Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమ్మె విరమించండి

$
0
0

హైదరాబాద్, సెప్టెంబర్ 27: సీమాంధ్రలో దీర్ఘకాలంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సమ్మె విరమణకు విజ్ఞప్తి చేశారు. అక్కడ జరుగుతున్న ఆందోళన, సమ్మె, ఉద్యోగుల చిత్తశుద్ధిని అధిష్టానం గుర్తించడమే కాకుండా, ప్రపంచం మొత్తానికి తెలిసిందని, ఇదే సమయంలో అక్కడి ప్రజల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు కలిసి దాదాపు ఆరున్నర లక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారని, దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. సమ్మె కారణంగా విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడినట్లు ఆయన వివరించారు. సమైక్యం కోసం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కూడా కేంద్రంపై వత్తిడి తీసుకువస్తున్నారని గుర్తుచేశారు. నెలకు ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులకు 1300 కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించాల్సి ఉండగా, గత నెల కేవలం 300 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయని చెప్పారు. దీనివల్ల ఉద్యోగులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించాలన్నారు. పాఠశాలలు మూతపడడం వల్ల విద్యార్ధుల భవిష్యత్తుకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన కమిటీలు చర్చిస్తున్నాయని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తున్నారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెను విరమించాలని పిలుపునిచ్చారు.

మోపిదేవిని పరామర్శించిన జగన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: అనారోగ్యంతో బంజరాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోపిదేవి వెంకటరమణను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అక్రమ ఆస్తుల కేసులో మోపిదేవి చంచల్‌గూడ జైల్లో ఉండి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి విదితమే. ఆయన అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చేరారు. మోపిదేవిని పరామర్శించిన వారిలో గుంటూరు కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నారు. బెయిల్‌పై విడుదలయ్యాక ఇంటి నుంచి బయటకు రావడం ఇదే ప్రథమం.
‘సమ్మె’పై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్ర విభజన ప్రతిపాదనను నిరసిస్తూ నెలన్నర రోజుగా సీమాంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం కూడా ఇరు పక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా దాఖలుచేయగా, హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. శనివారం లేదా సోమవారం తీర్పు వెలువడే వీలుంది.
ఇడుపులపాయ అనుమతిపై 30కి వాయిదా
కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ వెళ్ళాలన్న పిటిషన్‌పై కోర్టు 30కి వాయిదా వేసింది. అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పులివెందులతో పాటు ఇడుపులపాయ, గుంటూరు జిల్లాల్లో పర్యటించాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కౌంటర్ అపిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.
జగ్గారెడ్డి సిఎం పెంపుడు కుక్క: టిఆర్‌ఎస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కు పెంపుడు కుక్కని టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాల్క సుమన్, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం సుమన్, శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తన పెంపుడు కుక్క అయిన జగ్గారెడ్డిని తెలంగాణ ఉద్యమ నాయకత్వంపై ఉసికొల్పుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చి అవమాన పర్చారని వారు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తోన్న ముఖ్యమంత్రి వైఖరిని తెలంగాణ మంత్రులు నిలదీయాలని వారు డిమాండ్ చేసారు. జగ్గారెడ్డి ఆంధ్రరక్తమని వారు విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమ నాయకులపై జగ్గారెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలను మానుకోకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. జగ్గారెడ్డి ఇటు కెసిఆర్‌ను తిట్టి, అటు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి జోలే పడుతారని దుయ్యబట్టారు. జగ్గారెడ్డిని తెలంగాణ సమాజం ఎప్పుడో వెలివేసిందని వారు విమర్శించారు. జగ్గారెడ్డిని తిట్టినా, కుక్కను తిట్టినా ఒక్కటేనని ఎద్దేవా చేసారు.

