేస్తారు లేదా తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు వచ్చిన రోజు గవర్నర్‌ను కలిసి శాసన సభ రద్దుకు సిఫారసు చేయవచ్చు’ అని అంటున్నారు. ఇదేజరిగితే రాష్ట్రంలో రాష్టప్రతి పాలన తప్పదని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను విలేఖరుల సమావేశంలో కిరణ్‌కుమార్ రెడ్డి నిలదీయటంపై రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు అధినాయకత్వానికి శుక్రవారం రాత్రి ఫిర్యాదులు గుప్పించారు. కిరణ్‌కుమార్ రెడ్డిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలని వారు అధినాయకత్వానికి విజప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహమద్ పటేల్‌కు ముఖ్యమంత్రి ప్రసంగ పాఠాన్ని మేయిల్ చేశారు.
‘దేశం మొదటి ప్రధాన మంత్రి పండిత్ జవాహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తెలుగు ప్రజలను ఒకటిగా ఉంచితే ప్రస్తుత నాయకులు మాత్రం రాష్ట్రాన్ని విడదీస్తున్నారు.’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన ఆరోపణ పట్ల అధినాయకత్వం మండిపడుతోందని అంటున్నారు. ‘కిరణ్‌కుమార్ రెడ్డి తిరుగుబాటుకు సిద్ధమయ్యారు, అధినాయకత్వం నిర్ణయాన్ని తప్పుపట్టటంతోపాటు దానిని అమలు చేసే ప్రసక్తేలేదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని బెదిరిస్తున్నారు, ఇది ఎంతమాత్రం సహించరానిది.’ అని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయలో ధ్వజమెత్తు తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రసంగం పూర్తి పాఠాన్ని పరిశీలించిన అనంతరం ఏం చేయాలనేది నిర్ణయిస్తారని ఏఐసిసికి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
కిరణ్‌ను తొలగించండి: పాల్వాయ
కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డిని వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు.
గోవర్దన్ రెడ్డి శుక్రవారం రాత్రి విలేఖరులతో మాట్లాడుతూ సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను బహిరంగంగా ప్రశ్నించిన కిరణ్ ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగకూడదని స్పష్టం చేశారు. సోనియాని ప్రశ్నిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రి వర్గం నుండి వెంటనే రాజీనామా చేయాలని ఆయన తెలంగాణ మంత్రులకు సూచించారు. అధినాయకత్వం నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు, ఆయన ఎందుకు రాజీనామా చేయటం లేదని గోవర్దన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్ర మంత్రివర్గంలోని తెలంగాణ మంత్రు లు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి సోనియా గాంధీ పట్ల తమ విధేయతను చాటుకోవాలని ఆయన హితవు చెప్పారు.
అప్పుడు నిద్దుర పోయారా: విహెచ్
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిద్రపోయారా? అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రశ్నించారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని లోగడ చెప్పి, నిర్ణయం తీసుకున్న తర్వాత ధిక్కార స్వరం వినిపించడం ఎంత వరకు సమంజసమని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఇంకా ఎంత కాలం సీమాంధ్ర ప్రజలను మోసగిస్తారని ఆయన ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానాన్ని ఎంపి లగడపాటి విమర్శించడాన్ని విహెచ్ తప్పుపట్టారు.
‘తిరుగుబాటు’పై అధిష్ఠానం ఆగ్రహం అధినాయకత్వాన్ని నిలదీయడంపై తెలంగాణ నాయకుల ఫిర్యాదు
english title:
s
Date:
Saturday, September 28, 2013