హైదరాబాద్, నవంబర్ 18: సమయం మధ్యాహ్నం సరిగ్గా 1గం. 15 నిమిషాలు.. మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ‘ఫేస్ టు ఫేస్ హాల్’లో ప్రజాసమస్యల పరిష్కార కార్యక్రమం ‘ప్రజావాణి’ని ముగించుకుని బల్దియా కమిషనర్ సోమేశ్‌కుమార్ బయటకు వచ్చారు. మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్తున్నారు. హాల్ నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా ముక్కు పుటాలదిరిపోయేలా దుర్వాసన. అక్కడికక్కడే ఆగి ఏమిటీ వాసన అంటూ లిఫ్టు వైపున్న బాత్‌రూంలవద్దకు వెళ్లారు. బాత్‌రూంలను చూసి పక్కనే ఉన్న ప్రజాసంబంధాల అధికారి పనవన్‌కుమార్ నాయుడు ఛాంబర్‌లోకి వచ్చారు. బాత్‌రూంల నిర్వహణ విషయంలో కూడా కమిషనర్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి పవన్‌కుమార్ ఛాంబర్‌లోకి వచ్చిన కమిషనర్‌కు దుర్వాసన మరింత తీవ్రంగా వచ్చింది. వెంటనే అధికారిని పిలిపించి, ఇదేనా మీ ఛాంబర్ అంటూ ప్రశ్నించారు. ఏమిటీ కంపు, ఇంతటి దుర్వాసనలో ఎలా కూర్చుంటున్నారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో సార్లు బిల్డింగ్ మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లకు ఫిర్యాదులు చేసినా, ఫలితం దక్కలేదని, గత్యంతరం లేక ఇక్కడే కూర్చుని పని చేసుకుంటున్నామని వివరించారు. దీంతో సీరియస్‌గా స్పందించిన కమిషనర్ సోమేశ్‌కుమార్ వెంటనే ఇంజనీర్లను పిలిపించి సిబ్బంది సరిగ్గా విధులు నిర్వర్తించేందుకు వీలైన వాతావరణాన్ని కూడా కల్పించలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఇక ప్రజాసమస్యలను ఎలా పరిష్కరిస్తాం? అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారమేమిటీ? మీరేం చేస్తారో నాకు తెలియదు? ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటూ ఆదేశించారు. పలువురు మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు సమాధానం చెబుతూ, మొత్తం ఆరు ఫ్లోర్ల నుంచి బాత్‌రూంల కనెక్షన్లు ఈ డక్ట్‌లోకి ఉండటంతో సమస్యను పరిష్కరించలేకపోతున్నామని చెప్పారు. కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనిచేయాలన్న చిత్తశుద్ధి లేక ఏవేవో కథలు చెబుతున్నారని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒక మార్గం ఉంటుందని ఇంజనీర్లకు చురకలు పెట్టారు. ఈ సమస్య పరిష్కారానికి ఏం ప్రతిపాదనలు తయారుచేస్తారో నాకు తెలియదు? మూడురోజుల్లో అంతా సిద్దం కావాలని, ఆ మరుసటి రోజు పనులు మొదలుకావాలని ఆదేశించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్దం చేసేందకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. (చిత్రం) ప్రజాసంబంధాలధికారి కార్యాలయంలో దుర్వాసన రావటంతో ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కమిషనర్ సోమేశ్‌కుమార్
* ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ * దుర్వాసన రావటంతో అధికారులకు క్లాస్ * కథలు చెప్పొద్దు, ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుందని హితవు * మరమ్మతులకు మూడు రోజుల డెడ్‌లైన్
english title:
ghmc
Date:
Tuesday, November 19, 2013