అనకాపల్లి , నవంబర్ 19: ఇటీవల సంభవించిన భారీ వర్షాల వలన నీటిముంపునకు గురై పంటలకు వాటిల్లిన నష్టాన్ని కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. వరద ముంపునకు గురై నష్టం వాటిల్లిన చెరకు, వరి, కూరగాయలు తదితర పంటలకు వాటిల్లిన నష్టాన్ని ఈ బృందం సభ్యులు స్వయంగా పరిశీలించి చలించిపోయారు. గత నెల ప్రకృతి రైతుపై కనె్నర్ర చేసి తుఫాన్ రూపంలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురవడంతో రైతుకు చేతికి అందివచ్చిన పంట నీటి పాలయింది. వరద వచ్చిన మూడు వారాలు తరువాత ఎట్టకేలకు పంట నష్టం పరిశీలనకు కేంద్ర బృందం మంగళవారం గ్రామీణ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి మండలంలో కొప్పాక ఫ్లైఓవర్ బ్రిడ్జీ పై నుంచి కేంద్ర బృందం అధికారులు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పిజిఎస్ రావు, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ హైవేస్ ఎస్‌ఇ కార్యాలయ రీజనల్ ఆఫీసర్ డాక్టర్ ఎ. కృష్ణప్రసాద్, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అసిస్టెంట్ అడ్వర్‌టైజర్ డాక్టర్ వికె బాట్ల, డాక్టర్ ఎన్‌ఓఆర్‌కె శర్మ నేషనల్ ఫుడ్ సెక్యురిటీ మిషన్ వీరితోపాటు జిల్లా కలక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వరద నీటికి ముంపు అయిన పంట భూములను పరిశీలించారు. అనంతరం ఆర్‌డివో వసంతరాయుడిను పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి మండలంలో వరద ప్రభావంతో నీట మునిగిన పంట వివరాలు వరిపంట 4వేల వంద ఎకరాలు, చెరకుపంట 250ఎకరాలు, మొక్కజొన్న పంట 25ఎకరాలు, పప్పుదినుసులుపంట 10ఎకరాలు మొత్తం 4385ఎకరాల్లో పంటలు పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆర్డీవో వంసతరాయుడు తెలిపారు. అనంతరం డైట్ కాలేజీ సమీపంలో ఆవఖండంలో సుమారు వెయ్యి 50 ఎకరాల పంట నీటమునగడంతో పంట పూర్తిగా నాశనమవడంతో కేంద్ర బృందం అధికారులు సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటను కుళ్లిపోయిన వరిపంటను పరిశీలించారు. ఈ ప్రాంతానికి ఇంత ఎక్కువ నీరు నిల్వ ఉండి పంట నాశనమవడానికి కారణమేమిటని రైతులను అడిగి తెలుసుకున్నారు. దీంతో రైతులు సమీపంలో శారదానది నీరు ఇక్కడికి వచ్చి చేరడంతో ఇక్కడనుండి నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో పంట నీటమునిగి వారం పదిరోజులపాటు నీటిలో ఉండటంతో పంట పూర్తిగా కుళ్లిపోయిందని, గత మూడు సంవత్సరాల నుండి ప్రతీ ఏడాది నీలం తుఫాన్, భారీవర్షాల కారణంగా చేతికి అందివచ్చిన పంట నీటి పాలవుతుందని, అధికారులు వచ్చి పరిశీలించి పంటనష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపించడమే తప్ప నష్టపరిహారం రైతులకు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రాంతంలో నీరు బయటకు తరలించడానికి అవకాశం లేదని దీనికి కారణం తోటాడ దగ్గర రెగ్యులేటర్ గేట్లు ఎత్తు పెంచాలని రైతులు తెలిపారు. దీంతో కేంద్ర బృందం అధికారులు రైతులకు భరోసా ఇస్తూ పంటనష్టాన్ని నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నామని కేంద్రప్రభుత్వం మేం ఇచ్చిన నివేదికను బట్టీ పంటనష్టపరిహారం మంజూరు చేసి రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఇటీవల సంభవించిన భారీ వర్షాల వలన
english title:
central team
Date:
Wednesday, November 20, 2013