విశాఖపట్నం, నవంబర్ 19: రానున్న ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ కేడర్‌ను సమాయత్తపరచే క్రమంలో భాగంగా అధిష్టానం పిలుపుమేరకు నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ సారధ్యంలో చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం మంగళవారం తొమ్మిదోరోజు కొనసాగింది. జివిఎంసి పరిధిలోని 28వ వార్డు నీలమ్మవేపచెట్టు నుంచి అమ్మోరువీధి, బంగారుమెట్ట, అర్జునవీధి ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగింది. ఈసందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ వివక్షకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికార పార్టీ కార్యకర్తలు అనర్హులైనా వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి చెందిన అర్హులకు సైతం సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు. నగరంలో రోడ్ల పరిస్థితి దుర్భరంగా తయారైందని, కనీసం తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో అవినీతి కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈసందర్భంగా వాసుపల్లి తన సొంత ఖర్చుతో 10 మంది వృద్ధులు, పేదలకు పించన్లు పంపిణీ చేశారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బంటుపల్లి సూర్యనారాయణ, సత్యవతి, మరియదాసు, భాస్కరరావు, చింతకాయల అమ్మోరు. పిల్లి వరలక్ష్మి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
లక్షలన్నర విలువైన బంగారు నగలు చోరీ
* రైల్వే పోలీసులకు మహిళ పిర్యాదు
విశాఖపట్నం, నవంబర్ 19: టాటానగర్ నుంచి విశాఖపట్నం వస్తున్న ఓ మహిళ సూట్‌కేసు నుంచి రూ.1.5 లక్షల విలువైన బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీనిపై మంగళవారం ఆ మహిళ ప్రభుత్వ రైల్వే పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ నెల 16వ తేదీన టాటానగర్‌లో రైలెక్కిన రమణమ్మ విశాఖలోనున్న తన కుమారుడు న్యాయవాది కెవిఎస్‌వి ప్రసాదరావు ఇంటికి వస్తోంది. బి-2 ఏసి కోచ్‌లో ప్రయాణిస్తున్న రమణమ్మకు చెందిన సూట్‌కేసులో నాలుగున్నర తులాల బంగారం ఉంది. దీని సూట్‌కేసు కింద కన్నం చేసి మరి ఉంది. అయితే ఈ విషయం ఇంటికి వెళ్ళి సూట్‌కేసును తెరిచిన తరువాత గానీ తెలియలేదు. దీంతో లబోదిబో మంటూ పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన చోరీ సంఘటనపై పిర్యాదు చేశారు. దీనిపై సిఐ పార్ధసారధి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 17వ తేదీ ఉదయం దిగిన ఆమె ఇంటికి వెళ్ళిన తరువాత సూట్‌కేసు తెరిచి చూడగా బంగారు నగలన్నీ మాయమైనట్టుగా ఆమె ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది.