హయత్‌నగర్, నవంబర్ 18: హయత్‌నగర్ మండలంలోని అన్ని గ్రామాల ఎన్నికల ఓటర్ల ముసాయిదాను విడుదల చేసినట్లు తహశీల్దార్ మధుమోహన్ తెలిపారు. ముసాయిదాను మండల కారాలయం, పోలీస్‌స్టేషన్, రెవెన్యూ, గ్రామ పంచాయితీ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎవరైన తమ ఓటరు కార్డుపై మార్పులు, చేర్పులుంటే సంబంధిత పోలీంగ్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జనవరి 10 లోపు మార్పులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 16న తుది జాబితాను విడుదల చేస్తామని తర్వాత ఎలాంటి మార్పులు చేయమని తెలిపారు.
డివిజన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కుత్బుల్లాపూర్, నవంబర్ 18: కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కుత్బుల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని మున్సిపల్ కార్యలయంలో జరిగిన ప్రజావాని కార్యక్రమానికి ఆయన హాజరై కుత్బుల్లాపూర్ సర్కిల్ 131 డివిజన్‌లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్కిల్ ఉప కమిషనర్ మమతకు వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారుల పనితీరు వల్ల ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డివిజన్‌లో ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ 131 డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, బస్తీలలో నెలకొన్న అండర్ గ్రౌండ్, మంజీరా నీరు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శంకుస్థాపనలు చేసిన పలు అభివృద్ధి పనులను సైతం కాంట్రాక్టర్లు మొదలుపెట్టి మధ్యలోనే ఆపివేయడం ఎంతవరకు సమంజసమని సర్కిల్ ఉపకమిషనర్ మమతను ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, మురళి, రత్నాకర్, చంద్రవౌళి, సుజాత, రమ్యకుమారి పాల్గొన్నారు.
రచ్చబండలో లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు
మేడ్చల్, నవంబర్ 18: రేపు ఎండిఓ కార్యాలయంలో నిర్వహించే మూడవ విడత రచ్చబండలో అర్హులైన లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేయనున్నట్లు ఎండిఓ కె.శోభ తెలిపారు. బుధవారం ఉదయం 10 గం.కు నిర్వహించే రచ్చబండలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కె.ఎల్.ఆర్ పాల్గొని రేషన్‌కార్డుల పంపిణీ, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మంజూరు ఉత్తర్వుల పంపిణీ, ఇందిరమ్మ కలల పథకంద్వారా మంజూరైన పనుల ప్రారంభోత్సవం దళితుల విద్యుత్ బకాయిల పంపిణీ షెడ్యూల్డు తెగలవారికి విద్యుత్ బకాయిల పంపిణీ వుంటాయని ఆమె పేర్కొన్నారు.
కొనసాగుతున్న వారోత్సవాలు
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జాతీయ గీతాలు, రంగోలీ పోటీలను నిర్వహించారు. ముగింపురోజు విజేతలకు బహుమతులు అందజేస్తామని గ్రంథపాలకుడు యాదగిరి తెలిపారు.
గౌడ కులస్థులు ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి
ఉప్పల్, నవంబర్ 18: గౌడ కులస్థులు ఐక్యంగా నిలిచి తమ హక్కులను సాధించుకోవాలని గౌడ సంఘం సీనియర్ నాయకుడు బజారు రమేశ్‌గౌడ్ అన్నారు. సోమవారం ఉప్పల్ భరత్‌నగర్‌లోని కల్లు కాంపౌండ్ సమీపంలో కౌండిన్య గౌడ సంఘం కార్యాలయాన్ని సహకార సంఘం అధ్యక్షుడు బజారు రామరాజు, ప్రధాన కార్యదర్శి బుర్ర ఈశ్వర్‌గౌడ్, సీనియర్ నేతలు కృష్ణాగౌడ్, బజారు జగన్నాధ్‌గౌడ్, కె.కిషన్‌గౌడ్, బొమ్మగోని రాములుగౌడ్, బూతుకూరి కృష్ణాగౌడ్, పంజాల జైహింద్‌గౌడ్, బజారు రవినాధ్‌గౌడ్, మురళీకృష్ణగౌడ్, సురేష్‌గౌడ్, పి.గురునాధ్‌గౌడ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. దీర్ఘకాలిక సమస్యలను సమష్టి కృషితో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
సమర భేరిని విజయవంతం చేయండి
నగరంలోని నిజాం కళాశాల గ్రౌండ్‌లో ఈ నెల 24న జరిగే తెలంగాణ గౌడ సమరభేరి చలో హైదరాబాద్ కార్యక్రమంలో లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని సమర భేరి సభ వైస్ చైర్మన్ అంబాల నారాయణగౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం సమర భేరి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు పంజాల జైహింద్‌గౌడ్, నేర్థం భాస్కర్, బజారు రమేశ్, కృష్ణ, జగన్, మురళీకృష్ణ, రాములుగౌడ్, గురునాధ్‌గౌడ్ పాల్గొన్నారు.