నేను వ్యాపారం చేసే ఓ
కంపెనీ బేలన్స్ షీట్స్,
ఇతర రిపోర్టులని
అధ్యయనం చేస్తుంటే అది
విసుగు పుడితే, నా
కంపెనీల్లోని ఉద్యోగస్థుల
కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌లని
చదివి వారిలో ఎవరికి
ప్రమోషన్ ఇవ్వచ్చో అనే
పనిలోకి ప్రవేశిస్తాను. అదీ
విసుగు పుడితే కేష్
ఓచర్స్‌ని పాస్ చేస్తాను.
అదీ విసుగు పుడితే ఉత్తర
ప్రత్యుత్తరాల పనిని
చూస్తాను.’’
ఇంకొకరు చెప్పారు.
‘్భగవంతం గారిలో నాకు
బాగా నచ్చిన లక్షణం
సింప్లిసిటీ. డబ్బు నేర్పే
దర్పానికి ఆయన దూరం.
ఓసారి ఆయన్ని ‘గ్రాఫ్
ఓన్ ఫేబర్’ పెన్స్‌ని
ఎందుకు వాడరు? మీరు
వాటిని కొనగలరు కదా?
అని అడిగాను. దానికి
ఆయన ‘ఒకో పెన్ ఖరీదు
నూట ఏభై డాలర్లు. అంటే
దాదాపు పదివేల
రూపాయలు. అదే పనిని
మూడు రూపాయల
పెన్ను చేస్తున్నప్పుడు నా
డబ్బుని నేను అలా
ఎందుకు వృథా
చేయాలి?’ అని
ప్రశ్నించారు. కొందరు
ధనవంతులు తమ కోసం
ప్రత్యేకంగా చేత్తో చేసిన
ఖరీదైన కస్టమ్ మేడ్
పెన్నులని, పెన్సిల్స్‌ని
వాడడం నాకు తెలుసు.
భగవంతంలో డబ్బు తెచ్చే
అలాంటి మదం లేదు.’’
ఆ తర్వాత మరికొందరు
ప్రసంగించాక టాకా
కంపెనీల తరఫున వచ్చిన
ష్రాఫ్ భగవంతం గురించి
క్లుప్తంగా ప్రసంగించినా
ఆయన చెప్పింది అందరికీ
నచ్చింది. ప్రసంగం
ఆరంభించే ముందు
ఆయన మానిటర్లోని
అప్పుడే ఆవిష్కరించబడ్డ
భగవంతం కాంస్య విగ్రహం
వంక తదేకంగా చూసి
తర్వాత ప్రేక్షకుల వైపు
తిరిగి చెప్పాడు.
‘‘చాలామంది తమ
విగ్రహాలు పార్కుల్లో, రోడ్ల
కూడళ్లలో ఉండాలని
భావిస్తారు. కాని
భగవంతం తన విగ్రహాన్ని
తన తదనంతరం తన
ప్రాపర్టీలో
ఆవిష్కరించాలనుకోవడం
ఆయనలోని ఉదాత్తతని
సూచిస్తోంది. నేను ఇక్కడ
ఇప్పుడే చదివాను.
1947-2013 అని.
అంటే భగవంతం
1947లో పుట్టి
2013లో దివంగతుడు
అయ్యారని కదా అర్ధం. ఈ
రెంటి మధ్యా ఓ డేష్
ఉంది. ప్రతీ మనిషి
పుట్టాక అతను అంతం
అయ్యేదాకా ఓ డేష్‌కి అటు
ఇటు అతను పుట్టిన,
గిట్టిన సంవత్సరాలు
ఉంటాయి. మనం ఆ
సంవత్సరాలని చదివి
డేష్‌ని విస్మరిస్తాం.
నిజానికి మనం
చూడాల్సింది ఆ డేష్‌నే.
ఆయన ఈ భూమి మీద
జీవించిన డబ్బై నాలుగేళ్ల
కాలాన్ని ఆ డేష్
సూచిస్తుంది. అంతేకాదు
జీవించి ఉండగా ఎలా
ప్రవర్తించింది, ఏం చేసింది,
ఎ లాంటి వాడు అన్నది
కూడా ఆ డేష్
సూచిస్తుంది. అతడు
తమని ఎంతగా
ప్రేమించాడో వారికి చిన్న
డేష్ గుర్తు చేస్తుంది.
