హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, నవంబర్ 20: ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం, సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేస్తూ వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలన్న గొప్ప సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ హైదరాబాద్ జిల్లాలో ఉత్తుత్తి కార్యక్రమంగా తయారైంది. ఈ నెల 11 నుంచి నగరంలో మూడో విడత రచ్చబండ నిర్వహణకు నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెవెన్యూ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో పాటు ఒక్కో నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక్కో పర్యవేక్షణాధికారిని నియమించినా, ఏర్పాట్లకు తగిన విధంగా కార్యక్రమం జరగటం లేదని ప్రజలు వాదిస్తున్నారు. పలుచోట్ల గల్లీ లీడర్లు, మరికొన్నిచోట్ల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నా, నగరానికి చెందిన మంత్రులు హాజరుకాకపోవటం విమర్శలకు తావిస్తోంది. కార్యక్రమం ప్రారంభంలో ఓ దఫా రచ్చబండకు నగరానికి చెందిన మంత్రి దానం నాగేందర్ తన సొంత నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
మంత్రి నాగేందర్ హాజరుకావల్సి ఉన్నా, ఆయన రాలేదని అధికారులు తెలపటంతో ప్రజలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కేవలం తహశీల్దార్లు, పర్యవేక్షణాధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 11 నుంచి ప్రారంభమైన ఈ రచ్చబండకు ఇప్పటివరకు నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్‌లు పాల్గొన్న దాఖలాల్లేవు. కానీ గురువారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న రచ్చబండకు మంత్రి ముఖేష్‌గౌడ్ హాజరుకానున్నట్లు జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. ఆయన కూడా కార్యక్రమానికి హాజరవుతారా? లేక నాగేందర్ బాట పట్టి కార్పొరేటర్లను పంపి గైర్హాజరవుతారా? వేచి చూడాలి. ప్రభుత్వంలో స్తబ్దత, రాష్ట్రంలో ఎన్నో రకాల రాజకీయాలు చోటుచేసుకున్న ప్రస్తుత తరుణంలో ప్రజల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో నగరానికి చెందిన మంత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని, తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన పేద ప్రజల్లో మంత్రుల గైర్హాజరు చర్చనీయాంశంగా మారింది.
అంతేగాక, రాష్ట్రాన్ని ప్రభావితం చేసే వివిధ కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లకు నిన్నమొన్నటి వరకు సిటీ మంత్రులుగా పేరుపడిన సంగతి తెల్సిందే!
ఈ క్రమంలో తాజాగా నాగేందర్ సొంత నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో రచ్చబండ జరిగినా, ఆయన హాజరుకాలేదంటే ఆయన కనీసం నియోజకవర్గానికి కూడా ప్రజలతో మంత్రి అన్పించుకోలేక పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెతకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఈ మంత్రులు. ‘రచ్చ’బండతో రచ్చ గెలిచి, ఇంట ఓడిపోయారు పాపం మన సిటీ మంత్రులు.
* తూతూమంత్రంగా సిటీలో రచ్చబండ!
english title:
r
Date:
Thursday, November 21, 2013