Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బాలరాజుకు సిఎం పర్యటనపై సమాచారం ఉంది!

$
0
0

విశాఖపట్నం, నవంబర్ 19: విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సమాచారం తనకు లేదని, అలాగే తన శాఖకు సంబంధించిన పనులను కూడా ముఖ్యమంత్రి తనకు తెలియకుండా మంజూరు చేశారంటూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన విషయాన్ని మంత్రి బాలరాజుకు చెప్పేందుకు ప్రయత్నించామని, కానీ ఆయన స్పందించలేదని అప్పట్లోనే జిల్లా అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, బాలరాజు మాత్రం తనకు ఎటువంటి సమాచారం లేదని ఇప్పటికీ కచ్చితంగా చెపుతున్నారు. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావును మంగళవారం విలేఖరులు ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ, బాలరాజుకు ముఖ్యమంత్రి పర్యటన సమాచారం లేదని తను పత్రికల్లో చూసి జిల్లా కలెక్టర్‌ను అడిగానని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను తనే స్వయంగా బాలరాజుకు చెప్పానని, అందుకు సిఇఓయే సాక్ష్యమని కూడా కలెక్టర్ తెలియచేశారని గంటా అన్నారు. సిఎం ఆఫీస్‌లో అడిగాను. అక్కడ శ్రీ్ధర్ అనే పర్సనల్ సెక్రటరీ బాలరాజుకు స్వయంగా సమాచారం అందించినట్టు చెప్పారు. పిఎ బాలకృష్ణను అడిగాను. ముఖ్యమంత్రి పర్యటనకు నాలుగు రోజులు ముందే మంత్రి బాలరాజుకు చెప్పానని వివరించారు. జిల్లా మంత్రికి తెలియకుండా కార్యక్రమం నిర్వహించే ధైర్యం ఏ అధికారీ చేయరు. అయితే, బాలరాజుతో స్వయంగా చర్చించి, లేదా అనుమతి తీసుకున్నారా? లేదా? అన్నది తనకు తెలియదు కానీ, ఆయనకు సమాచారం లేదన్నది కరెక్ట్ కాదు. సమాచారం ఉందనే అధికారులు అంతా చెపుతున్నారని గంటా అన్నారు.

తుఫాన్ ప్రభావంతో క్రషింగ్ ప్రారంభం జాప్యం
ఎస్. రాయవరం, నవంబర్ 19: తుఫాన్ ప్రభావం వలన ఏటికొప్పాక సుగర్స్ పరిధిలోని చెరకు పంట పక్వ దశకు వచ్చినప్పటికీ ఈ ఏడాది క్రషింగ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫ్యాక్టరీ వ్యవసాయ శాఖ సిబ్బంది తెలిపారు. ఈ ఏడాది ముందుగా క్రషింగ్ ప్రారంభిస్తామని తెలిపిన అధికారులు మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా డిసెంబర్ మాసం చివరి వారంలో క్రషింగ్ ప్రారంభించే అవకాశముందని చెబుతున్నారు. తుఫాన్ గడిచి నెలరోజులు దాటినప్పటికీ ధర్మవరం, పెనుగొల్లు, ఒమ్మవరం, గోకులపాడు, దార్లపూడి గ్రామాల్లో చెరకు తోటలు నీరు నిల్వ ఉండటంతో చెరకు పక్వం దశకు వచ్చినప్పటికీ పంచదార దిగుబడు పెరిగే అవకాశం లేకపోవడంతోపాటు చెరకును నరికే పరిస్థితి అనుకూలించక ఈ ఏడాది క్రషింగ్ ప్రారంభంలో జాప్యం తప్పదని అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో పంచదార ధర చెరకు రైతులకు చెల్లించే ధర విషయమై యాజమాన్యం మల్లగుల్లాలు పడుతుంది. గత రెండు మాసాల్లో క్వింటాల్‌కు రెండువందల రూపాయల వరకు తగ్గడంతో రైతులకు చెల్లించే ప్రోత్సాహక ధరను చెల్లించేందుకు పాలకవర్గం వెనుకడుగు వేస్తుంది. గత ఏడాది చెరకు సరఫరా చేసే రైతులకు టన్నుకు 200 రూపాయలు ప్రోత్సాహక ధరగా చెల్లించాలని మహాజన సభలో తీర్మానం చేసినప్పటికీ దీని అమలు ప్రశ్నార్ధకంగానే ఉంది. కాగా 2013-14 క్రషింగ్ సీజన్‌కు గాను బాయిలర్ పూజను 20వ తేదీ బుధవారం నాడు ప్రారంభిస్తున్నట్లు ఫ్యాక్టరీ ఎండి కెఎల్ విక్టర్ రాజు తెలిపారు.