కార్లు, ఇళ్లు, ఆస్తులు,
బేంక్ బేలన్స్ ఎంత
సంపాదించాడు అన్నది ఆ
గీత రిప్రజెంట్ చేస్తుంది.
ఇవేకాక ఎంతమందిని
ప్రేమించాం, ఎంతమందిని
ద్వేషించాం, ఎంతమందిని
మోసం చేసాం,
ఎంతమందికి సహాయం
చేసాం, ఎలా జీవించాం
మొదలైనవి కూడా ఆ గీత
రిప్రజెంట్ చేస్తుంది. మనం
అందరం ఆ డేష్‌లోనే
ఉన్నాం. ఇంకా మన
విషయంలో ఆ డేష్
పక్కన సంవత్సరం
నమోదు కాలేదు. కాబట్టి
మనం ఆ డేష్‌ని ఎలా
నింపాలన్నది ఇప్పుడే,
అంటే ఆ డేష్‌లో
ఉన్నప్పుడే
నిర్ణయించుకుని ఆ
ప్రకారం ప్రవర్తించాలి. ఆ
డేష్ పూర్తవడానికి మనకి
ఇంకా ఎంత సమయం
మిగిలి ఉందో? అంటే
దాని పక్కన ఓ
సంవత్సరం ఎప్పుడు వచ్చి
చేరుతుందో తెలియదు.
కాబట్టి ఈ డేష్‌ని మనం
మారాల్సిన అవసరం
ఉందా అన్నది ఎవరికి
వారు ఆలోచించుకోవాలి.
కోపం తెచ్చుకోవడంలో
ఎక్కువ ఆలస్యాన్ని,
ప్రేమించడంలో తక్కువ
ఆలస్యాన్ని
అలవరుచుకోవాలి. మనం
అంతా ఒకర్నొకరు
గౌరవించుకోవాలి. మన
డేష్ పక్కన ఓ
సంవత్సరం వచ్చి చేరాక
మన గురించి ఎవరైనా
ఇలాంటి సంస్మరణ సభల్లో
లేదా బయటా మాట్లాడేది
ఆ డేష్‌లో ఫిలప్ అయిన
విషయాల గురించే. అది
మనల్ని గౌరవించేదిగా
ఉండాలనుకుంటున్నారా
? లేక అగౌరవపరిచేలా
ఉండాలని
అనుకుంటున్నారా? అది
ఎవరికి వారు
నిర్ణయించుకుని ఆ
ప్రకారం ప్రవర్తించాలి.
భగవంతం ఆఖరిసారి
నాతో ఫోన్లో మాట్లాడిన
మాటలివి.’’
ఆ హాల్లో ఓ చోట
కూర్చున్న వృద్ధురాలు,
ఆవిడ పక్కన వున్న
ఇద్దరు మగాళ్లు తల తిప్పి
లోపలికి వస్తున్న ఓ
మధ్యవయస్కుడి వంక
చూసారు. అతను కూడా
వాళ్ల వంక చూసి చిన్నగా
నవ్వాడు.
భగవంతం భార్య
నారాయణి ఆ వ్యక్తి దగ్గరికి
అతన్నివెతుక్కుంటూ
వచ్చి నమస్కరించి
చెప్పింది.
‘‘సేనాపతిగారు! మీరు
వచ్చినందుకు చాలా
సంతోషంగా ఉంది.’’
‘‘సార్ సంస్మరణ సభకి
రాకుండా ఉంటానా
మేడమ్?’’ చిరునవ్వుతో
చెప్పాడు.
అతని చేతిలో ఓ పాకెట్
ఉంచి చెప్పింది.
‘‘ఇది మీకు నేనిచ్చే
బహుమతి.’’
‘‘ఓ! థాంక్స్.
ఇదేమిటి?’’ సేనాపతి
దాన్ని అందుకుని
అడిగాడు.
‘‘చెప్పను. మీరు
చూడండి. నేను మీకు
ఇంకోసారి మావారి
తరఫున నా థాంక్స్
చెప్పాలి.’’
‘‘దేనికి?’’
‘‘ఎందుకో మీకు
తెలుసు.’’ ఆవిడ
సేనాపతితో డగ్గుత్తికగా
చెప్పింది.
చాలామంది వెళ్తూ
ఆయన విగ్రహానికి
పూలదండలని వేసారు.
‘‘నాకు జరిగింది పూర్తిగా
తెలీదు. మీరు చెప్పాలి.’’
కోరింది.
