‘హలో ఏమండీ! నేనండీ! మన అబ్బాయికి ఎమ్సెట్‌లో మంచి రాంక్ వచ్చిందండీ’
‘ఆ! మంచి రాంకా? వాడికెలా వచ్చిందది? కాపీ కొట్టాడా?’
‘కాదండీ! వాడు నిజంగానే ఇంటెలిజెంట్ - మీలాగా కాదు’
‘అంటే? నేను...’
‘ఇప్పుడు మనాడికి టాప్ టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ వస్తుందండీ’
‘ఓగాడ్ - కొంప మునిగింది కదే’
‘అదేంటండీ -సంతోషించక ఆ డైలాగేమిటి?’
‘నేనాఫీసులో వేరే వాళ్లతో మాట్లాడుతూ ఆ డైలాగ్ వేశానే్ల - సరే సరే - నేనిప్పుడే ఇంటికొస్తున్నా! అన్నీ మాట్లాడదాం. ఓకేనా?’
‘ఓకే’
* * *
‘హాయ్ డాడ్’
‘కంగ్రాచ్యులేషన్స్ మైసన్ - నిజానికి నేను కండొలెనె్సస్ చెప్దామనుకున్నా’
‘అదేంటి డాడ్? టాప్ టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీటు వస్తోంటే కండొలెనె్సస్ అంటారా?’
‘ఒరే పిచ్చివాడా! ఇదంతా గవర్నమెంట్ చేస్తున్న కుట్ర’
‘ఆ! కుట్రా?’
‘అవున్రా! నిన్నూ ఇంకా నీలాంటి వాళ్లనూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో పడేస్తే అయిదేళ్ల వరకూ మీరు ఉద్యోగం మాటెత్తకుండా నోర్మూసుకు పడుంటారు- లేకపోతే నిరుద్యోగులంతా కలసి రేపటి నుంచే గవర్నమెంట్ డౌన్‌డౌన్ - ముఖ్యమంత్రీ ముర్దాబాద్ - నిరుద్యోగ సమస్యను వెంటనే పరిష్కరించాలి’ అంటూ ప్రొసెషన్స్ లేవదీస్తారు. మీలాంటి వాళ్లను మభ్యపెట్టడానికే ఈ ప్రొఫెషనల్ కోర్స్‌లు పెట్టింది గవర్నమెంట్’
‘అంటే బిటెక్ చదవటం అనవసరం అంటారా డాడ్?’
‘అవున్రా! మనిషి సుఖంగా, హాపీగా బ్రతకాలంటే ఈ చదువులు పెద్ద న్యూసెన్స్ అనుకో!’
‘కానీ చదువులేందే ఉద్యోగాలెక్కడి నుంచి వస్తాయ్ డాడ్? లైఫంతా బ్రతికేదెలా?’
‘పిచ్చివాడా! పెద్దపెద్ద చదువులు చదివి బాగుపడినోడిని ఒక్కడిని చూపించు - ఎవడూ ఉండడు - అదే చదువులేదనుకో. ఇప్పటి నుంచే నువ్ ఏదొక పొలిటికల్ పార్టీలో చేరావనుకో! నాలుగేళ్లు పోయాక నీకో మంచి ఆఫీస్ బేరర్ పోస్ట్ వస్తుంది. పొలిటికల్ పార్టీలో ఆఫీస్ బేరర్ పోస్ట్ అంటే నీకు తెలీందేముంది?
పైరవీలు చేసి కోట్లు సంపాదించవచ్చు - లేదా నువ్వే బినామీ పేర్లతో కంట్రాక్ట్‌లు తీసుకోవచ్చు.
లక్ బాగుండి మినిస్టరయావనుకో - కోట్లు కాజేయవచ్చు’
‘కానీ అందరూ పార్టీలో అంత పెద్ద పదవికి రాలేరు కదా’
‘అలాంటి డౌటున్నపుడు రియలెస్టేట్ రంగంలోకి దిగు! ఈ నాలుగేళ్లల్లో లక్షలు సంపాదించవచ్చు!’
‘అంటే ఈ టాప్‌టెన్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటం వృధా అంటారా?7
‘సెంట్ పర్సెంట్! నాలుగేళ్లు రాత్రింబగళ్లు చదివే బదులు ఇప్పటి నుంచే లైఫ్ ఎంజాయ్ చెయ్!’
‘కానీ తరవాయినా ఉద్యోగం చేయాలి కదా?’
‘చెయ్ - డాక్టరవాలంటే ఒక క్లినిక్ ఓపెన్ చెయ్ - సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవాలంటే ఆ జాబ్‌లో చేరిఫో’
‘అదేంటి డాడ్ - చదవకుండా ఆ డిగ్రీలెలా వస్తాయ్?’
‘ఓల్డ్ సిటీలో ఏ డిగ్రీ కావాలంటే అది అమ్ముతారు - కొనుక్కో - చీప్‌లో పనయిపోతుంది - అదే నాలుగేళ్లు చదివావనుకో - సంవత్సరానికి రెండు లక్షల ఫీజు చొప్పున ఇంజినీరింగ్ అయేప్పటికి పది లక్షలవుతుంది.
ఇంకో పదిహేను లక్షలు మిగతా ఖర్చులకి - పైగా ఈ నాలుగేళ్లూ గాళ్‌ఫ్రెండ్స్‌కి ఇంకో పది లక్షలు ఖర్చు పెట్టాలి. నీ త్రీజీసెల్ ఫోన్‌కే నాలుగేళ్లకూ పాతిక లక్షలవుతుంది. వీటన్నిటి కోసం నేనీ ఇల్లు అమ్మాలి. ఈ న్యూసెన్స్ అంతా లేకుండా నీక్కావలసిన డిగ్రీ షాపులో కొనుక్కున్నావనుకో - హాపీగా ఉంటావ్’
‘కానీ ఇలా దొంగ సర్ట్ఫికెట్లతో క్లినిక్ ఓపెన్ చేస్తే - పోలీసులు పట్టుకోరూ?’
‘పోలీసులకు అంత తెలివుంటే దేశంలో ఇన్ని వేల మంది దొంగ సర్ట్ఫికెట్ డాక్టర్లెందుకున్నారు - సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో తెలీనివాళ్లు చాలామంది సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్నారు’
‘ఒకవేళ దొరికిపోతే?’
‘నీకు తొంభయ్యో సంవత్సరం వచ్చేవరకూ కోర్ట్‌లో కేస్ నడుస్తూనే ఉంటుంది. అంచేత డోంట్‌వర్రీ’
*
సరదా సంగతులకు సెటైర్ తాలింపు
english title:
hello
Date:
Sunday, November 17, 2013