సుప్రీం తీర్పును
స్వాగతించిన బాబు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరిస్తూ ఓటు వేసేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు చంద్రబాబు ఒక ప్రకటనలోతెలిపారు. ఎన్నికల్లో సంస్కరణలు, ఓటింగ్ విధానంలో పారదర్శకత పెరగాలని టిడిపి మొదటి నుంచి పోరాడుతోందని తెలిపారు. దీనిలో భాగంగానే తన ఓటు తాను కోరుకున్న అభ్యర్థికి పడిందో లేదో నిర్థారించుకునేలా ఓటు వేశాక ఒక పేపర్ ప్రింటు కాపీ వచ్చేలా ఏర్పాటు చేయాలని టిడిపి డిమాండ్ చేస్తోందని తెలిపారు.
- భత్కల్ ఇచ్చిన సమాచారం నేపథ్యం -
కీలక సమాచారం కోసం
హైదరాబాద్‌కు వచ్చిన ఎన్‌ఐఎ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల సంఘటనలో కీలక పత్రాలు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది యాసిన్ బత్కల్ విచారణలో అనేక విషయాలను ఎన్‌ఐఎకి అందించారు. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేరుతో దేశంలో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు భత్కల్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ముంబైలో బాంబు పేలుళ్లకు కుట్రపన్నామని విచారణలో చెప్పడంతో ఎన్‌ఐఎ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముంబై కాకుండా దేశంలోని ఇతరత్రా ముఖ్య నగరాల్లో బాంబు పేలుళ్లకు పథకాలు రచించిన సంఘటనలపై సమాచారం తెలుసుకోవడానికి ఎన్‌ఐఎ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. పాతబస్తీలో తలదాచుకున్న ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సోదాల్లో బాంబులకు సంబంధించిన వస్తువులతో పాటు పేలుళ్ళుకు సంబంధించిన సమాచారం లభించాయ.
చివరి బంతి లేదు...్థర్డ్ అంపైర్ లేడు
పిసిసి మాజీ అధ్యక్షుడు డిఎస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయింది, ఇక చివరి బంతి లేదు, థర్డ్ అంపైర్ లేడు అని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమయంలో తెలుగు ప్రజల మానసిక ఐక్యతను దెబ్బ తీయవద్దని ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను కోరారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రత్యామ్నాయాలకు తెలంగాణ ప్రజలు అంగీకరించరని ఆయన తెలిపారు. సుదీర్ఘ ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నదని ఆయన చెప్పారు.
జగన్ గూటికి ఎంపి ఎస్‌పివై రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: కాంగ్రెస్ పార్టీకి నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి గుడ్ బై చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను లోటస్‌పాండ్‌లో కలిశారు. అనంతరం ఎస్‌పివై రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ తాను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో స్పీకర్‌ను కలిసి రాజీనామాను ఆమోదించుకోనున్నట్లుతెలిపారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని, వైఎస్ జగన్ జైల్లో ఉండి కూడా సమైక్యాంధ్ర కోసం దీక్ష చేయడం తనను కదిలించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉందని, ఇటువంటి సమయంలో జగన్ రాష్ట్రానికి పటిష్టమైన నాయకత్వాన్ని ఇస్తారని ఆయన చెప్పారు.
టిడిపి చెప్పినట్టే జరుగుతోంది: నర్సిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: టిడిపి చెప్పినట్టుగానే రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైకాపా, టిఆర్‌ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలను ప్రజలు గమిస్తున్నారని అన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసున్నా ఏకైక ప్రత్యామ్నాయం టిడిపి మాత్రమేనని అన్నారు. జగన్, గాలి అవినీతిపై టిడిపి చెప్పిన మాటలు రుజువయ్యాయని, అలానే టిఆర్‌ఎస్,వైకాపా కాంగ్రెస్‌లో కలిసిపోతాయని తాము చెప్పిన మాట నిజం అవుతుందని అన్నారు. జగన్‌కు బెయిల్ రావడంలో కాంగ్రెస్ హస్తం ఉందని కాంగ్రెస్ ఎంపిలే చెబుతున్నారని నర్సిరెడ్డి తెలిపారు.