‘‘అవును. ఆయన
పోయినప్పటినుంచి మీరు
బిజీ కదా? తీరికగా
ఉన్నప్పుడు ఫోన్ చేస్తే
వచ్చి అంతా చెప్తాను.’’
సేనాపతి అంగీకరించాడు.
కథా ప్రారంభం
What is past is
past. But there
is a future left to
all men, who
have the virtue
to repent and
the energy to
atone.
-Robert Bulwer
-Lytton
ఏ రంగంలోనైనా
క్రమశిక్షణ ఉంటేనే ఫ్రగతి
ఉంటుంది అన్నది నిజం.
అందుకు ఉదాహరణ
భగవంతం జీవిత
విధానం. చాలామంది
ఐశ్వర్యవంతుల జీవితాల్లా
భగవంతం జీవితం కూడా
క్రమశిక్షణతో సాగుతోంది.
ఆ గదిలో అకస్మాత్తుగా
ఐఫోన్‌లోంచి ఆలిండియా
రేడియో సిగ్నేచర్ ట్యూన్
వినపడసాగింది. టివి,
ఇతరవినోదాలు రాక
మునుపు రేడియో
ఒకప్పుడు ఏకైక వినోద
సాధనంగా ఉన్న రోజుల్లో
ఆ ట్యూన్‌కి ఇళ్లలోని
చాలామంది
మేలుకునేవారు. ఆ
తరానికి చెందిన అరవై
ఆరేళ్ల భగవంతానికి ఆ
ట్యూన్‌కి మెలకువ
వచ్చింది.
లేస్తూనే ఎదురుగా గోడకి
వేలాడే ఓ దేవత బొమ్మని
చూసి నమస్కరించాడు.
హిందువుల్లో చాలామంది
కొలిచే దేవత చిత్రం
కాదది. అసలు ఆ
దేవతని ప్రత్యేకంగా
కొలిచేవారు అరుదు. ఆ
చిత్రం దేవతల గురువు,
బుద్ధికి మేధస్సుకి
అధిపతి అయిన
బృహస్పతిది. కొద్దిసేపు
బద్ధకంగా
కళ్లుమూసుకుని
పడుకుని ఆలిండియా
రేడియో సిగ్నేచర్
ట్యూన్‌ని
వింటుండిపోయాడు.
తర్వాత లేచి చెయ్యి చాపి
ఐఫోన్‌ని అందుకుని
దాన్ని ఆఫ్ చేశాడు. ఆ
ఐఫోన్‌ని ఆయన
పెద్దకూతురు దమయంతి
ఆయన అరవై రెండో
పుట్టిన రోజుకి
బహుమతిగా
ఇండియాలో
పనిచేయడానికి వీలుగా
క్రాక్ చేయించి ఇచ్చింది.
ఐనా ఆ గదిలో నది నీరు
గలగలా పారుతున్న శబ్దం
మంద్రస్థాయిలో
వినిపిస్తోంది. అది రాత్రి
తొమ్మిది నుంచి
వినిపిస్తోంది. ప్రతీ రాత్రి ఆ
శబ్దం వింటూ వింటూ
మంచం మీది భగవంతం
నిద్రపోతాడు.
లేప్‌టాప్‌లోని
యూట్యూబ్‌లో ‘రివర్
ఫ్లోయింగ్’ అనే
వెబ్‌సైట్లోంచి వినపడే ఆ
నది పారే శబ్దాన్ని ఆయన
గత కొద్ది రోజులుగా
జోలపాటలా వింటూ
నిద్రపోతున్నాడు.
మంచం దిగి దాన్ని కూడా
ఆఫ్ చేసి అటాచ్డ్
బాత్‌రూంలోకి నడిచాడు.
మొహం కడుక్కుని జిమ్
గదిలోకి వెళ్లాడు. సరిగ్గా
ఐదుంపావు దాకా నలభై
నిముషాల సేపు ఆయన
వాకర్ మీద గంటకి ఐదు
కిలోమీటర్ల వేగంతో
నడిచాడు. డాక్టర్ సలహా
మీద వారానికి నాలుగు
రోజులు ఆయన అలా
నడుస్తాడు. నడుస్తూ ఐ
ఫోన్ నుంచి చెవుల్లోకి
ఇయర్ ఫోన్స్‌తో కర్నాటక
సంగీతం వింటాడు.
కాలకృత్యాలు
తీర్చుకోవడానికి
బాత్‌రూంలోకి వెళ్లాడు.
