విజయవాడ, సెప్టెంబర్ 27: సీమాంధ్రలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఆఫీసులను ముట్టడించి కార్య కలాపాలను అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జెఎసి నేతలు, విశాలాంధ్ర మహాసభ నాయకులు, ఇతర ఉద్యమకారులు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ, ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ మూసివేయించారు. జెఎసి జిల్లా చైర్మన్ ఎ. విద్యాసాగర్ నాయకత్వంలో ఎన్‌జివో సంఘ నేతలు ఉదయం ఆదాయపుపన్ను శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాలాంధ్ర మహాసభ నాయకులు చుట్టుగుంట బిఎస్‌ఎన్‌ఎల్ భవనం వద్ద ధర్నా నిర్వహించి గేట్లకు తాళాలు వేయించారు. అనంతరం ర్యాలీగా పలు ప్రాంతాల్లో తిరుగుతూ కేంద్ర పోస్ట్ఫాస్‌లు, బ్యాంక్‌లను మూసివేయించారు. జెఎసి పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటినీ ఈ నెల 23వ తేదీ నుంచి మూసివేయిస్తున్నారు.
ఒఎన్జీసీ కార్యకలాపాలకు విఘాతం
రాజమండ్రి: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఉద్యోగుల జెఏసి ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి అన్ని కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ఒకేసారి ముట్టడించారు. కార్యాలయాలు ప్రారంభంకావటానికి ముందే ఆందోళనకారులు చేరుకోవటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లోకి వెళ్లలేకపోయారు. ఉదయం 8గంటలకే ప్రారంభమయ్యే ఒఎన్‌జిసి వంటి కార్యాలయాల వద్దకు గంట ముందుగానే ఉద్యోగులు చేరుకున్నారు. బ్యాంకులను ఉద్యోగులు మూయించారు. దీనితో వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఉభయగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన ఒఎన్‌జిసి కార్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన ఉద్యోగులు, ఆయా కార్యాలయాల్లోకి ఒక్కరిని కూడా లోపలకు వెళ్లనీయకుండా ముట్టడించారు. దాంతో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, నర్సాపురం తదితర ప్రాంతాల్లో ఒఎన్‌జిసికి చెందిన ముఖ్యమైన కార్యాలయాలు మూతపడి, కార్యకలాపాలు స్తంభించాయి. రాజమండ్రిలోని ఎల్‌ఐసి, సిటిఆర్‌ఐ, పోస్ట్ఫాసులు, గెయిల్, పిఎఫ్ కార్యాలయాలతో కలిపి 13కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. సీమాంధ్ర జిల్లాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకటంతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించటం ఉద్యోగుల జెఎసి నాయకులకు తేలికయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. శనివారం కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని, సమైక్యాంధ్ర ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా సహకరించాలని ఉద్యోగుల ఐకాస నాయకులు కోరారు. రాజమండ్రి సమీపంలోని బొమ్మురులో 16వ నెంబరు జాతీయ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు విన్యాసాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. కొన్ని ప్రయివేటు పాఠశాలలు పదవ తరగతి విద్యార్ధుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ, ఉద్యోగులు అడ్డుకున్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లో ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కొత్తపేటలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. రావులపాలెం సమీపంలోని గోపాలపురంలో మత్స్యకారులు జాతీయరహదారిపైనే చేపలు అమ్మి నిరసన ప్రదర్శన చేశారు.