కొత్త డిజిపికి అన్ని సవాళ్లే?
30న అధికారికంగా దినేష్‌రెడ్డి పదవీవిరమణ
కొత్త పోలీస్ బాస్‌పై ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చలు
రాబోయే డిజిపికి 2014 ఎన్నికలు అగ్ని పరీక్ష

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డిజిపి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు విశే్లశిస్తున్నారు. రాష్ట్ర విభజనపై జరుగుతున్న ఆందోళన రెండు ప్రాంతాల్లో అలజడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా శాంతి భద్రతలపై వివాదాలు లేకుండా చూడాల్సిన ఆవశ్యకత కొత్త డిజిపిపై ప్రభావం ఉంటుంది. 2014లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల నిర్ణయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ పట్ల ఎక పక్షంగా వ్యవహరిస్తే ఇతరత్రా పార్టీలు రణాన్ని సృష్టించే వాతావరణం నెలకొంటుంది. ఈ నెల 30న అధికారికంగా రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి పదవీవిరమణ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ జివోను కూడా విడుదల చేసింది. దీంతో కొత్త డిజిపికి మార్గం సుగమం అయ్యింది. ఆయన స్థానంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టే డిజిపి నియామకం ఎవర్ని వరిస్తుందోనని ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కొత్త డిజిపి రేసులో ఉన్న అధికారులు పోలీస్ శాఖలో ఉన్న సీనియర్ అధికారులతో రహస్యంగా సమాలోచనలు చేస్తున్నారు. తాము డిజిపిగా వస్తే ప్రస్తుతం ప్రాధాన్యతలేని విభాగాల్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చర్చల సందర్భంగా వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరో మూడు రోజులు గడువు ఉన్నందున పోలీస్ శాఖల్లో కొత్త డిజిపిపై ఊహాగానాలు వస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం డిజిపి రేసులో ఉన్న వ్యక్తులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటూ జాతకాలను సైతం తెప్పించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిపి కోసం ఐదుగురు సీనియర్ పోలీస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపనున్నది. అందులో సీనియర్ అధికారుల పేర్లలో సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. కేంద్రం పరిశీలనలో ముగ్గురు పేర్లను రాష్ట్రానికి పంపనున్నది. అందులో ఒకరిని డిజిపిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న టిపి దాస్ రేస్‌లో ముందున్నారు. రెండవ స్థానంలో ప్రసాదరావు, మూడవ స్థానంలో హుడా, నాల్గవ వ్యక్తిగా ఎకె ఖాన్, అలాగే ఐదవ వ్యక్తిగా కె దుర్గాప్రసాద్ ఉన్నారు.