డబ్ల్యుసి కమోడ్ మీద
కూర్చుని ది ఆప్టర్ సెవెంటీ
అనే పుస్తకాన్ని తెరచి
చదివాడు. స్టయిల్‌గా
పెంచే గడ్డానికి టచప్
చేసుకుని స్నానం
చేసాడు. ఈలోగా ఆయన
భార్య నారాయణి
రెండుసార్లు వచ్చి భర్త
లేచాడా లేదా అని చూసి
వెళ్లింది. రెండుసార్లూ
ఆయన
బాత్‌రూంలోనేఉన్నాడు.
ఆయన సరిగ్గా ఆరుకి ఆ
సెంట్రల్లీ ఏర్ కండిషన్డ్
ఇంట్లోని మేడమీది
మొదటి అంతస్తులోంచి
లిఫ్ట్‌లో కిందికి వచ్చి
బ్రేక్‌ఫాస్ట్ రూంలోకి
వెళ్లాడు. ఇప్పుడాయన
సూట్‌లో ఉన్నాడు.
నారాయణి బ్రేక్‌ఫాస్ట్‌ని
తెచ్చి సర్వ్ చేసింది.
అమెరికా నుంచి దిగుతి
అయిన క్వేకర్ కంపెనీ
పీచ్ ఫ్లేవర్ ఓట్‌మీల్, డ్రైడ్
పిట్‌లెస్ (గింజలు లేని)
ప్రూన్స్, కడిగిన పది
సాల్టెడ్ ఆల్మండ్స్, రెండు
బ్రెజిలియన్ నట్స్, ఓ
ఆపిల్‌ని తిని తాజా
ఆరెంజ్ జ్యూస్ తాగాడు.
ఇది ఆరోగ్యరీత్యా
ప్రపంచంలోని చాలామంది
తీసుకునే బ్రేక్‌ఫాస్ట్. ఇడ్లీ
రవ్వ కలపని, పొట్టు
మినపప్పుతో గత రాత్రి
వేసి, నెయ్యి పూసిన
ఆంధ్రులకే పరిమితమైన
రెండు ఆవిరి కుడుములు
కూడా తిన్నాడు.
ఆరు ఇరవై దాకా ఆయన
ఆవిడతో మాట్లాడుతూ
భార్య ఇచ్చిన మాత్రలని
వేసుకుని తన ఆఫీసు
గదిలోకి వెళ్లాడు. టీ
పాయ్ మీద పనివాడు
వుంచిన దినపత్రికల
మెయిన్ హెడ్డింగ్స్‌ని
చూసి ది ఎకనమిక్
టైమ్స్, ఫైనాన్షియల్
ఎక్స్‌ప్రెస్‌లని మాత్రం
క్షుణ్ణంగా చదివాడు. ఏడు
గంటలకి తను చైర్మన్‌గా
వున్న వివిధ కంపెనీల
నుంచి వచ్చిన ఫైళ్లని
శ్రద్ధగా చదవసాగాడు.
మధ్యలో స్కూల్ డ్రెస్‌లోని
ఆయన మనవలు
నలుగురు వచ్చి
‘తాతయ్య!
గుడ్‌మార్నింగ్’ అని విష్
చేసి ఆయన ఇచ్చిన
అమెరికన్ కంపెనీ రీస్,
హఎర్షీస్ కంపెనీల
చాక్లెట్స్‌ని తీసుకుని
స్కూళ్లకి వెళ్లిపోయారు.
వాళ్లు చదివే స్కూల్‌ని
నిర్వహించేది కూడా
భగవంతమే. తొమ్మిది
దాకా రెండు గంటలపాటు
ఆ ఫైళ్ల పని చూసాక
భగవంతం బయటికి
వచ్చాడు.
తొమ్మిదింపావుకి ఫోర్డ్
కారులో బయలుదేరి తన
ఇంటికి పది నిముషాల
డ్రైవ్ దూరంలో వున్న
భగవంతం ఎన్‌క్లేవ్‌కి
చేరుకున్నాడు. సెంట్రల్లీ
ఎయిర్ కండిషన్డ్
చేయబడ్డ మొదటి
అంతస్తులో ‘చైర్మన్’ అని
రాసి వున్న తనగదిలోకి
వెళ్లాడు. ఆయన వెనకే
డ్రైవర్ భగవంతం ఉదయం
చూసిన ఫైల్స్ కట్టలని
తెచ్చి ఆయన గదిలో
ఉంచాడు. అప్పటికే
సిద్ధంగా వున్న ఆయన
సెక్రటరీ మాధురి వాటిని
వాటికి సంబంధించిన
విభాగాలకి పంపించింది.
