Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిరాశే..

$
0
0

శ్రీకాకుళం, నవంబర్ 19: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫైలిన్, భారీ వర్షాల వల్ల అపారనష్టం వాటిల్లిన శ్రీకాకుళం జిల్లాలో వరద ప్రాంతాలను సందర్శించాల్సిన కేంద్ర బృందం విశాఖట్నం, విజయనగరం జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించడంపై ఇక్కడ బాధితులంతా తప్పుబడుతున్నారు. మొదటిరోజు నాలుగు మండలాల్లో ఈ బృందం పర్యటించాల్సి ఉన్నప్పటికీ కేవలం లావేరు, ఎచ్చెర్ల మండలాలకే పరిమితమైంది. లావేరులో అదపాక కూడలి వద్ద పంట నష్టాన్ని, బుడుమూరులో నారాయణసాగరం గండిని పరిశీలించి ఎచ్చెర్ల టిటిడిసిలో ఫోటో ఎగ్జిబిషన్‌తో ఈ బృందం మమా అనిపించింది. ఇదే మండలంలో నారాయణపురం కుడికాలువకు పడ్డ గండిని పరిశీలించేందుకు కేంద్ర బృందం విచ్చేస్తున్నట్లు తెలుసుకుని ఆయకట్టు రైతాంగమంతా తమ గోడును వెల్లబుచ్చుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. సాయంత్రం వరకు బాధిత రైతాంగం పడిగాపులు కాసినా చివరి నిముషంలో బృందం ప్రతినిధులు రారని సమాచారం అధికారులు ఇవ్వడంతో వారంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. రణస్థలం, పొందూరు మండలాల్లో పర్యటనను రద్దు చేయడంతో అక్కడ బాధిత రైతాంగం ఒకింత నిరాశకు లోనైంది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించిన కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఫైలిన్, భారీ వర్షాల బీభత్సానికి జరిగిన అపారనష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ కేంద్ర బృందాన్ని కోరారు. జిల్లాలో వాటిల్లిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముగ్గురు ప్రతినిధులతో కూడిన కేంద్ర బృందం జిల్లాకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6.20 గంటలకు లావేరు మండలం అదపాక కూడలిలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను, మండలంలో జరిగిన పంటనష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది. వివిధ పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బృంద ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం.పి. ఝాన్సీలక్ష్మీ, ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడులు రైతులు ఇబ్బందులను కేంద్ర బృందానికి క్షుణ్ణంగా వివరించారు. 50 శాతం మేర పాడైన పంటలకు పరిహారం అందించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ నిబంధన వల్ల చిన్న, సన్నకారు రైతులకు పరిహారం దక్కకుండాపోతుందని కేంద్ర బృంద దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నిబంధనలు పక్కనపెట్టి పాడైన ప్రతీ పంటకు పరిహారం అందించేలా సాయమందించినట్లయితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపగలుగుతామని కేంద్ర బృందానికి ఎం.పి, ఎమ్మెల్యేలు సూచించారు. అక్కడ నుంచి బుడుమూరు సమీపంలో నారాయణసాగరానికి గండుపడిన ప్రాంతాన్ని ఆ బృందం పరిశీలించింది. ఈ గండి వల్ల 200 కుటుంబాలు వరద తాకిడికి గురై తీవ్రంగా నష్టపోగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ జాతీయ విపత్తు బృందాలను రంగంలో దింపి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగారని కేంద్ర బృందం ప్రతినిధులకు సర్పంచ్ కింతలి శ్రీనివాసరావుతోపాటు మరికొంతమంది నాటి పరిస్థితిని వివరించారు. అనంతరం ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న డిఆర్‌డిఏ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. నీటమునిగిన వరి, కొట్టుకుపోయిన రోడ్లు, కాలువలకు పడ్డ గండ్లు , జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు, సహాయక చర్యలు, విపత్తుల బృందం సేవలు, ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శనలో కేంద్ర బృందం తిలకించి అవాక్కయ్యారు. ఇంతటి విపత్తును ఎదుర్కొని మ్రుమ్మర సహాయక చర్యలు చేపట్టడం పట్ల జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను ఇతర అధికారులను, కేంద్ర బృందం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్.అండ్.బి. అతిథి గృహానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేశారు.