జగన్ బెయిల్‌పై ఢిల్లీలోనే డీల్

టిడిపి నేతల విమర్శ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: జగన్ బెయిల్‌కు ఢిల్లీలోనే ఒప్పందాలు కుదిరాయని టిడిపి నాయకులు వేరువేరుగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాల్లో ఆరోపించారు. అక్టోబర్ ఒకటిన ఇడుపుల పాయలో వైఎస్ సమాధి సందర్శన, నాలుగున గుంటూరులో రైతు ఆందోళన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారని వైకాపా నాయకులు ముందుగానే ప్రకటించారని, బెయిల్ రిలాక్సేషన్ పిటీషన్ కన్నా ముందే కార్యక్రమాన్ని రూపొందించుకున్నారని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
రిలాక్సేషన్ ఇస్తారని సిబిఐ ముందే చెప్పిందా? లేక సోనియాగాంధీ చెప్పారా?అని ప్రశ్నించారు. ముందుగా కార్యక్రమాన్ని రూపొందించుకున్న తరువాత బెయిల్ రిలాక్సేషన్ కోసం పిటీషన్ వేశారని తెలిపారు.
జగన్ బెయిల్ పై ఢిల్లీలో డీల్ లాలూచీ దీంతో మరోసారి రుజువైందని విమర్శించారు. జగన్‌కు బెయిల్ రావడంపై అనుమానాలు ఉన్నాయని ,తెరచాటు వ్యవహారాలు, చీకటి కోణాలు బయటపెడతానని కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలే చెబుతున్నారని యనమల అన్నారు. రాష్ట్ర విభజన కోసమే అసెంబ్లీ సమావేశానికై వైకాపా డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ ఎంపిలే చెబుతున్నారని అన్నారు.
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కుమ్మక్కులో భాగంగానే జగన్‌కు బెయిల్ వచ్చిందని గ్రామాల్లో చిన్న పిల్లాడికి కూడా అర్ధమైందని అన్నారు. పార్లమెంటు సభ్యత్వానికి జగన్ రాజీనామా చేసి 57 రోజులైనా ఎందుకు ఆమోదింపజేసుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్, మేకపాటి, సబ్బం రాజీనామాలను జగన్ ఎందుకు ఆమోదింపజేసుకోలేదని ప్రశ్నించారు. ఎంపిల రాజీనామాలు ఆమోదింపజేసుకోకుండా ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింపజేసుకోమని చెప్పడం విభజన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందాలన్న పన్నాగంతోనే అని ఆరోపించారు. రాజీనామాల డ్రామా బూమ్‌రాంగ్ కావడంతో అసెంబ్లీ తీర్మానం నాటకం ప్రారంభించారని విమర్శించారు. ఇది కూడా సోనియాగాంధీ, జగన్ డీల్‌లో భాగమేననిపిస్తోందని అన్నారు. తెలంగాణపై షిండే, దిగ్విజయ్‌సింగ్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
సోనియా కాళ్లు పట్టుకున్నారు
బెయిల్ కోసం సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారని టిడిపి ఎంపి సిఎం రమేష్ విమర్శించారు.వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ భార్య భారతి ఢిల్లీలో అహ్మద్‌పటేల్‌ను ఎన్నిసార్లు కలిశారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఢిల్లీలో సమైక్య దీక్షా శిబిరం సోనియాగాంధీ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు.
వైకాపాకు సమైక్యాంధ్ర ఉద్దేశం లేదని, రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు ముఖ్యమంత్రిని కావాలని జగన్ కలలు కంటున్నారని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు విమర్శించారు.

పదిలక్షల మందితో
ఢిల్లీలో సమైక్య ధర్నా: టిజి వెంకటేశ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో పదిలక్షల మందితో ఢిల్లీలో సమైక్యాంధ్ర ధర్నా నిర్వహించనున్నట్టు మంత్రి టిజి వెంకటేశ్ తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన కోసం ఇదే అంతిమ పోరాటం అవుతుందని, భారీ ధర్నా కార్యక్రమంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపైనే రాష్ట్రం సమైక్యాంగా ఉంటుందా? లేదా ?అనేది తేలుతుందని అన్నారు. భారీ నిరసన కార్యక్రమంతో రాష్టవ్రిభజన అంశంపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలన్నీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని విపక్షాలన్నీ తమ నిర్ణయాలను మార్చుకోవాలని సూచించారు. సమైక్యాంధ్రకు అనుకూలం అంటూ లేఖలు ఇస్తే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని అన్నారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకు ఉద్యమిస్తామని టిజి తెలిపారు.
అంటోని కమిటీకి చెప్పాం
రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ ప్రాంతానికి జరిగే నష్టం గురించి ఆంటోని కమిటీకి వివరించినట్టు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. రాయలసీమ సమస్యలు వివరించామని తమకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిపారు. సమైక్యాంధ్ర వల్లనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని చెప్పినట్టు తెలిపారు.

సీమాంధ్ర సమ్మె నేపథ్యంలో...