ఉదయం పదకొండున్నర
దాకా భగవంతం వివిధ
కంపెనీల ఎగ్జిక్యుటివ్స్‌తో
మాట్లాడి కంపెనీ
వ్యవహారాలకి
సంబంధించిన చిన్న,పెద్ద
సమస్యలకి వారు
సూచించిన పరిష్కారాల్లో
తను ఉత్తమమైనవిగా
భావించిన వాటిని
చెప్పాడు. కొన్ని కొత్తవి
కూడా సూచించాడు.
‘‘నేను సూచించానని
వాటిని గుడ్డిగా
పాటించకండి. మీకు ఏది
మంచిది అనిపిస్తే అది
చేయండి’’ ఎప్పటిలా
వారికి చెప్పాడు.
ఒకవేళ వారు తమకి
తోచిన రీతిలో ఆయన
చెప్పినట్టుగా చేసాక కూడా
సమస్య పరిష్కారం కాక
నష్టం వచ్చినా, ఆయన
తమని నిందించడని
వారికి తెలుసు. తను
చెప్పిందే అనుసరించాలనే
మూర్ఖపు పట్టుదల
భగవంతానికి లేదు.
కేవలం తన బ్రెయిన్, తన
ఆలోచనలవల్లే తన
వ్యాపారం అభివృద్ధి
చెందాలని ఆయన
ఎన్నడూ అనుకోలేదు.
సమష్టి కృషి వల్ల అది
ఎదగాలని భావించాడు.
తన ఎగ్జిక్యూటివ్‌లకి
కొంతమేర స్వేచ్ఛ ఇచ్చి ఆ
పరిధిలో వారు
స్వతంత్రంగా
వ్యవహరించడాన్ని
ఆయన మొదటినుంచీ
ప్రోత్సహిస్తున్నాడు.
ఆయన తరచు తన కింద
పనిచేసే ఎగ్జిక్యుటివ్స్‌కి
ఇలా చెప్తుంటాడు.
‘‘అంతా నేను మేధావిని
అనుకుంటారు. కాని
కాదు. సంగీత కచేరీని
ఎక్కడా ఒక్కరే
చేయలేరు. అందుకు ఓ
ఆర్కెస్ట్రా తప్పనిసరి.
అప్పుడే అది రక్తి
కడుతుంది. అలాగే ఓ
మనిషిలోని మేధస్సు
ఒంటరిగా పని చేయదు.
కొందరి మేధస్సులు
కలిస్తేనే దానికో
ప్రయోజనం
కలుగుతుంది. అందుకే
నేను మేధస్సు గల వారిని
గౌరవిస్తాను. ఓ బిజినెస్
టీమ్‌లోని అంతా
సమానంగా పాల్గొంటేనే
ఏదైనా సాధించగలం. ఏ
ఒక్కరి మేధస్సుతో ఏ
వ్యాపారస్తుడు పైకి
రాలేడు. అలా వచ్చానని
అనుకుంటే అది
అతనిలోని అహంకారం,
ఆడే అబద్ధం మాత్రమే.’’
‘హెచ్చు జీతం ఇచ్చి
విదేశాల్లో ఎంబిఏ చేసిన
పోస్టుగ్రాడ్యుయేట్‌ని
పెట్టుకున్నాక, వారి
సలహాలని
స్వీకరించకపోతే ఇక దేనికి
వారిని
నియమించినట్టు?’ అన్న
విషయాన్ని భగవంతం
ఎన్నడూ విస్మరించలేదు.
తెలుగునాట స్వయం
కృషితో పైకి వచ్చిన
చాలామంది
పారిశ్రామికవేత్తల్లో లేని ఈ
గుణం భగవంతానికి
ప్రయోజనకారిగా వుంది.
అందువల్ల ఆయన నష్టం
కన్నా ఎక్కువసార్లు
లాభానే్న పొందాడు.
తల నొప్పిగా
అనిపించడంతో మాధురిని
టీ ఇవ్వమని చెప్పి ఓ
మాత్రని వేసుకున్నాడు.
పనె్నండుకి ఆయనకి
కొంత విరామం దొరికింది.
(మిగతా వచ్చేవారం)