Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కవితా - నా కవితా

$
0
0

‘సపట్ మలాం, ఐ కోల్డ్ లోషన్!’ అంటాడు, ఉన్నట్టుండి చిన్న సురేందర్‌రెడ్డి. ఎమ్మెస్సీలో క్లాసులో మరో పెద్ద సురేందర్‌రెడ్డి (ఆకారంలో కూడా) ఉండేవాడు గనుక తప్ప ఈ సురేంద్రుడు ఎవరికీ చిన్నగాడు! కొంత కాలానికి అతను అప్రయత్నంగా ఆ మాట అన్న వెంటనే అందరూ గొల్లున నవ్వడం అలవాటయింది. ఎందుకో తెలుసా? ఆ మాటలకు అర్థం లేదు. మెదడులో పేరుకుంటున్న బరువును విదిలించడానికి, అతను ఆ మాటలంటాడు. సురేందర్, చార్‌మినార్ దగ్గర్లోని ఒక కాలేజీలో చదువుకున్నాడు. దారిలో ఒక గోడ మీద సపట్ మలాం, ఐకోల్డ్‌లోషన్ వ్యాపార ప్రకటన రాసి ఉండేది. ఆ ప్రకటనలో మరే వివరాలూ ఉండవు. నలు చదరంగా సున్నం వేసి, దానిమీద పెద్ద నల్లని అక్షరాలతో ఈ రెండు మందుల పేర్లు రాసి ఉంటాయి! అంతే! ఆ అక్షరాలు మనవాడి మనసు గోడలమీద నిలబడి, అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అనుకోకుండానే!
ఆలోచింపచేసే అక్షరాలు: ఒక మాట, పాట విన్నా, ఒక చక్కని బొమ్మను చూచినా (బొమ్మ అంటే సినిమా అనే అర్థం కూడా వాడుకలో ఉండేది!) మనసు, మెదడు కొంచెం సేపు ఒకటయి పోవాలి. ఏమిటిది అన్న ప్రశ్న పుట్టి కాసేపు మనసును కుదిపి, మరేదీ గుర్తురాకుండా పట్టి ఉంచాలి. అచ్చులో వచ్చినది పత్రిక గానీ, పుస్తకం గానీ, కరపత్రం గానీ, అది కూడా అట్లాగే మనల్ని పట్టి కట్టేయాలి. కాలక్షేపం కోసం చదువుతున్నామనుకున్న రచనల్లో కూడా ఎన్నో ఉత్తమమయినవి ఉంటాయి. బూతు పత్రికలో కథ చదివి, ‘ఈ రచయిత తన రచనలను ఈ పత్రికకు ఎందుకు పంపి ఉంటాడ’ని ఆలోచించడం గుర్తుంది. రాసింది నిజంగా బూతు కథ! (ఏది బూతు, ఏది కాదు అన్న అంశం గురించి చాలా చర్చ జరగవలసి ఉంది!) కాని, అందులో రచయిత ప్రదర్శించిన సృజన, ఒరిజినాలిటీ, మామూలు పత్రికల్లో రాసే చాలామందిలో కనిపించలేదు. అందుకనే నేను అంతసేపు, ఆయనను గురించి ఆలోచించాను. ఇంతకూ నేను బూతు పత్రికలు చదివానని మీకు అర్థమయింది గదూ! ‘బజార్లో కూచుని బూతు పుస్తకం చదవడం ధైర్యమని అనుకున్నాను. తలుపులు వేసుకుని, గదిలో ఒంటిగాడిగా గడపడానికి ధైర్యం కావాలని తర్వాత అర్థమయింది’ అని రాసుకున్నాను కూడా ఒకప్పుడు.
రచన-ఆలోచన: ఆలోచన లేకుండా రచన పుడుతుందా? కవిత్వం చెప్పడానికి ఏమిటి అవసరం అని కవిత రాస్తూ, శివుడుగా పిలవబడే శివారెడ్డిగారు, ఆలోచన ఉంటే చాలదా అంటారు. కవికి, కథకులకు కొంచెం ప్రేరణ, బోలెడంత ఆలోచన ఉంటే చాలు, రచన తన్నుకు వస్తుంది. బస్సు టికెట్టు వెనక, సిగరెట్టు పెట్టె చించి, దాని వెనుక మొదలు అది ప్రవాహమయి పారుతుంది.‘జల దంతావళ్ మస్తక స్థిత ముక్తారాశిపై గూర్చుండి, యననీ రాగమునందొక కమ్మని గీతమ్మాలాపింప గాంక్షింతు!‘నన్నాను ఒకప్పుడు. అవును మరి, అమరకోశం, శబ్దమంజరీ అన్నంలో నంచుకు తిని పెరిగిన వాతావరణమాయె. ఈ మాటలన్నది నేనేనా? అనుకున్నాను గూడా! ఈ అక్షరాలను నేను దేని వెనకాలా రాసింది లేదు. కానీ ఇంత కాలమయినా గుర్తుండిపోయాయి. 