దిగజారుతున్న బెల్లం ధరలు - కలవరం చెందుతున్న రైతులు
అనకాపల్లి, నవంబర్ 19: వరద ముంపునుండి తేరుకుని బెల్లం తయారీకి సన్నద్ధమైన రైతులకు చేదు అనుభవాలు చవిచూస్తున్నారు. వరద ముంపు వలన పంటనీట మునిగిపోయి నష్టాలను చవిచూసిన చెరకు రైతులకు మరోవైపు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కకావికలులవుతున్నారు. సోమ, మంగళ కేవలం రెండురోజుల వ్యవధిలో పదికిలోల బెల్లంపై 70రూపాయల ధర తగ్గిపోవడంతో బెల్లం తయారీచేస్తున్న రైతులు లబోదిబోమంటున్నారు. గత ఆగస్టులో మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 390 రూపాయల వరకు ధర పలికింది. బెల్లం తయారీ సీజన్ ఊపందుకుంటే అదమం 325 రూపాయల ధర అయినా నిలకడగా ఉంటుందని భావించారు. గత శనివారం 350 రూపాయలు పలికే మంచి రంగు కలిగిన నాణ్యమైన బెల్లం ధర 290 రూపాయలకు పడిపోయింది. సోమవారం ఇదే బెల్లం 320రూపాయల ధర పలకగా మంగళవారానికి 30 రూపాయల ధర తగ్గిపోయింది. 270 రూపాయలు పలికే నలుపురంగు బెల్లం ధర 235రూపాయలకు తగ్గిపోయింది. మార్కెట్‌కు వచ్చే బెల్లం పెరుగుతుండగా ధరలు అనూహ్యంగా పడిపోతుండటంతో రైతులు కలవరం చెందుతున్నారు. దేశంలోనే నాల్గవస్థానం పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు గత ఏడాది ఈ సీజన్‌లో రోజుకు సగటున 25వేల దిమ్మల బెల్లం వచ్చేది. వరద ముంపు వలన మార్కెట్‌కు వచ్చే బెల్లం మార్కెట్‌కు సోమవారం 16వేల 355 దిమ్మల బెల్లం రాగా మంగళవారం పదివేల దిమ్మల బెల్లం మాత్రమే వచ్చింది. మార్కెట్‌కు వచ్చే బెల్లం పెరగకపోయినా ధరలు తగ్గిపోతుండటంతో అపారనష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెరకు రైతులకు లబోదిబోమంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాయకష్టం మాట ఎలావున్నా పెట్టుబడులు సైతం దక్కక మరింత అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో బెల్లానికి డిమాండ్ పెరగకపోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

21 నుంచి ఈసేవ కేంద్రాల్లో వన్‌డే టికెట్ల విక్రయం
విశాఖపట్నం, నవంబర్ 19: భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య ఎసిఎ, విడిసిఎ స్టేడియంలో ఈనెల 24న జరగనున్న డేనైట్ వన్‌డే క్రికెట్ మ్యాచ్ టికెట్లను జివిఎంసి పరిధిలోని ఆన్ని ఈసేవ కేంద్రాల్లోను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్టు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అనకాపల్లి, భీమునిపట్నం, తగరపువలసతో పాటు నగర పరిధిలోని అన్ని ఈసేవ కేంద్రాల్లోను టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. రూ 5000, రూ 3000, రూ 2000, రూ 1,250, రూ 750, రూ 400 టికెట్లను విక్రయించనున్నట్టు ఆయన తెలిపారు.

