నేటి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశము జాతకంతో ముడిపెట్టి చెప్పడం అనే విషయం ఎంతవరకు కరెక్ట్? కొందరు జాతకం మీద నమ్మకమే వున్నది అనేవారున్నారు. కొందరు మాకు జాతకాల మీద నమ్మకం లేదు అనేవారు ఉన్నారు. వీటికి అన్నింటికీ సమాధానాలు చూద్దాం. ప్రధానంగా ఒక విషయం గుర్తుంచుకోండి. జ్యోతిశ్శాస్త్రం చాలా గొప్ప విద్య. మహర్షులు చాలా ప్రణాళికాబద్ధంగా తయారుచేశారు. శాస్త్రం తప్పు అనుకోవడం మంచిది కాదు. వారు ఇచ్చిన గ్రహగమనం ఆధారంగా ప్రత్యక్షంగా పౌర్ణిమ, అమావాస్య, గ్రహణం వంటివి మనం నేటికీ పంచాంగాల ప్రకారం చూడగలుగుతున్నాం. ఇక ఫలితాంశాలు చెప్పడంలో పొరపాటు జరిగితే అది సిద్ధాంతి దోషం కానీ సిద్ధాంతం దోషం కాదు. మనం ఎంచుకోవడంలో ఒక మంచి సిద్ధాంతికి మనం సమాచారం సరిగా ఇవ్వకపోయినా వచ్చే ఫలితాలు తేడాగానే ఉంటాయి. ఉదాహరణకు వైద్యం చేయించుకోవడానికి వెడతాం అది సెట్ అవ్వకపోతే డాక్టర్ తప్పు అనాలి కానీ వైద్య శాస్త్రం తప్పు అనరాదు కదా. అలాగే శాస్త్రం చెప్పే శాస్ర్తీ ద్వారా దోషం జరగవచ్చు కానీ శాస్త్రంలో దోషం ఉండదు. ఇక మిగతా విషయాలు పరిశీలిస్తే జ్యోతిశ్శాస్త్రం ప్రకారం నేటి సమాజంలో జరిగే అంశాలు అన్నీ చర్చించవచ్చా? ఇక్కడ నేటి సమాజ పరిస్థితులు శాస్త్రాలు లేవు. ఉదాహరణకు విద్యా విధానం. ఇంజనీరింగ్‌లో ఎన్నో శాఖలు. శాఖలు శాఖలుగా వైద్య విద్య అలాగే వృత్తి విధానాలు. ఇవన్నీ జ్యోతిశ్శాస్త్రంలో మనకు కనపడవు. ప్రాచీన గ్రంథాలలో వైద్య విద్య విద్య అని చెప్పబడి ఉంది. జాతకం ప్రకారం వైద్యుడు అవుతాడు అని చెప్పవచ్చు. ఇక ఏ విభాగంలో వైద్యుడు అంటే జ్యోతిశ్శాస్త్రం సాధారణ స్థాయి శాస్తవ్రేత్తలు చెప్పలేక పోవచ్చు. కానీ పరిశోధకులకు మనం చదువుదాం అనుకునే విభాగ వివరాలు పూర్తిగా ఇస్తే దానిని వివిధ గ్రహాల స్థితుల సంచారానికి ముడిపెట్టి చెప్పేవారు. వారి అనుభవం ప్రభావం ఉంటుంది. వైద్య శాస్త్రం విద్యార్థి అనేది జ్యోతిశ్శాస్త్ర విద్యా గ్రంథాల ద్వారా చెప్పడం అవుతుంది. విభాగం నిర్ణయం మాత్రం సిద్ధాంతిగారి అనుభవం మీద ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ విద్యా విషయంలో కూడా. విదేశాలు వెడతారు అని జాతకం ప్రకారం చెప్పవచ్చు కానీ అమెరికా వెడతారా? ఆస్ట్రేలియా వెళతారా? అని అడిగినా ఆ విషయం చెప్పినా అది జాతక భాగానికి సంబంధం లేని అంశం. అలాగే ఉద్యోగ విషయంలో గణితంలో జీవనం అని చెప్పవచ్చు. అది కామర్సా? మేథమెటిక్సా? కామర్స్ అయితే అకౌంటెంట్ లెవెలా? లేక ఆడిటర్ లెవెలా? అనేవి సిద్ధాంతిగారి అనుభవంతో వచ్చే