హైదరాబాద్, నవంబర్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన టౌన్‌ప్లానింగ్‌లో ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ల జారీ అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. కొత్తగా నిర్మించే భవనాల నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత జారీ చేయాల్సిన ఈ సర్ట్ఫికెట్లను పలువురు బాడాబాబులు, రాజకీయ నేతల వత్తిళ్లతో అధికారులు అడ్డదారిలో జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న యజమానులు, బిల్డర్లు కూడా జివో 86 ప్రకారం నిర్మాణ భాగంలో కొత్త మహానగర పాలక సంస్థకు తనఖా పెడుతున్నట్లు రిజిస్ట్రేషన్ చేయించి, అనుమతి తీసుకున్న తర్వాత అనుమతి ప్రకారం నిర్మాణం కొనసాగుతుందా? పూర్తయిందా? లేదా? అన్న విషయాన్ని అధికారులు పారదర్శకతతో ధృవీకరించి జారీ చేసేదే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్. ఈ సర్ట్ఫికెట్ సమర్పించిన తర్వాతే ఆయా విభాగాల అధికారులు సదరు భవనానికి కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్లను మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ధనికవర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో, అలాగే భూమి ధర ఆకాశాన్నంటుతున్న పలు ప్రాంతాల్లో యజమానులు, బిల్డర్లు కూడా రెసిడెన్షియల్ నిర్మాణం కోసం అనుమతులు తీసుకుని, కమర్షియల్ కార్యకలాపాల కోసం నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అమ్యామ్యాలు చెల్లిస్తే అధికారులు కమర్షియల్ భవనాలకు సైతం రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ సర్టిపికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇదిలా ఉండగా, ఇక నిర్మాణం మొత్తం కూడా అనుమతికి లోబడి, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఇళ్లను, భవనాలను కూడా నిర్మించుకున్న యజమానులకు కూడా అధికారులు సకాలంలో ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భవనంగానీ, ఇళ్లు గానీ నిర్మాణం పూర్తయిన తర్వాత టౌన్‌ప్లానింగ్ అధికారుల వద్దకొచ్చి యజమానులే సమాచారమిచ్చినా, కనీసం క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించి, ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు ఇవ్వటంలోనూ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా తాము జారీ చేసిన అనుమతుల ప్రకారం భవనాలు నిర్మితం కావొద్దని కోరుకోవటంలో మొదటి వారు టౌన్‌ప్లానింగ్ అధికారులేనని చెప్పవచ్చు. నిర్మాణంలో డీవియేషన్స్, వినియోగాన్ని బట్టి యజమానుల నుంచి లక్షల రూపాయలను లంఛాలుగా తీసుకుని అధికారులు యజమానులకు అనుకూలంగా ఆక్యుపెన్సీ సర్టిపికెట్లు మంజూరు చేస్తున్నారు. అధికారుల డిమాండ్ చేసినంత లంఛం చెల్లిస్తే కనీసం సైటులో నిర్మాణ పనులు జరుగుతున్నాయా? ఒక వేళ జరిగితే అవి తామిచ్చిన అనుమతి ప్రకారమే జరుగుతున్నాయా? అన్న విషయాలను కూడా కనీసం ధృవీకరించుకోకుండా ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద మొత్తంలో లంఛాలిచ్చేందుకు సిద్దమవుతున్న బిల్డర్లు, యజమానులు, బడాబాబుల నిర్మాణాలను సెలవు రోజులనీ కూడా చూడకుండా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి, ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు ఇస్తున్నట్లు తెలిసింది.
ఆక్యుపెన్సీ సర్టిపికెట్లు లేకుండానే అన్నీ కనెక్షన్లు
మహానగరంలో అన్ని భవనాలను తనిఖీ చేస్తే ఆక్యుపెన్సీ సర్టిపికెట్లు లేకుండానే వాటర్, విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న భవనాలే ఎక్కువగా వెలుగుచూస్తాయి. తాము ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు ఇచ్చిన తర్వాతే భవనాల వినియోగాన్ని బట్టి విద్యుత్, వాటర్ కనెక్షన్లను మంజూరు చేయాలని గతంలో పలుసార్లు బల్దియా అధికారులు జలమండలి, సిపిడిసిఎల్ అధికారులకు లేఖలు రాసినా, ఆయా విభాగాల అధికారులు వోసిల్లేకుండానే కనెక్షన్లను మంజూరు చేస్తున్నారు. మేమేం తక్కువనా? అంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా భవన వినియోగం మాట ఎలా ఉన్నా? వాటర్, కరెంటు కనెక్షన్లు తీసుకున్న తర్వాత కూడా పలు భవనాలకు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు ఇచ్చిన సందర్భాల్లేకపోలేవు.
-- అమ్యామ్యాలిస్తేగానీ తనిఖీలకు రాని అధికారులు * అక్రమార్కులకు అడ్డదారిలో వోసిలు --
english title:
oc
Date:
Tuesday, November 19, 2013