5 ఆలోచనలకు తగిన సృజన, రచన ఎక్కడ కుదురుతుంది అన్నది ప్రశ్న. బడిలో గోడ పత్రిక పెట్టాలని అనుకున్నారు. అందుకు పేరు వెతుక్కురమ్మని నన్ను అడిగారు. మా చిన్నాయనగారు పండితుడు, కవి, రచయిత. కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. ఆయనను సాయం అడిగాను. ఏడవ తరగతి నాటి మాట! ఇంకా గుర్తున్నాయి. శేముషీ చకోర చంద్రిక, అనీ ‘మనీషా సుమనోవల్లరి’ అని ఆయన సూచించిన పేర్లు. అవును మరి కప్పగంతుల వారి శిష్యుడాయన. కానీ, బడిలో మాత్రం పత్రికకు విద్యా జ్యోతి అని పేరు పెట్టారు!
నిప్పు-మంట: ఇంటి వాతావరణంలోనూ ఆధునికత కరువు! ఆ ప్రభావంలోనుంచి బయట పడడానికి మాత్రం నేను బయటపడవలసి వచ్చింది. ‘నేను సముద్రాన్ని కాను, నేను నదిని కాను, నేను కనీసం వాగునూ బావిని కూడా కాను. ఒక చుక్కనీరు రాల్చీ రాల్చని మునిసిపాలిటీ కుళాయిని నేను, అని రాశాను. మిత్రుడు దేవరాజు మహారాజు కవితకు ‘ఆఫీసు’ అని శీర్షిక పెట్టాడు. అంతకు ముందు నేను పత్రికలకు కవితలు పంపే ఉంటాను కానీ అవి అచ్చులో రావని తెలుసు! ఫీల్డ్‌వర్క్ పనిమీద బస్సులో కరీంనగర్ జిల్లాకు పోతున్నాను. పక్కసీట్లో పెద్దమనిషి ఆంధ్రజ్యోతి వార పత్రిక చదువుతున్నాడు. ఆ కాలంలో కథల మధ్యన బాక్సుకట్టి చిన్న కవితలు వేసేవారు. ఎందుకో పక్కాయన చదువుతున్న పత్రికలోకి తొంగి చూసాను. నా కవిత! కింద నాపేరు! అప్పుడు నా మానసిక పరిస్థితి ఇవాళ నాకు ఆలోచనకు అందడంలేదు. ఆయనను పలకరించి ‘ఇది నా కవిత తెలుసా?’ అంటే నవ్వుతాడేమో? ఆ తర్వాత కూడా ఎవరికీ చెప్పినట్టు లేదు. కవిత అచ్చయిందని. అట్లాగే బస్సులోనే ఓ కవిత రాయడం గుర్తుంది. బాగా చలిగా ఉంది. దొరికిన కాయితం వెనుక నాలుగు మాటలు రాసుకున్నాను. ‘ఈ దేశం చలి నా ఎముకలను కొరికేస్తున్నది. అన్నా ఏదీ కొరివి? గుండెను మండించి చలి కాచుకుందాం!’ అని! ఈ కవిత ఎవరికీ పంపించలేదు. ఎక్కడా అచ్చు కాలేదు. మనసులోనే ఉంది. అసలు కవిత, కథ మన పద్ధతి కాదని పీహెచ్‌డీ రోజుల్లోనే నిర్ణయించుకున్నాను. నాకా రోజు బాగా గుర్తుంది. ఆదివారాలు జరిగే సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా శీలా వీర్రాజు గారితో సభ జరిగింది. నాటినుంచి నేటికీ మిత్రులయిన కవులు, రచయితలు చంద్ర, దేవిప్రియ (సీనియర్స్) మొదలు నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి వారందరు ఉన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ, బస్టాపులో చెట్లకింద అరుగుల మీద మా చర్చాగోష్టి సాగింది. నన్ను పరిచయం చేస్తూ, ‘బడింగ్ పోయెట్’ అన్నారెవరో. ‘ఎవర్ బడింగ్ పోయెట్!’ అని జోక్ కూడా చేశారు. ‘కాదు నేను కవిత, కథ రాయదలుచుకోలేదు. మీరందరూ రాసేది చదువుతాను. మరేదయినా రాస్తాను. నేను వేరే దారి వెతుక్కుంటాను. అందరిలో ఒకడిని కాదలుచుకోలేదు!’ అన్నాను కాస్త గర్వంగానే! సైన్సు రాయడం మొదలుపెట్టాను!