బ్యాంకుల ఎదుట ఆందోళన
విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను స్తంభింపచేయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ఎపి ఎన్జీఓలు విశాఖలో బ్యాంకుల ఎదుట ఆందోళనలు నిర్వహించడంతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. నగరంలోని ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్, ఆంధ్రాబ్యాంకు సహా అన్ని జాతీయ బ్యాంకుల ఎదుట సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. శనివారం కూడా బ్యాంకులను స్తంభింపచేయనున్నట్టు ఎపిఎన్జీఓల ప్రతినిధులు ఈశ్వరరావు తదితరులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఎదుట కూడా సమైక్య వాదులు ధర్నాలు నిర్వహించి కార్యాలయాలను మూయించేశారు. పోర్టులోని పరిపాలనా బ్లాకులో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులను విధులు బహిష్కరించి బయటకు రావాల్సిందిగా సమైక్యవాదులు అభ్యర్ధించారు. అలాగే పాస్‌పోర్టు కార్యాలయం, హెడ్ పోస్ట్ఫాసుల వద్ద సమైక్య వాదులు ఆందోళన నిర్వహించారు. కేంద్రమంత్రి చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ప్రదర్శనను పలుచోట్ల సమైక్యవాదులు అడ్డుకున్నారు.
మూతబడ్డ ఆర్‌ఎంఎస్ కార్యాలయం
విజయనగరం: సీమాంధ్ర జెఎసి పిలుపులో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను తెరవకుండా అడ్డుకున్నారు. ఉదయం 7 గంటలకే ఎన్జీవోలు, ఉపాధ్యాయులు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి ఆర్‌ఎంఎస్ కార్యాలయాన్ని మూసివేయించారు. పట్టణంలోని ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హెడ్‌పోస్ట్ఫాసు, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, బ్యాంకులు తెరవకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర సాధన కోసం సహకరించాలని, విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సాలూరులో రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు బిందెలతో పాల్గొన్నారు. పూసపాటిరేగలో కస్తూరీబాగాంధీ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాతీయరహదారిపై నృత్యాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గజపతినగరంలో గ్రామీణ మహిళలు జానపద గేయాలను ఆలపించారు. ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో బ్యాంకులు తెరవకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. బోండపల్లి మండలంలో ఉపాధ్యాయులు రహదారికి అడ్డంగా కుర్చీలు వేసుకొని నినాదాలు చేశారు. నెల్లిమర్లలో ఉపాధ్యాయులు మోకాలిపై కూర్చొని నిరసనలు వ్యక్తం చేశారు.
విజయవాడ ఆదాయపన్నుల ఆఫీసు ఎదుట ఆందోళన * రాజమండ్రి ఒఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ కార్యాలయం ఎదుట బైఠాయింపు * చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోస్ట్ఫాసు ముట్టడి
పల్లెపల్లెకూ
సమైక్య నినాదం
ఆంధ్రభూమి బ్యూరో
కడప/కర్నూలు/అనంతపురం, సెప్టెంబర్ 27: కడప జిల్లాలోని పంచాయతీల పాలకవర్గ సభ్యులు పంచాయతీల ‘గుండె చప్పుడు’ పేరుతో శుక్రవారం నిర్వహించిన ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. జిల్లాలోని 785 గ్రామ పంచాయతీలకు చెందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు దాదాపు 8వేల మంది శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జిల్లాలోని పంచాయతీలన్నీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను గవర్నర్‌కు, రాష్టప్రతికి పంపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. జెఎసి నేతల ఆధ్వర్యంలోజిల్లా వ్యాప్తంగా ఎల్లైసీ, బ్యాంకులు, ఇతర కేంద్రప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. జమ్మలమడుగులో జిల్లా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ రూపొందించిన పల్లెపల్లెకూ సమైక్య నినాదం సిడిని ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి ఆవిష్కరించారు. రిమ్స్‌తోపాటు మిగిలిన ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలు నిలిపివేశారు. కర్నూలు జిల్లాలో సమైక్య ఉద్యమం పట్టు ఏమాత్రం సడలలేదు. గత 59 రోజులుగా సమైక్యవాదులు విభిన్న రీతుల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమం సత్ఫలితాన్నిస్తుందన్న ఆశాభావంతో ముందుకుసాగుతున్నారు. నంద్యాలలో శుక్రవారం సుమారు 20వేల మంది ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి రహదారులపైనే ప్రార్థనలు చేశారు. సమైక్యరాష్ట్రం కావాలంటూ నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు, బస్టాండు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. 29న కర్నూలులో జరిగే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలి రావాలని పిలుపునిస్తున్నారు. అనంతపురం జిల్లాలో సమైక్య నిరసనలు హోరెత్తాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఐకాసల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, రిలే దీక్షలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు మూయించారు. జిల్లాలో గత 59 రోజులుగా ఉద్యమం కొనసాగుతోంది.
మేనకాగాంధీకి సమైక్య సెగ
మదనపల్లె, సెప్టెంబర్ 27: మాజీ కేంద్ర మంత్రి మేనకగాంధీ శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరుగుతున్న మూడురోజుల ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. మదనపల్లె సబ్‌కలెక్టర్ హరికిరణ్, మండల తహశీల్దారు శివరామిరెడ్డి మేనకగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లె పట్టణ శివారుప్రాంతం విజయమిల్క్ డైరి సమీపంలోని అంతర్జాతీయ రుషివ్యాలీ విద్యాసంస్థకు అనుబంధంగా ఉన్న సంత్సంగ్ ఫౌండేషన్ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న మదనపల్లె జెఎసి నాయకులు మధుసూదన్, రవిప్రకాష్, రెహమాన్, శ్రీనివాసులు, జెఎసి సభ్యులు ఫౌండేషన్ కార్యాలయం ఎదుట జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తు మేనకగాంధీని అడ్డుకున్నారు.
సమైక్యాంధ్ర కోసం
ఇద్దరు మృతి
కెవిబి పురం/సూళ్లూరుపేట, సెప్టెంబర్ 27: చిత్తూరు జిల్లా కెవిబి పురం రాయపేడు పంచాయతీ వగత్తూరు ఎస్‌టి కాలనీకి చెందిన డి పోలయ్య (17) శుక్రవారం సమైక్యాంధ్ర కోరుతూ వడిశాకు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పంచ్ సురేష్ తెలిపారు. శుక్రవారం టివి చూస్తున్న సమయంలో తెలంగాణ విషయంలో ఎలాంటి వెనుకడుగు వుండదన్న దిగ్విజయ్ వ్యాఖ్యలు చూసి ఎంతో ఆవేదనకు గురై అడవికి వెళ్లి వడిశాకు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న నెల్లిపూడి సత్యనారాయణ (54) శుక్రవారం తెల్లవారుఝామున గుండెపోటుతో మృతిచెందాడు.
సాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్ళిన కారు
నలుగురి గల్లంతు
హాలియా, సెప్టెంబర్ 27: నాగార్జునసాగర్ ప్రధాన ఎడమకాల్వ 14వ మైలు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదవశాత్తు కాల్వలోకి దూసుకెళ్ళిన సంఘటనలో నలుగురు గల్లంతైనారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ నుండి హాలియాకు వస్తున్న 0707 అనే నెంబరుగల కారు అతివేగంగా రావడంతో అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ప్రమాదంలో హాలియాకు చెందిన వ్యాపారి గౌరు రాంబాబు(46), భార్య గౌరు మాధవి(38), కారు డ్రైవర్ రాంబాబు(20)తోపాటు మరో వ్యక్తి గల్లంతైనట్లు తెలిసింది. కాగా వ్యాపారస్తులైన రాంబాబు పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం తన కారులో భార్యతో కలిసి నల్గొండకు వెళ్ళాడు. అక్కడ పనులు ముగించుకుని మధ్యాహ్నం తన స్వగ్రామమైన పాలెంలో ఇటీవల మృతిచెందిన వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి హాలియాకు బయల్దేరినట్లు సమాచారం. పాలెం గ్రామం నుండి బయల్దేరిన 10 నిముషాల వ్యవధిలోనే అలీనగర్ ఎడమకాల్వ వద్ద దుర్ఘటన జరిగినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదస్థలంలో అల్విన్ నిస్సాన్ కంపెనీకి చెందిన హెడ్‌లైట్ డూమ్ పడి ఉండడాన్ని అక్కడి స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు కారు యజమాని వివరాల కోసం బంధువులను, మిత్రులను ఆరాతీయగా కాల్వలో గల్లంతైనవారు వ్యాపారి రాంబాబు, భార్య మాధవి, డ్రైవర్ రాంబాబులుగా నిర్ధారణకు వచ్చారు. కాగా మరో వ్యక్తి ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఆదిత్యుని తాకనున్న కిరణాలు
* అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో భక్తులకు కనువిందు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, సెప్టెంబర్ 27: లేలేత సూర్యకిరణాలు ఆదిత్యున్ని తాకే అద్భుత ఘట్టం భక్తులను కనువిందు చేయనుంది. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌పై సూర్యకిరణాలు పడనున్నాయి. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు సుధూర ప్రాంతాల నుంచి అరసవల్లి క్షేత్రానికి ప్రతీఏటా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. ఇతర జిల్లాల నుంచి, ఒడిశా ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఆయా పర్వదినాల్లో హాజరై ఆదిత్యున్ని దర్శించుకుంటుంటారు.
