ఆమె ఆకాశంలో
సంపూర్ణం
స్వప్న లోకాల్లో
స్వయం ప్రకాశం
ఆమె సూర్యున్ని
వడిలోకి ఎత్తుకొని
ఇంటిల్లిపాదిని
అలంకరిస్తుంది
పూల వనాన్ని
వాకిలి ముగ్గులో
పరవశింప జేస్తుంది
ఆమె మనసున్న
కలువ కొలను
ప్రేమ లోకాల్ని
ఆస్వాదించే
సౌభాగ్యమూర్తి
ఏనాడు అలుపెరుగని
ఓ జీవన స్వప్నం
ఏ గాలి అలకు
చెదిరిపోని నీలాల
పయోదరం
అనంత కోటి
ఆనంద భాష్పాలకు
ఆత్మీయతా వసంతం
తల్లిగా జీవన సౌభాగ్యాల
చల్లని తీరం.
*
నగిషీ ముఖం ఎందుకు?
-డా.దామెర రాములు
మనసులో భావాల్ని
దాచుకోకుండా పలికెడిది
ముఖారవిందం!
హాసానికైనా పరిహాసానికైనా
అద్దంలాంటి ముఖంలో
అసలు ముఖమే ద్యోతకమవ్వాలి
తల్లి గర్భం నుంచి
భూగర్భం దాకా చేసే పయనంలో
ఎనె్నన్నో నగిషీల్తో మెరుపులద్దుతూ
ఉన్న ముఖాన్ని పనికిరాకుండా చేస్తారు
లేని అందాల్ని
ముఖం ముంగిట్లో గుమ్మరించి
ద్విగుణీకృత అందం కోసం
తెగ ఆరాట పడతారు కొందరు
కృత్రిమ ముఖాలెన్నైనా
ఇమడని శోభ కోసం చేసేవి
విఫల మనోరథాలే...
జలతారు ముసుగులే...
తెగేదాకా లాగొద్దు మరి
వెగటు కలిగించే రసాల్ని
నిలబడని అందాల్ని అద్దకు
చెక్కిళ్లపై విల్లులాంటి కనుబొమ్మలపై
వికసిత మందస్మిత ముఖమే
వెలుగులు విరజిమ్మే కాంతి పుంజం!
ప్రేమలు కురిపించే చెలిమె...
నీ అసలు ముఖమే నీకు సౌకర్యం!
*
ప్రేమంటే?
-సబ్బతి సుమిత్రాదేవి
ప్రేమంటే...
వెనె్నల మాధుర్యం
వసంతపు ఝంకారం
ఎదలో రవళించే వేణునాదం
కనులలో విరబూసిన
కోటి కలల సుమహారం
గుప్పెడు గుండెలో ఒదిగిన
ప్రణయ సముద్రం
మధుర జ్ఞాపకాలు పొదిగిన
వలపుల సడి
తాండవమై నింగి కెగసిన
ప్రేమశిఖ!
ప్రేమంటే ఇంతే కాదు...
పరస్పర త్యాగనిరతికి
ప్రతిబింబమై
అసమాన ఆత్మీయతకు
రూపురేఖగా
కార్చిచ్చుల జీవన సమరంలో
స్నేహ హస్తమై
గమ్యమెరుగని కారుచీకటిలో
కాంతి కిరణమై
నిరాశల నిరంకుశత్వానికి చిక్కిన
ఆత్మీయానుబంధానికి
ఆశల నిట్రాడై
ఆశయాల క్రతువుకు
సంకల్ప బలమై
అడుగు అడుగులో
అచంచల శక్తి సంపన్నమై
జీవితానికి జీవమిచ్చే
జీవాధారమే ప్రేమంటే!