భోగాపురం, నవంబర్ 19 : మండలంలోని రావడ గ్రామాన్ని మంగళవారం కేంద్ర బృందం పరిశీలించారు. ఇందులో భాగంగా గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిన కృష్ణసాగర్ వంతెనను పరిశీలించి అదే ప్రాంతంలో గ్రామస్తుల వద్ద నుండి గతంలో కురిసిన భారీ వర్షాలకు ఏర్పడిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి నూతన గృహాల నిర్మాణానికిగాను లక్షా ఐదువేల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి రావాడ గ్రామంలో భారీ వర్షాలకు ఏర్పడ్డ పంట నష్టాన్ని, ఇళ్లు కోల్పోయిన వారి వివరాలను కేంద్ర బృంద సభ్యులైన డాక్టర్ గౌరీశంకరరావు, ఎ.కృష్ణప్రసాద్, వికె బత్కల్‌లకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 23వ తేదీన రావాడ గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఇది వరకు ఇవ్వని వితంతు, వృద్దాప్య, వికలాంగ పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఏవరైనా ఉంటే వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వన్నుట్లు తెలిపారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసి నివేదికను తయారు చేసి నష్టపరిహారం వచ్చే చర్యలు చేపడతామని అన్నారు. భారీ వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, పెసన కంది పంటలకు ఏర్పడిన నష్టాలను కూడా కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జెసి పిఎ శోభ, ఎంపిడిఓ సుజాత, తహశీల్దార్ రాజకుమారి, కాంగ్రెస్ నేత ఉప్పాడ సూర్యనారాయణ, టిడిపి నేత సూర్యనారాయణరాజు సర్పంచ్ పైడినాయుడు పాల్గొన్నారు.
‘ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించండి’
విజయనగరం , నవంబర్ 19: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తొమ్మిది డిపోల మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ఇంధన పొదుపు పాటించడంతోపాటు బస్సుల నిర్వహణపట్ల ప్రత్యేకంగా దృష్టిని సారించాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యంలో 60రోజులపాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నందున ఆర్టీసీ ఆదాయానికి పెద్దఎత్తున గండిపడిందన్నారు. అందువల్ల ఆదాయాన్ని మెరుగుపర్చుకోకపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు కొటాన శ్రీనివాసరావు, గండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కారుణ్య ఉద్యోగుల ఎంపిక పూర్తి
ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం ఇక్కడ వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలను అందజేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 42 అభ్యర్ధులకు వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, 40మంది మాత్రమే హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్ధులు వైద్యపరీక్షలకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఎంపిక పారదర్శకంగా చేపట్టామన్నారు.
‘వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి’
విజయనగరం, నవంబర్ 19: గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఏకధాటిగా వారం రోజులపాటు వర్షాలు కురవడం వల్ల చెరువులు, కాలువలు, రోడ్లు దెబ్బతిన్నాయని ఎంపీ ఝాన్సీలక్ష్మి అన్నారు. ఈ వర్షాలకు ఆర్ అండ్ బి రోడ్ల కంటే పంచాయతీ రోడ్లు ఇంకా ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు. భారీ వర్షాలకు పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలకు భారీగా నష్టం వాటిల్లిందని దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 165 మిమీ కాగా, భారీ వర్షాలకు సాధారణ వర్షపాతం కంటే 125 మిమీ అధికంగా కురిసిందన్నారు. ఒక్క రోజున 30 సెంమీ వర్షం కురిసిందని ఆమె వివరించారు. మత్స్యకారులు వారి జీవనోపాధిని కోల్పోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ప్రకటించిందని అందులో రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జెసి పిఎ శోభ, ఎజెసి యుసిజి నాగేశ్వరరావు, ఆర్డీవో వెంకటరావు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ ఎస్‌ఇలు కాంతిమతి, శ్రీనివాస్, మత్స్యశాఖ ఎడి ఫణిప్రకాష్, తహశీల్దార్, ఎంపిడిఒలు పాల్గొన్నారు.
వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
విజయనగరం, నవంబర్ 19: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను త్రిసభ్య కమిటీతో కూడిన కేంద్ర బృందం మంగళవారం పరిశీలించింది. కేంద్ర వ్యవసాయ రీజనల్ డైరెక్టర్ ఎ.కృష్ణప్రసాద్, ఆర్థిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ పి.గౌరీశంకర్, తాగునీరు, క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ వి.కె.్భట్ల సభ్యులుగా ఉన్న ఈ బృందం ముందుగా జిల్లాలోని బోగాపురం మండలం రావాడ గ్రామంలో దెబ్బతిన్న ఆర్ అండ్ బి రోడ్డును, పెద్ద చెరువుకు గండిపడటాన్ని పరిశీలించారు. అనంతరం చీపురుపల్లిలోని కర్లాం, ములగాం ప్రాంతాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఏకధాటిగా భారీ వర్షాలు కురవడం వల్ల రోడ్లు, చెరువులు, కల్వర్టులు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో 9113 చెరువులకుగాను 848 చిన్న, మధ్యతరహా చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశామన్నారు. శాశ్వత ప్రాతిపదికన రూ.31.36 కోట్లు అంచనా వేశామన్నారు. ఈ చెరువుల కింద 73,557 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని వివరించారు. కాగా, బోగాపురం మండలంలో ఒకే రోజున 30 సెంమీ వర్షం కురవడంతో చెరువులకు గండ్లుపడ్డాయని వివరించారు. ఆ చెరువులో మత్స్యకారులు చేప పిల్లల పెంపకం చేపట్టగా అవన్ని నీటిలో కొట్టుకుపోయాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 186 కిలోమీటర్ల మేర రహదారులు కోతకు గురయ్యాయన్నారు. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని, 38 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయన్నారు. 16 కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. చెరువుల సామర్ధ్యం తక్కువగా ఉన్నందున వర్షాలు ఎక్కువ కావడంతో చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలో పైలాన్ తుపాను వెనువెంటనే ఏకధాటిగా భారీ వర్షాలు కురవడం వల్ల మత్స్యకారులు, రైతులు ఎక్కువగా నష్టపోయారని చెప్పారు. రోడ్లు కోతకు గురయ్యాయని, కల్వర్టులు దెబ్బతిన్నాయని, చెరువులకు గండ్లు పడ్డాయని తెలిపారు. ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలన్నారు. ఈ సందర్భంగా భోగాపురంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సాయం అందించిందా అని బృందం సభ్యులు జిల్లా కలెక్టర్‌ను అడగ్గా ఎలాంటి సాయం అందలేదని బదులిచ్చారు. ఈ బృందం వెంట ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రచ్చబండ ఏర్పాట్లపై జెసి పరిశీలన
విజయనగరం , నవంబర్ 19: పట్టణంలో బుధవారం జరుగనున్న రచ్చబండ కార్యక్రమంలో ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి, జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ ఆదేశించారు. స్థానిక రాజీవ్ స్పోర్స్ కాంప్లెక్స్‌లో జరుగనున్న రచ్చబండ ఏర్పాట్లను మంగళవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ రచ్చబండకు 15వేలకు పైబడి ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ఆదేశించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటుచేయాలని, ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రచ్చబండ అధికారిక కమిటీ సభ్యుడు పిళ్లా విజయకుమార్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి పి.లక్ష్మణరావు, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ హెచ్.శంకరరావుతదితరులు పాల్గొన్నారు.