హోరెత్తిన సమైక్య వాణి

శ్రీకాకుళం , నవంబర్ 19: రాష్ట్ర సమైక్యతకు పాటుపడదామంటూ విద్యార్థి లోకం ఎలుగెత్తి చాటింది. ఈ మేరకు మంగళవారం పట్టణంలో వివిధ విద్యాసంస్థల నుండి వేలమంది విద్యార్ధులు హాజరై స్థానిక డే అండ్ నైట్ కూడలి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ డే అండ్ నైట్ కూడలి నుండి ఏడురోడ్ల కూడలి వరకు సాగింది. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్యాకేజీలకు లొంగిపోయి, రాష్ట్రాన్ని అమ్మేసారని, వారిని వెలివేయాలంటూ నినదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏడురోడ్ల కూడలి వద్ద మంత్రి కిల్లి కృపారాణి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి కాలితో తొక్కి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రి వర్గీయులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో పోలీసులు భారీగా ఏడురోడ్ల కూడలి వద్దకు చేరుకునేలోగానే విద్యార్థులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు జామి భీమశంకర్, దుప్పల వెంకటరావు, వై.జయరామ్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ భూముల పరిరక్షణే ధ్యేయం
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలాదేవి
పాలకొండ, నవంబర్ 19: ఆలయాలకు చెందిన భూముల్లో బోర్డులను ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేస్తామని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్యామలాదేవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక దుర్గగుడి వద్ద ఆమె విలేఖర్లతో మాట్లాడారు. ఉత్సవాల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సదాశివుని ఆలయ భూముల పరిరక్షణలో అధికారులు తాత్సారం చేస్తున్నారని, దీంతో అక్రమార్కులు భూములను అమ్ముకొనేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నారని పట్టణ టిడిపి దుప్పాడ పాపినాయుడు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. గత కొనే్నళ్లుగా పాలకొండ, వీరఘట్టం రహదారిలో ఫైర్‌స్టేషన్ దరిలో ఉన్న సర్వే నెంబర్ 269/ 3లో 119 సెంట్లు కోట్లాది రూపాయలు విలువైన భూమిని కబ్జాచేస్తున్నారని, తాము గుర్తించి అధికారులకు చేరవేసామన్నారు. తక్షణమే ఈ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ తక్షణమే ఆక్రమణలకు గురైన భూముల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అలాగే దసరా ఉత్సవాల్లో కూడా అవే జరుగుతుందని ఆరోపణలు రావడంతో దీనిపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. ఆమెతో పాటు సదాశివుని ఆలయ మేనేజర్ వాసుదేవరావు ఉన్నారు.

మేనేజ్‌మెంట్ కోర్సులకు ఉజ్వలభవిత
* వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్
ఎచ్చెర్ల, నవంబర్ 19: కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ఉజ్వల భవిత ఉంటుందని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ స్పష్టంచేశారు. కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో ఫాదర్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌గా ఖ్యాతినార్జించిన పీటర్ డెక్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ విద్యతో ఉపాధి, ఉద్యోగవకాశాలు మెండుగా లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ రంగం రోజురోజుకూ విస్తరించడం వలన మరిన్ని ఉద్యోగవకాశాలు అందిపుచ్చుకోవచ్చునన్నారు. ఈసదస్సులో రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, సిడిసి డీన్ తులసీరావు, ప్రొఫెసర్ టి.కామరాజు, డాక్టర్ డి.విష్ణుమూర్తిపాల్గొన్నారు.