రాష్ట్ర కమిటీ పిలుపతో ఎన్‌ఎంయు ధర్నాలు
విశాఖప్నం, నవంబర్ 19: రాష్ట్ర కమిటీ పిలుపుపై విశాఖ రీజియన్‌ళో మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం, గాజువాక, స్టీల్‌సిటీ, అనకాపల్లి, పాడేరు. నర్సీపట్నం, డిబిఎస్ కాంప్లెక్స్‌లో ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో సిసిఎస్, ఎస్‌ఆర్‌బిఎస్, ఎస్‌బిటి రుణాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ ధర్నాలు నిర్వహించానర, అనంతరం సాయంత్రం మద్దిలపాలెం రామ్మోహన్ భవన్‌నందు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి రీజనల్ అధ్యక్షుడు వి.అప్పారావు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎంప్లారుూస్ యూనియన్ ష్యూరిటి లేకపోయినా ఫోన్ చేస్తే చాలని రుణాలు ఇప్పిస్తామని హామీనిచ్చి, ఈ రోజు కార్మికులు దాచుకున్న సొసైటీ సొమ్ములో కొంత రుణం ఇవ్వడానికి కూడా సిసిఎస్, ఎస్‌ఆర్‌బిఎస్, ఎస్‌బిటి బోర్డు నెలల తరబడి తాత్సారం చేస్తున్నాయన్నరు. గత ఎన్‌ఎంయు హాయాంలో వారం రోజుల్లో కార్మికులకు రుణాలు ఇప్పించిన ఘనత ఉందన్నారు. వెంటనే కార్మికులకు రుణాలు ఇవ్వని పక్షంలో భారీస్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అలాగే అక్టోబర్ 29న రీజనల్ మేనేజర్ వద్ద జరిగిన సమావేశంలో ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ కోటా వారిని రెగ్యులర్ చేయడానికి హెడ్ ఆఫీసుకు లేఖ పంపేలా మాట్లాడమని, గ్యారేజీలో ఈ నెల మూడోవారంలో ట్రేడ్ టెస్టులు నిర్వహించి ఖాళీలు పూర్తి చేస్తామని రీజనల్ మేనేజర్ మినిట్స్ ఇచ్చారన్నారు. మహిళలకు షూ అలవెన్సు, పాడేరు కార్మికులకు మంకీ క్యాప్, స్వెట్టర్స్, ఏడిసి, టి1-3 పదోన్నతులు ఇవ్వడానికి ఆర్‌ఎం అంగీకరించారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నందగోపాల్, ఎంవిఆర్ మూర్తి, ఏకె శివాజీలు పాల్గొన్నారు.

వరదనష్టంపై కేంద్ర బృందానికి కలెక్టర్ నివేదిక
* ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించిన కేంద్ర బృందం
విశాఖపట్నం, నవంబర్ 19: వరదనష్టం అంచనా నిమిత్తం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఈసందర్భంగా కేంద్రబృందం సభ్యులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రభుత్వ అతిధిగృహంలో కలుసుకున్నారు. గతనెల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదలకు సంభవించిన నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రబృందం సభ్యులకు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా జిల్లాలో సంభివించిన పంటనష్టంతో పాటు నీటి పారుదలశాఖ, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ విభాలకు జరిగిన నష్టాన్ని వివరించారు. శారదానది వరద కాలువ, ఏలేరు, రైవాడ కాలువలకు గండ్లు పడటం ద్వారా భారీ ఎత్తును నష్టం చోటుచేసుకుందన్నారు. అనంతరం భారీ వర్షాలు, వరదనష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రబృందం సందర్శించింది. వరదనష్టం అంచనావేసేందుకు వచ్చిన కేంద్రబృందంలో కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త సంచాలకులు పిజిఎస్ రావు, భారతప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్యం సహాయ సలహాదారు వికె బత్చ, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదార్ల ప్రతినిధి ఎ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేవీ మేళా సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్
విశాఖపట్నం, నవంబర్ 19: నేవీ మేళా సందర్భంగా విశాఖ వాసులను ఆకట్టుకునే విధంగా తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి 25 వరకూ అయిదు రోజుల పాటు సైలర్స్ ఇనిస్టిట్యూట్‌లో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విశాఖ వాసులకు నౌకాదళంతో సత్సంబంధాలు నెరపడంతో పాటు వారిని ఉత్తేజ పరిచే విధంగా పలు అంశాలను ఈకార్యక్రమం ద్వారా పరిచయం చేయనున్నారు. తూర్పునౌకాదళం పరిధిలోని దైనందిన కార్యకలాపాలతో ఆటు నిర్వహించే పలు అంశాలను ప్రజలకు వివరిస్తారు. మేళా సందర్భంగా ప్రైవేటు వాణిజ్య, వాణిజ్యేతర సంస్థలు సహా స్వచ్చంధ సంస్థలు, ఆర్థిక సంస్థలు, గృహోపరణాల డీలర్లు, ఐటి రంగ సంస్థలు, విద్యాసంస్థలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో వాణిజ్య, వ్యాపార సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు సందర్శకులను ఆహ్లాదపరచే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యకలాపాలను ఏర్పాటు చేస్తారు. అలాగే నగరంలో పేరొందిన హోటళ్లకు ఈ ఎగ్జిబిషన్‌లో స్థానం కల్పించి కమ్మని రుచులను అందిచనున్నారు. మొత్తంగా నేవీ మేళా సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈఎగ్జిబిషన్ మధురమైన అనుభూతులను మిగిల్చే విధంగా రూపుదిద్దుకోనుందనడంలో సందేహం లేదు.