అంశాలు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగం భేదం జ్యోతిషం ప్రకారం చెప్పవచ్చు కానీ అందులో విభాగాలు మాత్రం సిద్ధాంతి అనుభవ ఆధారం. గణితోపాధ్యాయుడుగా వృత్తి అంటే కామర్స్, స్టాటిస్టిక్స్, మేథమెటిక్స్ అన్నీ గణిత సంబంధమయినవే కదా. అలాగే సైన్స్ టీచర్ వృత్తి అని జ్యోతిషం ప్రకారం చెబితే అందులో విభాగాలు జ్యోతిశ్శాస్త్రంలో రాసి లేవు. ఇలాగ జ్యోతిశ్శాస్త్ర గ్రణతాలలో కూడా నిత్యం పరిశోధన చేసి కొత్తకొత్త అంశాలు కనుగొనే సిద్ధాంతులు వారి అనుభవాల ప్రకారం చెప్పవచ్చు. వైద్య శాస్త్రంలో కొత్త రోగాలకు మందులు ఎలా కనుక్కుంటున్నారో, జ్యోతిశ్శాస్త్రంలో కొత్త విషయాలు అలాగే కనుక్కుంటున్నారు. జ్యోతిశాస్త్రం వంద శాతం నిజమే. ఫలితాంశాలు సిద్ధాంతిపై ఆధారం.
*
============
సందేహాలు - సమాధానాలు
శివనాగార్జున రెడ్డి (జమ్మలమడుగు)
ప్రశ్న: 7.2.98. సా.7.50. విద్యా విషయం?
జ: గురువుతో రాహుకేతు సంయోగం దృష్ట్యా కొంచెం విద్యా వ్యాసంగం మందగించగలదు. అయితే వీడు జన్మతః తెలివి గలవాడు. బాగా కట్టడి చేస్తే విద్యా వికాసం బాగుంటుంది.
గురురాజాచారి (నారాయణపేట)
ప్రశ్న: 20.8.73 సా.6.30 భవిష్యత్
జ: మేష రాశి కుంభ లగ్నం. రాబోవు కాలం కొంచెం చికాకులు ఎక్కువ పెట్టే కాలమే. 2017 సెప్టెంబర్ వరకు రాహు - శుక్ర. ఎవరికీ ఏ హామీలు ఇవ్వవద్దు. అప్పులు కొత్తగా చేయవద్దు. గృస విషయం ఆలోచనలు వద్దు. రోజూ దుర్గాపూజ చేయండి.
వీరేంద్రనాథరెడ్డి
ప్రశ్న: 18.8.2003 సా.6.04 విద్యా యోగం బాగున్నదా?
జ: గురు బలం బాగున్నది. ఇతడిది మేష రాశి, మకర లగ్నం. మంచి ప్రతిభావంతు డవుతాడు. కానీ ప్రస్తుతం ఆరోగ్య విషయంగా చికాకులు వచ్చే కాలం. జాగ్రత్తలు తీసుకోండి.
శివసాయి వాసు
ప్రశ్న: 17.3.81 రాత్రి 2.45. ఉద్యోగం, వివాహం.
జ: మకర లగ్నం సింహ రాశి. మీకు రాహు కేతు దోషం వలన సరియగు నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. చంద్ర దశ ప్రారంభమైంది. రోజూ నవగ్రహ పూజ చేయండి. శుభం కలుగుతుంది.
శిరీష
ప్రశ్న: 23.4.90 రా.12.00
జ: ధనుర్ లగ్నం, మీన రాశి. మీకు గ్రహచారం ప్రస్తుతం శుక్ర దశ యోగదశయే. రాబోవు కాలం 2015 నుండి అంతా శ్రేయోదాయకం.
ప్రశ్న: 15.06.1973. ఉ.8.00 భవిష్యత్ అనుకూలమేనా?
జ: వృశ్చిక రాశికి ఏలినాటి శని ప్రారంభం నడుస్తోంది. మీకు పనులు వేగం తగ్గే అవకాశం ఉంటుంది. రోజూ ‘శ్రీరామ శ్శరణం మమ’ అంటూ 11 ప్రదక్షిణాలు ఆంజనేయస్వామికి చేయండి. తత్ప్రభావంగా కొంత ఉపశమనం కలుగుతుంది.
-----------------
కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.