నేరాల నివారణకు ప్రజల సహకారం అవసరం
పాలకొండ, నవంబర్ 19: ప్రజల సురక్షితం కోసం నేరాలు అదుపు చేయాలంటే ప్రజల సహకారం అవసరమని డి ఐజి ఉమాపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డి ఎస్పీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. పాలకొండ సబ్ డివిజన్‌కు సంబంధించి నేరాలు అదుపులోనే ఉన్నాయన్నారు. కొత్తూరు, పాతపట్నం పరిధిలో మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. 100 ఫోన్ నెంబర్‌కు ప్రజలు తప్పుడు సమాచారం అందించి దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు. ఈ నెంబర్ ద్వారా సకాలంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.వంగర మండలం లక్ష్మిపేటలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ ఐలతో పాటు, సిఐ, డి ఎస్పీలు కూడా పర్యటించడం ద్వారా ప్రజలకు ధైర్యం కలుగుతుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో విజయనగరం కర్ఫ్యూ నీడలో ఉంచడానికి కారణం ప్రజల రక్షణ కోసమేనని పేర్కొన్నారు. విజయనగరం అల్లర్లలో సమైక్యాంధ్ర ఉద్యమమే కారణమా, లేక అల్లరి మూకల ఆగడాలు ఉన్నాయా అని విలేఖర్లు ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 53 కేసుల్లో 403 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కూడా 1,012 మందిపై కేసులు నమోదు చేసామని, త్వరలో వీటిపై ఛార్జి షీటు దాఖలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సొంత ప్రాంతాల్లో నియమించడం జరుగుతుందని, దీని కోసం జిల్లా కేంద్రంలో 20 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజలతో మెలిగే విధానాల పట్ల, నేరాలను అదుపు చేసే విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. 37 మంది ఎస్ ఐలు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని, వీరిని జనవరి 20తేదీకి శిక్షణ పూర్తి చేసి విధుల్లో నియమిస్తామన్నారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పి నవీన్ గులాఠీ, డి ఎస్పీ దేవానంద్ శాంతో తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పథకాలను వికలాంగులు వినియోగించుకోవాలి
శ్రీకాకుళం, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. మంగళవారం స్థానిక కోడిరామ్మూర్తి ప్రాంగణంలో వికలాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగులు నిరుత్సాహపడకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. జిల్లాలో 125 మందికి స్వయంశక్తితో ఎదిగి తమ అంతట తాము ఎదుట మనిషితో సమానంగా నిలబడేటట్లు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపుజాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, రాష్ట్ర డాక్టర్స్ సెల్ కన్వీనర్ కె.రామ్మోహనరావు, వికలాంగుల శాఖ ఎ.డి లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇ.ఇ రవీంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవంను పురస్కరించుకుని మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతీ ఒక్క ఇంటివారు మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, రూ.900 కడితే 9001రూపాయల సబ్సిడీ కింద మంజూరు చేస్తుందన్నారు. అంతకుముందు వ్యక్తిగత మరుగుదొడ్లు కోసం ముద్రించిన గోడపత్రికను ఆమె విడుదల చేశారు.

ఘనంగా సామూహిక బిల్వార్చన
నరసన్నపేట, నవంబర్ 19: మండల కేంద్రంలో మారుతీనగర్‌లో ఉన్న సత్యసాయిబాబా ఆలయంలో బాబా 88వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 160 మంది మహిళలచే బిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయిసేవాసమితి కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ బాబా జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19 నుండి 23వ తేదీవరకు పలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

