కాంతి ధార (కవిత్వం)
కవి: అమ్మంగి కృష్ణారావు
ప్రచురణ:
జయమిత్ర సాహిత్య
సాంస్కృతిక వేదిక,
హైదరాబాద్
వెల: రూ.40/-
ప్రతులకు:
అమ్మంగి కృష్ణారావు, 1-7-647/31/1,
జెమినీ కాలనీ, రాంనగర్,
హైదరాబాద్-20
వ్యక్తిత్వం మంచిదైతే కవిత్వం గొప్పది కాదు. ముందు కవిత్వం చదివించగలగాలి. ఆ తరువాతే ‘కవి’ వ్యక్తిత్వం. వ్యక్తికీ కవికీ మధ్య అతని సృజన ఉంటుంది. అదే అతడిని నిలుపుతుంది. అలాంటి కవిత్వమే కాంతి ధార. దాని కవే అమ్మంగి కృష్ణారావు. ఉద్యోగిగా ఉంటూ సాహిత్యాభిమానం నింపుకున్న ఈ కవి చాలా తక్కువ కవిత్వం రాశాడు. ఈ కవితలన్నీ సరళంగా ఉంటాయి. కవిత్వం అంటే అర్ధం కాని భావ చిత్రాలు, కొరకరాని కొయ్యలు అనే భ్రమని తొలగించాడు. అదే విషయం నాళేశ్వరం శంకరం ‘జీవధార!’ పేర ముందు మాటలో తెలిపాడు. నందిని సిద్ధారెడ్డి ‘బతుకు సరిగమలు’ సాదా మాట. ఈ కవిత్వంపై అది నెనరులేని అభివ్యక్తి.
ఈ సంకలనంలోని 32 కవితలు భావస్ఫోరకంగా ఉన్నాయి. అతడు సామాన్య జనాన్ని తన పాఠకులుగా ఎంచుకున్నాడు. అందుకే నైతిక భావన, ఉద్బోధ, మంచి విషయాలు చెప్పాలనే తపనలోంచి కవిత్వాన్ని రాశాడు. తన కవిత్వం మంచి సామాజిక నిర్మాణానికి ఉపయోగపడాలని ఆశించాడు. ఇందులో ఆశావహ దృక్పథం ఆవరించుకుని ఉంది. కవి తాను ముందుగా మనిషిననే భావన కలిగి ఉన్నాడు. కేవలం అద్భుత ఊహా చిత్రాలతో అదర గొట్టాలని ఆశించలేదు. అందుకు కొరుకుడు పడని భాషని ఎక్కడా వాడలేదు. తన జీవిత కాలంలో చాలా తక్కువ రచనలు చేసినా వాటికి ఒక ప్రయోజనం ఉండాలని భావించాడు. తన అనుభవంలోంచి కవితా వస్తువుని ఎన్నుకున్నాడు. అందుకు కవి అభినందనీయుడు.