అంతరిస్తున్న ఆలివ్‌రిడ్లేలు
* మూడు రోజుల్లో 20 మృతి
విశాఖపట్నం, నవంబర్ 19: సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, పరిధిని మించి వేటసాగిస్తున్న భారీ మరపడవలు అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కబళిస్తున్నాయి. విశాఖ సముద్ర తీరం నుంచి భీమునిపట్నం తీరం వరకూ ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో ఆలివ్‌రిడ్లే తాబేళ్ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో సుమారు 15 ఆలివ్‌రిడ్లేల మృతదేహాలను గుర్తించారు. తాజాగా మంగళవారం భీమునిపట్నం సమీపంలోని జక్కురాంపేట, ఐఎన్‌ఎస్ కళింగ తదితర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. భీమునిపట్నం పరిసర ప్రాంతాల్లోని ఫార్మా, ఆక్వా కంపెనీల నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న విష వ్యర్థాలతో పాటు తీరం వెంబడి వేట సాగించే భారీ మరపడవల కారణంగా ఇవి మృత్యువాత పడుతున్నట్టు భావిస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల తీరప్రాంతంలోని సముద్ర జలాలు విషతుల్యమవుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన పర్యావరణ శాఖ అధికారులు స్పందించి అరుదైన జీవరాశులు అంతరించిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బకాయిపన్ను చెల్లించకుంటే ఉత్సవాలను అడ్డుకుంటాం
సర్పంచ్ గులాబి హెచ్చరిక
అరకులోయ, నవంబర్ 19: పర్యాటకాభివృద్ధి సంస్థ బకాయి పడిన పన్ను వెంటనే చెల్లించకపోతే అరకు ఉత్సవ్‌ను అడ్డుకుంటామని పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ సమర్డి గులాబి హెచ్చరించారు. అరకులోయలోని పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పంచాయతీకి చెల్లించవలసిన 45 లక్షల 52వేల 475 రూపాయల పన్నును పర్యాటక శాఖ తక్షణమే చెల్లించకపోయినట్టయితే ఈ నెల 28వ తేదీ నుండి నిర్వహించ తలపెట్టిన అరకు ఉత్సవాలను జరగనివ్వబోమని ఆమె పేర్కొన్నారు. 1999వ సంవత్సరం నుండి పంచాయతీ పన్ను కింద లక్షలాది రూపాయలు చెల్లించవలసి ఉన్నప్పటికీ ఇంతవరకూ చెల్లించకపోవడం దారుణమన్నారు. బకాయి పన్నును వెంటనే చెల్లించాలని పలు పర్యాయాలు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులకు లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ వారి నుండి స్పందన కరువైందన్నారు. పద్నాలుగా సంవత్సరాలు పన్ను చెల్లించకపోవడం వలన పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు కుంటుపడిపోయినట్టు ఆమె చెప్పారు. సుమారు 50 లక్షల రూపాయల మేర పన్ను బకాయి ఉన్న ఏమీ ఎరగనట్టు ఉండడంలో అర్థం లేదన్నారు. పంచాయతీకి పన్నుల రూపేణా లక్షలాది రూపాయలు రావాల్సి ఉందని, దీంతో మొండి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు. అరకు ఉత్సవ్ నిర్వహణపై పద్మాపురం గార్డెన్‌లో అధికారులు సమావేశం నిర్వహించి తనను ఆహ్వానించకపోవడం తగదన్నారు. సాధారణంగా అధికారులు ఏ కార్యక్రమాలు నిర్వహించినా సంబంధిత సర్పంచ్‌లతో కార్యక్రమాలపై ముందే మాట్లాడే సంప్రదాయం ఉందని, ఇక్కడ అది జరగలేదని ఆమె వివరించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక సర్పంచ్ సమావేశాలకు అధ్యక్షత వహించాలి కానీ సమావేశానికి ఆహ్వానించకపోవడం వలన అలా జరగలేదని ఆమె చెప్పారు. అరకు ఉత్సవ్ నిర్వహణ సమావేశంపై తనకు సమాచారం లేదని, తన పంచాయతీ పరిధిలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం అవమానంగా తాము భావిస్తున్నట్టు సర్పంచ్ గులాబి ఆవేదన వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో ఎం.పి.డి.ఒ. కె.గౌరీశంకరరావు, పంచాయతీ ఇ.ఒ. లవరాజు, మాజీ సర్పంచ్ సమర్డి రఘునాధ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల కోసమే రచ్చబండ
మాడుగుల, నవంబర్ 19: రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ రచ్చబండ కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకువచ్చిందని తెలుగుదేశం పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు, మాడుగుల శాసన సభ్యుడు గవిరెడ్డి రామానాయుడు విమర్శించారు. మంగళవారం మాడుగులలో జరిగిన మండల స్థాయి బండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పూర్తిగా పోయిందన్నారు. 2011 డిసెంబర్‌లో జరిగిన రచ్చబండలో పలు సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని ప్రజలు ధరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రచ్చబండ అంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే రచ్చబండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కాదని ఆయన అన్నారు. గత రచ్చబండలో లబ్థిదారుల నుంచి ప్రజల నుండి తీసుకున్న ధరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఎందుకు పొందుకు పరచలేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో జలశయాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, దీంతో పంట పోలాలకు సక్రమంగా నీరు అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. అలాగే పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అన్న విషయంపై అధికారులు దృష్టిసారించకపోవడంతో ప్రభుత్వ పథకాలు పక్కదారి పడుతున్నాయన్నారు. మండలంలోని గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రపంచ మరుగుదొడ్లు దినోత్సవాన్ని పురస్కరించుకుని గోడ పత్రికలను విడుదల చేశారు. మంజూరు అయిన పథకాలు పంపిణీ చేసేందుకు 21 కౌంటర్లను ఏర్పాటు చేశారు. బంగారుతల్లి పథకానికి 98, ఫింఛన్లకు 1091, రేషన్ కార్డులకు 1393, ఇందిరమ్మ ఇళ్ళు 1164 మంజూరవ్వగా, వీటిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రత్యేక అధికారి జయప్రద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ. శశీదేవి, తహశీల్థార్ రామనాయుడు, పంచాయతీ అధికారిణి కళ్యాణి, హౌసింగ్ ఎ.ఇ. కృష్ణ, వ్యవసాధికారి ఎస్.రమేష్, సర్పంచ్ దంగేటి వెంకటలక్ష్మి, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం.. అభివృద్ధికి ఆటంకం
* గిరిజన మంత్రి బాలరాజు

కొయ్యూరు, నవంబర్ 19: ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచకపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు విమర్శించారు. మండలంలోని నడింపాలెం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన స్వర్గీయ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఎంతో రాజకీయ ఘన చరిత్ర కలిగిన ఈప్రాంతం ఎందరో పోరాట యోధులకు నిలయమైన ఈప్రాంతం ఇంత వెనుకబడి ఉండటానికి గత పాలకుల నిర్లక్ష్యమేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిరంతరం పాటుపడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనన్నారు. పేద, బడుగు వర్గాలు పూజించే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఈకార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరిజనుల శ్రేయస్సుకై 86లో ప్రవేశపెట్టిన ఉప ప్రణాళికను సోనియాగాంధీ చొరవతో సి. ఎం. కిరణ్‌కుమర్‌రెడ్డి , తాను మరికొందరు మంత్రుల కృషి ఫలితంగా నేడు అమలుకు నోచుకుందన్నారు. ఈ ప్రాంతంలో రెండేసి పర్యాయాలు ఎమ్మెల్యే, ఎం.పి.లుగా పని చేసిన వారు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేసారని ప్రశ్నించారు. దండుకున్న బియ్యంతో రోడ్లపై వండుకుతింటే అభివృద్ధి జరగదని సమస్యను ప్రభుత్వానికి చెప్పుకుంటేనే పరిష్కారమవుతుందన్నారు. మండలంలోని వివిధ శాఖల అధ్వర్యంలో మంజూరైన సుమారు 69 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే 420 రేషన్ కార్డులు, 370 వివిధ పెన్షన్లు, 260 పట్టాదారు పాసుపుస్తకాలు, 212 మంది బాలారం అగ్ని బాధిత కుటుంబాలకు ఎల్.పి.సి.లతో పాటు 23 బంగారుతల్లి పధక ధృవపత్రాలను మంత్రి అందజేసారు. ఈకార్యక్రమంలో పాడేరు ఐ.టి.డి. ఎ.పి. ఓ. వినయ్‌చంద్ , ఆర్డీవో గణపతిరావు, ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రావు, డి.డి.మల్లిఖార్జునరెడ్డిలతో పాటు పలు ఇంజనీరింగ్ శాఖల ఇ. ఇ.లు. డి. ఇ.లు, స్థానిక ఎం.పి.డి. ఓ. , తహశీల్దార్, పలు మండల శాఖల అధికారులు పాల్గొన్నారు.

* మంత్రి గంటా స్పష్టీకరణ
english title: 
ganta

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>