సాగుభూములపై హక్కు తప్పనిసరి
సీతంపేట,నవంబర్ 19: సాగుఛేస్తున్న భూమిపై రైతులకు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో ఏడవ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ సౌరభ్‌గౌర్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మకసుగ్రీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన రైతులకు భూ హక్కు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వం భూపంపిణి కార్యక్రమాన్ని అమలుచేస్తుందన్నారు. గతంలో ఆరు విడతల్లో భూపంపిణీ చేసినప్పటికి అప్పటి కంటే ఇప్పుడు గిరిజన రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్‌పుస్తకాల్లో రైతుకు చెందిన రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు నెంబర్‌ను జత చేయడం జరిగిందన్నారు. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకంతో పాటుగా డీ పట్టా, టైటిల్‌డీడ్, ఎఫ్‌ఎంబి,కంప్యూటరైజ్‌డు అడంగళ్ వంటివి అందజేస్తామన్నారు. ప్రతీ ఒక్కరు ఆధార్‌కార్డు పొందాలని అలా పొందని వారి కోసం ప్రభుత్వం వచ్చే నెల వరకు గడుపుపెట్టిందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1800ఎకరాలను ఈ ఏడవ విడత భూపంపిణి కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నామన్నారు. డీ పట్టా భూముల పై రైతులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది రైతులకు 1400కోట్లు రుణాలు ఇవ్వడం లక్ష్యం కాగా ఇప్పటికి రూ.925కోట్లు బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందజేశామన్నారు. ఎమ్మెల్యే నిమ్మకసుగ్రీవులు మాట్లాడుతూ సెంటు భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి వారికి దాని పై హక్కు కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అలాగే బ్యాంక్‌లు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చేలా కలెక్టర్ చొరవతీసుకోవాలని కోరారు.అనంతరం సీతంపేట మండలానికి సంబంధించి 621.44ఎకరాలను 324మంది గిరిజన రైతులకు భూపట్టాలను కలెక్టర్, ఎమ్మెల్యే సుగ్రీవులు పంపిణి చేసారు.అలాగే భామిని మండలానికి సంబంధించి 87.14ఎకరాలను 127మంది లబ్ధిదారులకు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్,పాలకొండ ఆర్డీఓ ఎన్ తేజ్‌భరత్,స్థానిక సర్పంచ్ ఆరికభారతి,రెండు మండలాల తహశీల్దార్‌లు మంగు,సావిత్రి,ఉపసర్పంచ్ జన్ని వసంత,ఆర్‌ఐలు రాంబాబు,రెవెణ్యు సిబ్బంది,గిరిజన రైతులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బలహీనపడితే దేశానికే ప్రమాదం
శ్రీకాకుళం, నవంబర్ 19: దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడితే దేశానికే ప్రమాదమని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 97వ జయంతి సందర్భంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రగతికోసం, సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీని పరిరక్షించుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర విభజనలో సోనియాపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన ప్రతిపక్షాలన్నీ లేఖలిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత ఎదురుతిరగడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లా రూపురేఖలను మార్చిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ కన్వీనర్ కిల్లి రామ్మోహనరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్శన్ ఎం.వి.పద్మావతి, డిసిసిబి అధ్యక్షుడు డోల జగన్, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డి.ఎస్.కె.ప్రసాద్, డిసియంయస్ చైర్మెన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, మాజీ ఎమ్మెల్యే కె.ఎ.ఎన్.్భక్త, చౌదరి సతీష్, కె.యల్.ప్రసాద్, శిమ్మరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కృపారాణి జన్మదిన వేడుకలు
కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో కేంద్ర మంత్రి అభిమానులు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎజెసి రాజ్‌కుమార్, డి ఆర్వో నూర్‌బాషా ఖాసిం, ఆర్డీవో పాటు కాంగ్రెస్ నేతలు కె.యల్.ప్రసాద్, చౌదరి సతీష్, శిమ్మరాజశేఖర్, డోల జగన్, యం.వి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
యువత రక్తదానం
కృపారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత రక్తదానం చేసారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చౌదరి సతీష్ ఆధ్వర్యంలోని యువత రక్తదానం చేసారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కృపారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ కన్వీనర్ కిల్లి రామ్మోహనరావు, డాక్టర్ బగాది సుమన్ తదితరులు పాల్గొన్నారు.

వంశధార కాలువల మరమ్మతులకు రూ.74కోట్లు
నరసన్నపేట, నవంబర్ 19: జిల్లాలో వంశధార కాలువలకు మరమ్మతులు చేపట్టేందుకు రబీ సీజన్‌లో సాగునీరు నిలుపుదల చేస్తున్నట్లు వంశధార ఎస్.ఇ ఎస్.రాంబాబు వెల్లడించారు. మంగళవారం స్థానిక వంశధార సబ్‌డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ నీటి సంఘాల అధ్యక్షులు, సర్పంచ్‌ల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో వంశధార కుడి, ఎడమ కాలువలకు సంబంధించి ఆధునీకరణ చేపట్టేందుకు 74.14 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 1990లో సాగునీటి కాలువలను ఏర్పాటు చేశామని, అవి పూర్తిగా పూడికతో నిండిపోయాయని తెలిపారు. వంశధారలో కాలువలకు నీరు అందిస్తున్నా, రైతులకు చేరువయ్యే పరిస్థితులు రోజురోజుకూ తగ్గిపోతుండటాన్ని గుర్తించామన్నారు. దీనికి సంబంధించి వంశధార కాలువలో ఆరు ఓపెన్ హెడ్ ఛానళ్లలో పూడిక తీత పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చాలా మందిరైతులు రెండవ పంటకు సాగునీరందించాలంటూ కోరుతున్నారని, అయితే ఈ ఏడాది రెండవ పంటకు సంబంధించి సాగునీటిని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేశారు.
ఈ ఒక్క ఏడాది రైతులు సహకరించినట్లయితే వచ్చే ఏడాది రెండు నుండి మూడు పంటలకు నీరు అందించగలమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి సంఘ అధ్యక్షుడు రాడ మోహనరావు, కోఆర్డినేటర్ శేషగిరిరావు, డి.ఇ శేఖరరావు, సిబ్బంది, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

వచ్చే 18 నుంచి మహాసౌరయాగం
పాతశ్రీకాకుళం, నవంబర్ 19: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో డిసెంబర్ 18వ తేదీ నుండి 30 వరకు మహాకుంభాభిషేక సహిత మహాసౌరయాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది సంభవించిన కాల సర్పదోషం, కుజస్తంభన దోషాల వలన దేశంలోను, రాష్ట్రంలోను అశాంతి నెలకొందన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు మహాకుంభాభిషేక యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కంచికామ కోటి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్రసరస్వతీలు, వౌనానంద తపోవన పీఠాధిపతి రామానంద భారతీస్వామిలు హాజరవుతున్నట్లు తెలిపారు. అరసవల్లి క్షేత్రంలో ఇప్పటివరకు మూడు పర్యాయములు మహా సౌరయాగాన్ని నిర్వహించామన్నారు. 1982వ సంవత్సరంలో మహాసౌరయాగం ద్వారా 60 వేల రూపాయలు ఆదాయం దేవస్థానానికి లభించిందని, 1999లో 60 లక్షల రూపాయలు, 2007లో మూడు కోట్ల రూపాయల వరకు దేవస్థానానికి ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు పది ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18వ తేదీ నుంచి 29వ తేదీవరకు మహాసౌరయాగాన్ని నిర్వహించి 30న మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18న పూర్ణకలశాలతో గ్రామప్రదర్శనలు నిర్వహించిన అనంతరం ఉదయం 7.30 గంటలకు ఆరుద్ర నక్షత్రయుత ధనుర్‌లగ్నమందు పీఠాధిపతి శ్రీరామానందభారతీస్వామిజీచే మహాసౌరయాగ కలశ స్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 29వ తేదీవరకు 12 రోజుల పాటు ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు యాగశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 36 మంది దంపతులచే నిరంతరం ప్రత్యేక పూజలు జరిపిస్తున్నట్లు తెలిపారు. 30వ తేదీ 6.30 గంటలకు అనూరాధ నక్షత్రయుత ధనుర్‌లగ్నమందు శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి, రామానందభారతీస్వామి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించనున్నారని చెప్పారు. ఉదయం 11.15 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు.
* ప్రత్యేక కమిటీల నియామకం
మహా సౌరయాగాన్ని నిర్వహించేందుకు పది ప్రత్యేక కమిటీలను నియమించినట్లు ఆలయ అర్చకులు శంకరశర్మ తెలిపారు. ప్రధాన కమిటీ అధ్యక్షులుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వ్యవస్థ్ఫాక అధ్యక్షులు ఇప్పిలి జ్యోతిసన్యాసిరావు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, యాగాధిపతులు కృష్ణయాజీలు కమిటీలో ఉన్నారన్నారు. మీడియాసెల్ విభాగంలో ఉరిటి శ్రీనివాసరావు, దేవేంద్ర, సుధీర్‌వర్మ, జల్లేపల్లి శ్రీ్ధర్, శ్రీనివాస్, ఉండవల్లి రవి, రుషి, టి.మోహిని, కె.ఎల్.ప్రసాద్, ఆర్.జగన్నాధంలు ఉన్నారని తెలిపారు. అలాగే ఆహ్వాన కమిటీ, యాగశాల కమిటీ సాంస్కృతిక కమిటీ పరిసరాల పరిశుభ్రత కమిటీ, విఐపి ఆహ్వాన కమిటీ, విరాళాల సేకరణ కమిటీలను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన పి.ఏ ప్రేమ్‌చంద్, అర్చకులు నగేష్‌శర్మ, కె.ఎల్.ప్రసాద్, జి.బాబు, సాయిరవి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాసౌరయాగ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

