విశాఖపట్నం, నవంబర్ 19: మహావిశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) నిరంతర తాగునీటి సరఫరాకు సన్నాహాలు చేస్తోంది. తొలుత ఎంపిక చేసిన ప్రాంతంలో 24 గంటల పాటు మంచినీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం జివిఎంసి పరిధిలోని వాయువ్య ప్రాంతాన్ని ఎంపిక చేశారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో భాగంగా నిరంతర నీటిసరఫరా ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించారు. ఇందుకోసం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వర్కింగ్ కమిటీతో మంగళవారం సమావేశమైన కమిషనర్ ఎంవి సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుపై వివరించారు. ఎంపిక చేసిన ప్రాంతంలో నిరంతరం మంచినీటిని సరఫరా చేసే ప్రాజెక్టుకు 266 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపారు. పథకాన్ని చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం తన వాటాగా 50 శాతం నిధులను సమకూర్చగా జివిఎంసి తన వాటాగా 30శాతం నిధులు భరించాల్సి ఉందన్నారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 20 శాతం నిధులు పెట్టుబడులుగా ఉంటాయన్నారు. అయితే జివిఎంసి తన వాటాను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి)లో సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నగరంలో నిరంతర నీటి సరఫరాకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వర్కింగ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన దృష్ట్యా ఇక కార్యదర్శి స్థాయిలో మరోసారి సమావేశమై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జివిఎంసికి సాలీనా రూ 12 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని కమిషనర్ తెలిపారు. ప్రాజెక్టు నిమిత్తం గతంలో నిలిపివేసిన నిధులతో కలిపి జివిఎంసి 80 కోట్ల రూపాయలను తన చెల్లించాల్సి ఉంటుందన్నారు. నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టునకు సంబంధించి చేసిన ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నట్టు కమిషనర్ వెల్లడించారు. మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర పథక నివేదిక (డిపిఆర్) సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 80 లక్షల రూపాయలను ఇప్పటికే మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. సమావేశంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వర్కింగ్ కమిటీ సభ్యులు అజిత్ కుమార్, ప్రేమ్‌నారాయణ, దీన్‌దయాళ్‌తో పాటు జివిఎంసి ఇంజనీర్ రవి సమావేశంలో పాల్గొన్నారు.
* రూ 264 కోట్లతో ప్రాజెక్టు * జివిఎంసి వాటా రూ 70 కోట్లు
english title:
gvmc
Date:
Wednesday, November 20, 2013