రాజధానిలోనే లావాదేవీలు

చెల్లింపులపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం
ఉస్మాన్‌గంజ్ స్టేట్ బ్యాంకుకు బాధ్యతలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: సీమాంధ్రలో జరుగుతున్న సమ్మె కారణంగా స్తంభించిన ట్రెజరీ పాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నుంచే లావాదేవీలను నిర్వహించాలని ఆర్ధిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక ఆదేశాలను కూడా జారీ చేసింది. నగరంలోని ఉస్మాన్‌గంజ్ స్టేట్ బ్యాంకు ద్వారా లావాదేవీలను నిర్వహించనన్నట్లు ప్రకటించింది. గత రెండు నెలలుగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, 56 రోజులుగా అక్కడి ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అందులో ఖజానా ఉద్యోగులు కూడా పాల్గొంటుండడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. జీతాలకే కాకుండా, వివిధ బిల్లుల చెల్లింపులపై కూడా ఈ సమ్మె ప్రభావం చూపించడంతో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటివరకు ఖజానా శాఖ సహాయ సంచాలకుని స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లే కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సహకారంతో రాతపూర్వకంగా బిల్లులను ఆమోదిస్తూ చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా సమ్మెలో పాల్గొంటుండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ఆర్ధికశాఖ రాజధాని నుంచే లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించింది. సమ్మెలో పాల్గొంటున్న 13 జిల్లాల లావాదేవీలను స్టేట్ బ్యాంకు ద్వారా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ట్రజరీ నిబంధనల్లోని కొన్ని సెక్షన్లకు సడలింపునిస్తూ ఉస్మాన్‌గంజ్ స్టేట్ బ్యాంకు ద్వారా లావాదేవీలను నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ శాఖల అధిపతులు, ప్రధాన అక్కౌంట్ అధికారులు, గణాంకాధికారులు, సహాయ గణాంకాధికారుల నుంచి వచ్చిన బిల్లులు, చెక్కులు, ఇతర అంశాలను పరిష్కరించేందుకు నిర్ణయించారు.

సకల జన భేరీని స్వేచ్ఛగా జరుపుకోనివ్వండి

తెలంగాణ ర్యాలీకి అనుమతించని ప్రభుత్వం.. జగన్ ర్యాలీని ఎలా అనుమతించింది: కోదండరామ్

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: సకల జన భేరీ సభకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా స్వేచ్ఛగా జరపుకోవ్వాలని ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విజ్ఞప్తి చేసారు. తమకు సౌకర్యాలు కల్పించకపోయినా ఫర్యాలేదు కానీ, సభకు వచ్చేవారికి ఇబ్బంది కలిగించవద్దని ఆయన సూచించారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్‌లో శుక్రవారం టిజెఎసి నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, విఠల్, అద్దంకి దయాకర్‌తో కలిసి కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం పట్ల ఒకతీరుగా, సీమాంధ్ర ఆందోళన పట్ల మరోతీరుగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో తెలంగాణవాదులు ర్యాలీ జరుపుతామంటే అనుమతించని ప్రభుత్వం, జగన్ జైలు నుంచి విడుదల అయితే ర్యాలీ జరపుకోవడానికి అనుమతించిందని ఆయన గుర్తు చేసారు.
తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం, పోలీసులు వివక్ష కనబరస్తున్నారని ఆయన విమర్శించారు. డిజిపి దినేశ్‌రెడ్డి పదవీకాలాన్ని పొడగించి ఉంటే, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి తామే అడ్డుకునేవాళ్లమని కోదండరామ్ పేర్కొన్నారు. సకల జన భేరీకి ప్రతి తెలంగాణ బిడ్డ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. సకల జన భేరీ సదస్సుకు కాళోజీ ప్రాంగణంగా, వేదికకు ప్రొఫెసర్ జయశంకర్ వేదికగా నామకరణం చేశామని ఆయన తెలిపారు.
అలాగే సదస్సుకు వచ్చే రెండు ద్వారాల్లో ఒక దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ, మరొక దానికి సదాలక్ష్మీ ద్వారాలుగా నామకరణం చేసినట్టు ఆయన వివరించారు.హైదరాబాద్ రాజధానిగా, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి తప్ప, మరేదానికి అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసారు.
తెలంగాణ ఆర్టీసి కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేసారు. సకల జన భేరీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, సభకు వచ్చే వారిని అరెస్టులు, బెండోవర్లు చేయవద్దని తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు విఠల్ విజ్ఞప్తి చేసారు.
సకల జన భేరికి ప్రతి తెలంగాణ ఉద్యోగి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల దుంచి వచ్చేవారు తమ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వారు తమ వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, ఏవి కాలేజిలో పార్కింగ్ చేయాలని ఆయన సూచించారు.

శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతున్న కోదండరామ్

మీ చిత్తశుద్ధిని ప్రజలంతా గుర్తించారు ఉద్యోగులపై ఆధారపడేవారు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంది ఉద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>