శ్రీచక్రపురంగా శ్రీకాకుళం
ఎచ్చెర్ల, నవంబర్ 19: ఆధ్యాత్మిక శోభతో ఫరిడిల్లుతున్న శ్రీకాకుళం ఇక నుండి శ్రీచక్రపురంగా పిలువబడుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతీ పేర్కొన్నారు. మండలంలో కుంచాలకూర్మయ్యపేట దేవీ ఆశ్రమంలో బుధవారం అమ్మవారిని దర్శించుకుని భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రపంచ వింతల్లో ఇదొక వింత అని, నభూతో.. 1001 శ్రీచక్రాల స్థాపన అంటే మాటలు కాదన్నారు. దమ్మున్న వాడే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టగలడని, అటువంటి సమర్ధుడు బాలుస్వామి అని కొనియాడారు. ఎంతో మంది ఉపాసకులు, పీఠాధిపతులు ఉన్నారని, ఇటువంటి ఆలయ నిర్మాణం చేయడం సామాన్యుల తరం కాదన్నారు. బాలు పూర్వజన్మ సుకృతమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఒక వైపు అమ్మవారు, మరోవైపు ఉన్న ఐదు కోణాల్లో పరమశివుడు, శ్రీచక్రమునకు పూజ చేస్తే పలు దోషాలు నివృత్తి తధ్యమన్నారు. మీకు ఎప్పుడైనా మనస్సు బాగులేకపోయినా అనారోగ్యానికి గురైనా ఒక్కసారి శ్రీచక్రం వద్ద కూర్చొని వౌనంగా ధ్యానం చేస్తే అన్ని దోషాలు పటాపంచెలవుతాయన్నారు. త్రిమూర్తులకు ఇటువంటి లేవని, ఒక్క అమ్మవారికే సకలం నేనే,, అంతా నేనే అంటూ మానవ దేహమే తాను అదే శ్రీచక్రమన్నారు. అమ్మతో మాట్లాడాలంటే గురువు అవసరం, గురువుల చెంత ఉండే అర్హత బాలుస్వామికి దక్కడం, సిక్కోలు జిల్లా వాసికి దక్కడం మరింత అభినందనీయం. తాను సిక్కోలు వాసినేనంటూ గుర్తుచేశారు. 1001 శ్రీచక్రమేరులతో అమ్మవారిని స్థాపించడం విశేషమని పొగడ్తలతో ముంచెత్తారు. అమ్మ ఆజ్ఞతోనే బాలుస్వామి ఈ తరం నుంచి భావితరాల వరకు గుర్తుండే విధంగా ఆలయ నిర్మాణం చేశారన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడే ఉండాలని ఉందని, అయితే మా పీఠానికి సంబంధించి ఓ కార్యక్రమం హైదరాబాద్‌లో ఉన్నందున తాను వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. శ్రీచక్రాన్ని చూసి ఎంతో సంతోషించానని, మనమెంతో పుణ్యం చేసుకున్నామని స్పష్టంచేశారు. అనంతరం స్వరూపానందస్వామికి బాలభాస్కరశర్మ పాదపూజలు, పుష్పాభిషేకం, యాలకులమాలతో సత్కరించారు. మహామేరువు వద్ద పూజలు చేసి యాగశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న జపాలు, యాగాలు, హోమాలను చూసి మరింత ఆనందం వ్యక్తంచేశారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసేందుకు తరలిరావడం కనిపించింది. తొలుత ఆశ్రమంలో మహన్యాస పూర్వకంగా ఏకో రుద్రాభిషేకం, నమకం, చమకంలను 11 మంది వేదపండితులతో ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో శివునికి అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా 2,500 మంది మహిళలతో కుంకుమార్చనలు సాగించారు. లక్ష చామంతులతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది వేదపండితులు పాల్గొన్నారు. అదేవిధంగా 108 మంది మహిళలతో సువాసిని పూజలు నిర్వహించి వారికి అన్నసమారాధన నిర్వహించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫైలిన్, భారీ వర్షాల వల్ల అపారనష్టం వాటిల్లిన
english title: 
niraashe

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>