దిగ్విజయ్..హద్దు మీరకు
మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, సెప్టెంబర్ 27: సమైక్యాంధ్ర ఉద్యమం కృష్ణా జిల్లాలో హోరెత్తుతోంది. అవనిగడ్డ సమైక్యాంధ్ర గర్జనలో వేలాది మంది పాల్గొని నిరసన గళం వినిపించారు. కోలాటం, భజనలు, చిన్నారుల డప్పుల డ్యాన్సులు, తీన్‌మార్ మేళాలతో ఉద్యమం హోరెత్తింది. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న అధికార భాషా సంఘం చైర్మన్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దిగ్విజయ్‌సింగ్ తెలుగుజాతిని అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగ్విజయ్ నోరు కట్టడి చేసుకోపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుజాతి తిరగబడితే అడ్రస్సులు గల్లంతవుతాయని హెచ్చరించారు. సోనియాగాంధీ హయాంలో రాష్ట్ర విభజనకు పూనుకోవటం దురదృష్టకరమని, ప్రజలు కనె్నర్ర చేస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ డాక్టర్ తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాల్‌రెడ్డి పదవులు త్యాగం చేశారన్నారు. సిఎం పదవి కోసం కొంతమంది కుహనా నాయకులు రాష్ట్ర విభజనను కోరుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే దేశంలో మరో పద్దెనిమిది రాష్ట్రాలు విభజన కోరుతున్నట్టు చెప్పారు. బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. తను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు శుక్రవారం బంద్ పాటించాయి. అలాగే ఎల్‌ఐసి, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్, తదితర కార్యాలయాలు మూతబడ్డాయి.
ఒంగోలులో విద్యార్థుల మహాధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు/నెల్లూరు/తిరుపతి, సెప్టెంబర్ 27: విద్యార్థులు మహాధర్నా, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు బంద్, మంచినీటి బంద్, మానవహారాలు, ర్యాలీలతో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రకాశం జిల్లాలో జోరందుకుంది. ప్రధానంగా సమైక్యాంధ్రకు మద్దతుగా జెఎసి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులు, ఇన్సూరెన్సు, పోస్టల్, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఆ సంస్థల సేవలు నిలిచిపోవటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిసి జెఎసి జ్యోతిరావ్‌పూలే విగ్రహం వద్ద చేపట్టిన దీక్షా శిబిరంలో శుక్రవారం యాదవ కులస్ధులు దీక్షలు చేశారు. యాదవులు అట్టహాసంగా తమ కులవృత్తులకు సంబంధించిన ప్రదర్శనలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్, మాజీ మంత్రి పరసారత్నం కత్తివిన్యాసాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మున్సిపల్ ఉద్యోగ సంఘం కెఎల్ వర్మ నేతృత్వంలో గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటూ శుక్రవారం మున్సిపల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున చందనం పసుపు, కుంకుమలు పెట్టుకుని, వేపాకు మండలు ధరించి పొంగళ్ల పెట్టె సామాగ్రితో డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రోజుకో వృత్తితో వినూత్న నిరసనలు చేస్తున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శుక్రవారం తుడా సర్కిల్ వైసిపి శిబిరం సమీపంలో కాలువల్లో చెత్తను తొలగిస్తూ వినూత్న నిరసన చేశారు. బ్యాంకులు, పోస్ట్ఫాసులు మూయాల్సిందే నని పట్టుబట్టి బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా 42మంది జెఎసి నాయకులను అరెస్టుచేసి రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య రాష్ట్రం కోరుతూ చేపట్టిన ఉద్యమం 58 రోజులు పూర్తికావటంతో నెల్లూరు నగరంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన ప్రదర్శన నిర్వహించారు. 1950వ దశకంలో పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి ప్రాణాలు వదలటంతో ఇప్పటి ఆందోళనలో కూడా అన్ని రోజులు పూర్తవటాన్ని సరిపోలుస్తూ ఈకార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం ఉదయం అమరజీవి ఆత్మఘోష పేరిట పాదయాత్ర నిర్వహించారు.
