హైదరాబాద్, బేగంపేట, నవంబర్ 20: నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది వాహనాల రాకపోకలతో కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతంలో ఉన్నట్టుండి ఓ ఆర్టీసి బస్సు బ్రేక్‌లు ఫెయిలైన సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు రోడ్డుపై పార్కింగ్ చేసిన ఓ బైక్ బస్సు చక్రానికి అడ్డుపడటంతో బస్సు ఆగడంతో, పెను ప్రమాదం తృటిలో తప్పిందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ డిపోకు చెంది ఉప్పల్, మెడ్చల్‌ల మధ్య రాకపోకలు సాగిస్తున్న రూట్ నెం.18/229 ఆర్టీసి బస్సు మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ రెతీఫైల్ బస్‌స్టేషన్ వద్ద ఉన్న వినాయకుడి దేవాలయం ముందుకు వచ్చి, అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదులుతున్న సమయంలో ఉన్నట్టుండి బ్రేక్ ఫెయిలైంది. బస్సుమెల్లిగా కదులుతున్నా, బస్సు ముందున్న వందలాది మంది ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కేకలు వేస్తూ పరుగులు తీశారు. రోడ్డుపై పార్కింగ్ చేసి ఉంచిన ఓ బైక్ బస్సుచక్రం కిందకు రావటంతో బస్సు ఆగిపోయింది. అప్పటికే బస్సు ఢీ కొట్టిన ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. రంగంలోకి దిగిన గోపాలపురం పోలీసులు క్షతగాత్రులు రామంతాపూర్‌కు చెందిన వేణు, బీబీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌లతో పాటు పాదచారులు యాదగిరి, శివశ్రీ, వెంకటేష్, ఆండాలు, సూర్యకళ, నాగభూషణరావులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బస్‌డ్రైవర్ మాజీద్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ ఫెయిల్ అయినందునే ఈ ఘటన జరిగిందని డ్రైవర్ పోలీసు విచారణలో వెల్లడించాడు.కేసును ఎస్‌ఐ కోటయ్య దర్యాప్తు చేస్తున్నారు.
ఎనిమిది మందికి గాయాలు
english title:
a
Date:
Thursday, November 21, 2013