కొంచెం ఇష్టం-కొంచెం కష్టం
(ఆంధ్రభూమి
దిన పత్రిక కాలమ్)
-పొత్తూరి విజయలక్ష్మి,
వెల: రూ.120/-
శ్రీ రిషిక పబ్లికేషన్స్, 201,
వికాసిని అపార్ట్‌మెంట్స్,
న్యూ నల్లకుంట,
హైదరాబాద్-44
హాస్యం రాయడం అనుకున్నంత తేలిక కాదు. అందునా ‘కాలమ్’గా నడపడడం మరీ కష్టం. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్ర కథా రచయిత్రిగా ఏనాడో గుర్తింపు పొందిన పొత్తూరి విజయలక్ష్మిగారు హాస్య కథా రచయిత్రిగా తదాదిగా మంచి గుర్తింపు పొంది, మంచి కథలనెన్నో వెలువరించారు. ఆంధ్రభూమి దినపత్రిక మహిళల పేజీలో మంచి కాలమిస్టుగా రాయడానికి ఎవరున్నారని ఎం.వి.ఆర్.శాస్ర్తీగారు ఓసారి మాటల సందర్భంలో అడిగినప్పుడు పొత్తూరి విజయలక్ష్మిగారి పేరు సూచించి ఆవిడతో ఆ విషయం చెప్పినప్పుడు, ఎడిటర్‌గారిని ఆవిడ కలవడం, అలా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ కాలమ్ ‘్భమిక’లో ఏడాదికి పైగా వెలువడి పాఠకులను అలరించడం జరిగింది. నవలలు, కథలు రాశారు గానీ పొత్తూరి విజయలక్ష్మిగారు ‘కాలమ్’ రాయడం ఇదే మొదలు. కొంచెం కష్టం అనుకుంటూనే ఆవిడ ఇష్టంగా రాయడంతో పాఠకులు కూడా దీనిని ఇష్టపడ్డారు. స్ర్తిల పేజీలో కాలమ్ అంటే చీరలు, నగలు, వంటింటి కబుర్లు, ఆరోగ్య చిట్కాలు అన్న అపోహను అధిగమింపచేస్తూ సమకాలీన సమస్యలు మానవ మనస్తత్వాలు ఆఖరుకు రాజకీయాలు కూడా నేర్పుగా తన కాలమ్‌లోనికి ఒడుపుకుని విజయలక్ష్మిగారు కాలమ్ రచనలో తన పేరునే వరించారు. ‘పదం కాని పదం’ అంటూ ఊతపదాల గురించీ, పిల్లల్ని ఎవరింటికైనా తీసుకెళ్లడం గానీ, ఎవరైనా పిల్లలు ఇంటికొస్తే ఈ పిల్లలు వారితో ప్రవర్తించడం కానీ ఈరోజుల్లో ఎలా వుంటోందో వివరించే ‘అమ్మయ్య గండం గడిచింది’, అలాగే ఉచితానుచితాలు గురించీ, ఇస్ర్తిపెట్టె గురించీ, బఫే భోజనాల గురించీ, రహదారి ప్రయాణంలో వాహనదారు ‘సర్ట్ఫికెట్టు’ గురించీ, కాల్‌సెంటర్ల గురించీ, దైవాధీనం బతుకుల గురించీ, బహుమతుల కష్టాల గురించీ ఇలా ఒకటేంటి? అత్యల్పమనుకునే తేలికపాటి అంశాల గురించి కూడా చక్కని హాస్యాన్ని పండిస్తూ విశే్లషించిన వ్యాసరచనలివి. పొత్తూరి విజయలక్ష్మిగారి శైలి హాయిగా కబుర్లాడుతున్నట్లు సరదాగా, సాఫీగా సాగిపోతుంది. అందువల్ల ఇవన్నీ చకచక చదివిస్తాయి.
అనేక సరదా అంశాల సమాహారం రచయిత్రి లోకజ్ఞతకు, వ్యవహార దక్షతకు దాఖలాగా అక్షర బద్ధమైన రచనలివి. ఈ కాలమ్‌లో భార్యలు, భర్తలు, కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలూ, మనుమరాళ్లు ఇలా బంధుమిత్ర సపరివార సమేత పాత్రలన్నీ అవసరార్ధం ఆవిడ చెప్పే విషయాల్లో ఆవిడ అనుభవ సంపదలోంచి జాలువారి పలకరిస్తుంటాయి. చక్కని చమక్కులు, వ్యంగ్య చురకలు, సామెతలు గుమ్మరించిన నవ్వుల కదంబం ఇది. ముఖాముఖి పలకరింపులు పోయి ముఖపుస్తక పలకరింపులు వచ్చాయంటూ చదివే అక్షరంమీద ప్రేమను పెంచే ప్రయత్నం చేసారు రచయిత్రి. ఈ పుస్తకానికి సరసి బొమ్మలు ముఖచిత్రంగా అమరడం ఓ విశేషం. ఎందుకంటే ఇప్పట్లో తెలుగు హాస్యంకు కొంచెం పెద్ద దిక్కుగా వున్న కార్టూనిస్టుగా సరసి, రచయిత్రిగా పొత్తూరి విజయలక్ష్మి గారలే ఆనుతున్నారు మరి. ‘చేదుకున్న వారికి చేదుకొన్నంత’గానీ, ఏ మాత్రం ‘చేదు’ లేని నిఖార్సయిన తీపి హాస్యం ఈ సంపుటి. చేతపట్టుకున్నాక కొంచెం.. కొంచెం.. అంటూనే ఎంతో ఇష్టపడగల పుస్తకాన్ని స ‘కాలమ్’గా వెలువరించిన రచయిత్రి కష్టానికి పుస్తకం కొని చదివి కొనియాడడమే చేయదగిన పని.