గర్జించిన సమైక్యవాదులు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల ఇంటర్వ్యూలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆర్.అండ్.బి ఇంజనీరింగ్ అధికారులు ఆర్చి వద్ద వంటావార్పు నిర్వహించి ఆటాపాటాతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. సారవకోటలో గిరిజన గర్జన నిర్వహించారు. పలాస, పొందూరు, రాజాం, గార మండలాల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రైతులు గర్జించారు.
ఉద్ధృతంగా సమైక్య ఉద్యమం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, సెప్టెంబర్ 27: గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. రిలే దీక్షలు, మానవహారాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, బంద్‌లతో ఉద్యమాన్ని సమైక్యవాదులు హోరెత్తిస్తున్నారు. శుక్రవారం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రులు తమ పదవులకు మాత్రమే రాజీనామాలు చేయాలని, అసెంబ్లీలో విభజన తీర్మానం వస్తే వీగిపోయేలా చేసేందుకు ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగాలని జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. అయితే కార్యాలయంలో మంత్రి లేకపోవడంతో ఆయన ప్రతినిధికి వినతిపత్రం అందజేసి నాయకులు వెనుదిరిగారు. సమైక్యవాదులు, ఎన్జీవోలు, బ్యాంకులు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలైన టెలీకం, పోస్ట్ఫాసులతో పాటు వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులను కూడా మూయించి వేశారు. నరసరావుపేట పట్టణంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట, పాత చెక్‌పోస్టు సెంటర్, ఎస్‌ఎన్ కళాశాల వద్ద రిలే దీక్షా శిబిరాల్లో దీక్షలు కొనసాగాయి. పల్నాడు రోడ్డులో రామిరెడ్డిపేట జెఎసి నాయకులు రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. తెనాలి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి.
ప.గో.లో సమైక్య హోరు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం సమైక్యాంధ్ర ఉద్యమం హోరెత్తింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను మూయించారు. జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం సాయంత్రం ఉద్యోగులు వర్షంలో తడుస్తూ ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను తెలియజేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గొర్రెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్మాజీగూడెంలో బ్యాంకులు, ప్రైవేటు సంస్థలను మూయించారు. భీమడోలు జంక్షన్‌లో విద్యార్థులు ఎడ్లబండిపై ప్రదర్శనలు ఇచ్చారు. పాలకొల్లులో బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్న ఎపి ఎన్జీవోలకు రూ.10 వేలు విరాళం అందించారు. పోడూరు మండలం గుమ్ములూరులో గ్రామీణ సమైక్యాంధ్ర గర్జన జరిగింది. జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న వెదురు, టింబర్ వేలాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. చిన అమిరంలో దిగ్విజయ్‌సింగ్, సోనియా, కెసిఆర్ ఫొటోలను పశువులతో తొక్కించారు.