అంబర్‌పేట, నవంబర్ 20: భావితరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు స్వీయ పర్యవేక్షణలో నాణ్యత పాటించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం బాగ్ అంబర్‌పేట డివిజన్ పరిధిలోని భరత్‌నగర్‌లో రూ. 6లక్షల వ్యయంతో చేపట్టిన సీవరేజ్ పైపులైన్ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌లో కనీస వసతుల కల్పనలో ముందున్నామన్నారు. డివిజన్ పరిధిలో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే సత్వరమే పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి జ్ఞానేశ్వర్‌గౌడ్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు ఆచ్చిని రమేశ్, సీనియర్ నాయకులు సి కృష్ణాగౌడ్, జె యాదగిరి, ఇ అజయ్‌కుమార్, కెంచెం చంద్రశేఖర్, కె శేఖర్‌గౌడ్, నాగరాజు చారి, పోచయ్య, ముత్యాలు, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌస్, అనిల్‌కుమార్, సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమంకోసం ‘రచ్చబండ’
చాంద్రాయణగుట్ట, నవంబర్ 20: పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా పేద ప్రజలకు అందేవిధంగా వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం సూపర్‌వైజరీ అధికారి ఖాజా నాజీమ్ అలీ అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బండ్లగూడ మండలంలోని హఫీజ్ బాబానగర్, హబీబ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను, రేషన్ కార్డులను పంపిణీచేశారు. అధికారి ఖాజా నాజీమ్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు అందజేసి సమస్యలు పరిష్కరిస్తునాన మన్నారు.
ఈ సందర్భంగా 80 పెన్షన్లు, 168 రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశామన్నారు. కొత్తగా పెన్షన్లకై 97మంది, రేషన్‌కార్డులకొరకు 1972మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, స్థానికులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పంజాగుట్టలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ రాజూ యాదవ్, సికిందరాబాద్ ఆర్‌డివో ఎల్.కిషన్, నియోజకవర్గ సూపర్‌వైజరీ అధికారి ఎ.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రిమెచ్యూర్ జననాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెంచాలి
ఖైరతాబాద్, నవంబర్ 20: నెలలు పూర్తికాకుండా జన్మించిన పిల్లలు అనేక ఆనారోగ్య సమస్యలకు గురిఅయ్యే ప్రమాదం ఉందని, ప్రిమెచ్యూర్ జననాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెంచాలని పిల్లల వైద్యునిపుణుడు సతీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ శిశు వారోత్సవాల్లో భాగంగా బుధవారం పంజాగుట్టలోని లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం అత్యధికంగా ప్రిమెచ్యూర్ జనానాలు కల్గిన దేశాల్లో మనదేశం ముందు వరసలో ఉందని తేలిందన్నారు. వయస్సులో వివాహం చేసుకోకపోవడం, మేనరికం, గర్భస్థ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి వాటివల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇలా నెలలు నిండకుండా జన్మించిన పిల్లలకు సరైన వైద్యచికిత్సలు అందించకపోతే మరణాలు సంభవించడం లేదా వారు జీవించినంత కాలం వివిధ ఆనారోగ్యాలతో బాధపడటం జరుగుతుందని అన్నారు. గర్భం ధరించినప్పటి నుండి వైద్యుల సలహాలు తీసుకుంటూ వైద్యుల సూచనలమేరకే మందులు వాడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శిశువుల కోసం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.