తన్నుకు వస్తుందది!: ఇవాళటికీ ననె్నవరయినా రచయితగా పరిచయం చేస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కలం, మనసును కాస్త ఉండమని, కాగితాలను నలుపుచేస్తుంది. 1986లో ఒక దీర్ఘ రచన చేసాను. అదేమిటో నాకు తెలియదు. నేను వేరేదో పనిలో ఉన్నప్పుడు మహారాజు వస్తే ఆ కాయితాలు అందించి, చదువుతూ ఉండమన్నాను. కొంచెం సేపు తర్వాత లేచి నిలబడ్డాడు. వెళ్లిపోవాలనుకుంటున్నాడేమో, నేనేమో పనిలో ఉన్నాననుకుని మీదికి ప్రశ్నార్ధకంగా చూస్తే, ‘ఏం లేదు! నీకు నమస్తే పెడదమని లేచిన! మంచి కవిత రాసినవు!’ అన్నాడు. ఆ కాగితాలను చదివిన మిత్రులు రచయిత కె.చిరంజీవి ‘కానీ, ఇందులో కాస్త కన్ఫ్యూజన్ ఉంది’ అన్నారు. ‘‘మనసులోనే ‘శభాష్’ రాసింది దాని గురించే గద’’ అనుకున్నాను. రావూరి భరద్వాజ గారు ‘మామయ్యా ఒకరోజు కవితా స్రవంతిలో దీన్ని మొత్తంగా చదువు!’ అన్నారు. నేను వద్దన్నాను. నెలనెలా వెనె్నల కృష్ణారావుగారు ఆ పదకొండు పేజీల రచన తీసుకున్నారు. అందులోంచి ‘సంతకాలు’ పేరున కొన్ని పంక్తులను ఆంధ్రప్రభ వీక్లీలో అచ్చువేయించారు. ఆ కాయితాలు నాకు తిరిగి మాత్రం రాలేదు. 33 ఏళ్లు వచ్చినా ఏం చేస్తున్నానని అర్థం కాలేదు అంటూ రాసిన ఆ రచన చిత్తు ప్రతి తర్వాత దొరికింది.
* మనకు వేదుల అనే ఇంటి పేరు గలవారున్నారు. ద్వివేదుల వారు కూడా ఉన్నారు. అంటే ఆ వంశం వారు రెండు వేదాలను అభ్యసించారని అర్థం. ఉత్తర భారతదేశంలోని ద్వివేదీలు కొందరు ‘దూబే’లయ్యారు. తెలుగునాట త్రివేదులున్నారేమో తెలియదు (నాకు!) ఉత్తరాన వీరిని త్రిపాఠీ, తివారీలని కూడా అంటారు. చతుర్వేదుల వాళ్లు అంతటా ఉన్నారు. హిందీ ప్రాంతంలో చౌబేలు కూడా ఉన్నారు.
* ఒకానొక వేద పండితుని ఇంట ఒక జీతగాడు (పాలేరు) ఉన్నాడు. సాయంత్రం గురువుగారు పాఠం చెబుతుంటే, పక్కనే పశువుల పాకలో పనిచేస్తూ అతను వింటూ ఉంటాడు. ఒకనాడు గురువుగారి దృష్టి మరెక్కడికో మళ్లి పాఠం ఆగింది. ఎక్కడ ఆగిందీ ఆయనకు గుర్తు రావడం లేదు. జీతగాడు ఒక నల్లని వడ్లగింజను తెచ్చి గురువుగారి ముందు నిలబడి, గోటితో దాన్ని గిల్లి పడేసి వెళ్లిపోయాడు. గురువుగారు ఆశ్చర్యంగా చూచారు ‘కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం!’ పాఠం ముందుకు సాగింది. ఆ మాటలను నోటితో చెప్పగూడదని, చేతితో చేసి చూపించాడు ఆ జీతగాడు!
* మరో గురువుగారు పాఠం చెప్పాలి. కానీ పెంపుడు పిల్లి ‘మియ్యావ్’ అంటూ ఆయన చుట్టే తిరుగుతుంది. పాఠం సాగనీయదు. గురువుగారు దాని కాలికి తాడు కట్టి దాన్ని స్తంభానికి కడతారు. పాఠం సాగుతుంది. గురువుగారు ఒకసారి ఊరికి వెళ్లవలసి వచ్చింది. సీనియర్ మోస్ట్ శిష్యుడు గారిని పాఠం సాగించమని చెప్పారు. పిల్లిని ఎందుకు కడతారో తెలియని ఆ శిష్యుడు, పిల్లి వెంటబడి, పరిగెత్తుతున్నా పట్టుకుని స్తంభానికి కట్టి పాఠం చెప్పాడు. అలా కథ సాగింది. తరువాత పండితులయి ఎక్కడెక్కడికో వెళ్లిన ఆ శిష్యులంతా పాఠం చెప్పే ముందు పిల్లిని వెతికి తెచ్చి స్తంభానికి కట్టసాగారు. పిల్లి లేనిదే పాఠం జరగని రోజులు వచ్చాయి!
*

-మళ్లీ వచ్చేవారం

లోకాభిరామమ్
english title: 
lokaabhiraamam
author: 
కె.బి.గోపాలం

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>