* ప్రపంచ మేటి స్విమ్మర్లు అనగానే మైఖేల్ ఫెల్ప్స్ గుర్తుకొస్తాడు. ఇయాన్ థోర్ప్, మార్క్ స్పిన్జ్, ర్యాన్ లొస్చెట్, మకొటో ఇటో తదితరులు అత్యుత్తమ స్విమ్మర్ల జాబితాలో చేరతారు. బల్గేరియాకు చెందిన జేన్ ఫెట్కోవ్‌ను గొప్ప స్విమ్మర్‌గా పేర్కోలేకపోయినా, వింత స్విమ్మర్ అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మెసెడోనియాలోని ఆర్హిడ్ సరస్సులో అతను ఈదిన తీరు ఎవరినైనా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఫెట్కోవ్ ఒక పొడవాటి సంచీలోకి దూరిపోయిన తర్వాత, దానిని కాళ్లు, చేతులు, ఉదర భాగాల్లో టేప్‌తో చుట్టారు. ఫలితంగా ఈత కొట్టడానికి ఎలాంటి అవకాశం ఉండదు. అదే స్థితిలో అతనిని సరస్సు నడి మధ్యన విసిరినప్పటికీ, ఈదుకుంటూ ఒడ్డు చేరాడు. ఈ ఫీట్‌ను మొదలు పెట్టే ముందు ఫెట్కోవ్‌కు పరీక్షలు జరిపిన వైద్యులు అతను రక్త హీనతతో బాధపడుతున్నట్టు ప్రకటించారు. కానీ అతను ఎలాంటి సమస్య లేకుండా ఫీట్‌ను పూర్తిచేశాడు.
పట్టు తప్పితే అంతే..
* జిమ్నాస్టిక్స్‌లో బ్యాలెన్స్ బీమ్‌ను పోలిన ఆట మాల్టాలో సంప్రదాయ క్రీడగా మన్ననలు అందుకుంటున్నది. ‘గోస్ట్రా’ పేరుతో జరిగే ఈ క్రీడలో పోటీదారులు ఒక పొడవాటి దూలం మీద నడవాలి. మాల్టా సముద్ర తీరంలోని పలు గ్రామాలు, పట్టణాల్లో గోస్ట్రా పోటీలు ఏడాది పొడవునా జరుగుతునే ఉంటాయి. సుమారు 10 మీటర్ల పొడవాటి చెక్క దూలానికి గ్రీజును దట్టంగా పట్టిస్తారు. దూలంపై నడవమే కష్టమైతే, గ్రీజు పూసిన తర్వాత పట్టు దొరికే ప్రసక్తే ఉండదు. జారుతున్న దూలం మీద నడుస్తూ ఏమాత్రం పట్టుతప్పినా ప్రమాదం తప్పదు. అందుకే, ముందు జాగ్రత్తగా దూలాన్ని నీటి పైభాగాన ఉంచుతారు. ఇప్పుడు మాల్టా పేరు వినగానే అందరికీ గోస్ట్రానే ముందుగా గుర్తుకొచ్చేంత ప్రాచుర్యం పొందింది ఈ సంప్రదాయ క్రీడ.
20 శతకాల మైలురాయి..
* టెస్టు క్రికెట్‌లో మొదటి 20 సెంచరీలను పూర్తి చేయడానికి అతి తక్కువ మ్యాచ్‌లు తీసుకున్న బ్యాట్స్‌మన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్. అతను 35వ టెస్టు ఆడుతూ 20వ సెంచరీ పూర్తి చేశాడు. అతని తర్వాతి స్థానం భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు దక్కుతుంది. గవాస్కర్ 50 టెస్టుల్లో 20 సెంచరీలు చేశాడు. మాథ్యూ హేడెన్ 55 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకుంటే, సర్ గారీ సోబర్స్, సచిన్ తెండూల్కర్ తమతమ 69వ టెస్టులో 20వ సెంచరీ పూర్తి చేశారు. మొత్తం మీద టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకూ 39 మంది ఇరవై లేదా అంతకు మించి శతకాలు సాధించారు. దీని కోసం ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌లో ‘వా సోదరులు’ మార్క్, స్టీవ్ ఉన్నారు. మార్క్ వా 116, స్టీవ్ వా 119 మ్యాచ్‌ల్లో 20 సెంచరీల మైలురాయిని చేరారు.