హైదరాబాద్, నవంబర్ 20: మహానగర పాలక సంస్థలోని ఏ విభాగం పనితీరు చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్ని విభాగాలు అవినీతి మయమే. చేతులు తడిపితే గానీ బర్త్,డెత్ సర్ట్ఫికెట్లు మొదలుకుని వివిధ పనులకు సంబంధించిన కోట్లాది రూపాయల బిల్లులకు సంబంధించి ఫైళ్లు అంగుళం కూడా ముందుకు కదలటం లేదు. ఇప్పటి వరకు మహానగర పాలక సంస్థలోని వివిధ సర్కిల్ కార్యాలయాలు, హెడ్డ్ఫాసుల్లో కూడా అటెండర్ మొదలుకుని అదనపుసిటీప్లానర్లు, ఇంజనీర్లు ఏటా దాదాపు అరడజను మంది లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నా, వారి పనితీరులో ఏ మాత్రం మార్పు రావటం లేదు. ఇక్కడ జరుగుతున్న అవినీతి, సెటిల్‌మెంట్ల విషయాన్ని ఇదివరకే పసిగట్టిన పలువురు కమిషనర్లు గతంలో అవినీతి నిరోధక శాఖకు లేఖలు రాయటం, ఆ తర్వాత అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల పాత్రపై విచారణకు కోర్టు ఆదేశించటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని విభాగాల్లోని అవినీతి అధికారులపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఎప్పటికపుడు అవినీతికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కటం, ఆ తర్వాత దర్జాగా మళ్లీ విధుల్లోకి చేరేందుకు మున్సిపల్ చట్టంలోని లొసుగులు, ఎసిబికి చిక్కే అధికారులపై తీసుకోవల్సిన చర్యలకు సంబంధించి కొద్ది సంవత్సరాల క్రితం సర్కారు జారీ చేసిన ఆదేశాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓ సర్కిల్‌కు భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే బాధ్యతాయుతమైన అసిస్టెంటు సిటీ ప్లానర్ హోదాలో ఉన్న ఓ మహిళాధికారి మాదాపూర్‌కు తనకు చెందిన ఖాళీ స్థలంలో అనుమతి తీసుకోకుండా అడ్డదారిలో భవన నిర్మాణ పనులు చేపడుతూ ఎసిబి అధికారులకు చిక్కిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత ఆబిడ్స్‌లో కూడా అసిస్టెంటు సిటీ ప్లానర్ ఏసిబికి చిక్కి, వారం రోజుల పాటు విధులకు దూరంగా ఆ తర్వాత ఈ ఇద్దరు అధికారులు అంతా మామూలే అన్నట్టు మళ్లీ యధావిధిగా విధులకు హజరుకావటం గమనార్హం. నిన్నమొన్నటి వరకు తమతో కలిసి ఒకే విభాగంలో కలిసిమెలిసి విధులు నిర్వర్తించిన ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం కేటాయించటంలోనూ సాటి ఉద్యోగులు అవినీతి పాల్పడుతున్నారంటే బల్దియాలో లంచాలు ఏ తరహాలో రాజ్యమేలుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. ఇక టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి వేరే చెప్పనక్కర్లేదు. భవన నిర్మాణ అనుమతి కోసం, లే అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం అన్ని రకాల డాక్యుమెంట్లు సమర్పించి, దరఖాస్తును పరిశీలించి, పరిష్కరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు ఆమోదయోగ్యంగా ఉన్నా, సిబ్బంది చేతులు తడపకపోతే నెలల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిందే. అనుమతి తీసుకునేటపుడు చేతులు తడుపుతున్న ఇంటి యజమానులు, ఇళ్లు నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు జారీ చేసే ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం కూడా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మాణం పూర్తికాగానే అధికారులు తామంతట తాము తనిఖీలు నిర్వహించి, అనుమతి ప్రకారం నిర్మాణం జరిగిందా లేదో అన్న విషయాన్ని నిర్థారించుకున్న తర్వాత ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేయాలి. కానీ ఎలాంటి డీవియేషన్లు లేకుండా నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయి నెలలు గడిచినా, కనీసం తనిఖీలు చేపట్టేందుకు కూడా అధికారులు రాకపోవటంతో వారికి అడిగినంత లంచాలు చెల్లించి, యజమానులు వెంట తీసుకెళ్లి మరీ తనిఖీలు చేయించుకుని ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు తీసుకుంటున్న సంఘటనలు అనేకమున్నాయ. ఈ క్రమంలో ఒక్కో విభాగంలో జరిగే అవినీతికి విభాగాధిపతిని బాధ్యులను చేస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం లేదన్న వాదన విన్పిస్తోంది.
రాష్ట్రంలోని మైనింగ్‌లలో వడ్డెర్లకు 20శాతం రిజర్వేషన్లు
ముషీరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలోని మైనింగ్ పనులలో వడ్డెర సామాజికవర్గానికి 20శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రాష్డ్ర వడ్డెర సంఘం డిమాండ్ పట్ల సిఎం స్పందిస్తు సదరు రిజర్వేషన్ల ఉత్తర్వుల పత్రాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల వెంకటేశ్‌కు అందజేశారు. కాంట్రాక్ట్ పనులలో ఇఎండి రూ.50 లక్షల వరకు లేకుండా ఇవ్వడానికి, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన వడ్డెర్లకు ఎస్టీ జాబితా బిల్లు అతి త్వరలో పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారని వెంకటేశ్ పేర్కొన్నారు. బుధవారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెంకటేశ్ మాట్లాడుతూ అత్తాపూర్‌లో 650 చదరపు గజాల స్థలంలో నిరుపేద వడ్డెర విద్యార్థులకు వసతిగృహం ఏర్పాటు, మైనింగ్‌లలో రిజర్వేషన్ కల్పన తమ పోరాట ఫలితంగా నెరవేరిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు దమాషా పద్దతిలో వడ్డెరులకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రూపని లోకనాథం, ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు.