సచిన్ తెండూల్కర్‌కు 'భారత రత్న’ ఇవ్వడం తప్పుకాదు. నేరం అంతకంటే కాదు. కానీ, అవార్డును ప్రకటించిన విధానం మాత్రం తప్పుడు సంకేతాలను పంపుతున్నది. రాజకీయ లబ్ధి కోసమే సచిన్ పేరును ఈ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాకీలో దేశానికి ఎనలేని సేవలు అందించి, అంతర్జాతీయ గుర్తింపు, ప్రముఖుల ప్రశంసలు పొందిన ధ్యాన్ చంద్‌ను, చెస్‌లో ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న విశ్వనాథన్ ఆనంద్‌ను, టెన్నిస్‌లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన లియాంర్ పేస్‌ను, క్రీడల్లో దేశానికి పేరుప్రతిష్టలను ఆర్జించిపెట్టిన ఎంతోమందిని విస్మరించి, హడావుడిగా సచిన్‌కు 'భారత రత్న’ ఇస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి కేంద్రం ఈ చర్య తీసుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. సచిన్ సమర్థుడనడంలో సందేహం లేకపోయనా, అతనికి అతిగా ప్రచారం జరుగుతున్నదని, వేలం వెర్రిగా ప్రభుత్వం కూడా వీరాభిమానిగా మారిపోయ వంత పాడుతున్నదని ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కంటే ముందు ధ్యాన్ చంద్‌కు 'భారత రత్న’ లభించాలని వాదించే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ డిమాండ్‌లో ఔచిత్యం ఉంది. సచిన్‌కు 'భారత రత్న’ ను హడావుడిగా ప్రకటించడంలో మాత్రం ఎలాంటి ఔచిత్యం లేదు. కేవలం ప్రభుత్వ స్వార్థం తప్ప మరే ప్రయోజనం కనిపించడం లేదు.
==========
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఎన్నో రికార్డులు సాధించాడు. దేశానికి చేసిన అత్యుత్తమ సేవలు అందించిన క్రీడాకారుల్లో ఒకడు. ఈ నిజాలను ఎవరూ కాదనలేరు. కానీ, భారత క్రీడా రంగంలో సచిన్‌ను మించిన వారు లేరన్న చందంగా ఏకంగా 'భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయడం మిగతా వారిని అవమానించడమే. నిజానికి నిన్నమొన్నటి వరకూ ‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్ పేరు ప్రముఖంగా వినిపించింది. మొదట్లో 'భారత రత్న’ జాబితాలో క్రీడలు లేవు. 2011 నవంబర్‌లో క్రీడలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఆ వెంటనే 82 మంది పార్లమెంటు సభ్యులు ధ్యాన్ చంద్‌కు 'భారత రత్న’ ఇవ్వడం సముచితమని సంతకాలు చేసి మరీ కేంద్రానికి సమర్పించారు. వీరిలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అదే నెల 64 నామినేషన్లు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరాయి. సచిన్ పేరును సూచిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పంపిన ప్రతిపాదన వాటిలో ఒకటి. 2012లో ధ్యాన్ చంద్‌కు 'భారత రత్న’ను ప్రకటించాలని కేంద్ర మంత్రులు సిఫార్సు చేశారు. ఈఏడాది ఆగస్టులోనూ ఇలాంటి ప్రతిపాదనే పంపారు. కానీ, ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటు సభ్యులకు, మంత్రుల మాటకు విలువలేదని స్పష్టమైంది. ధ్యాన్ చంద్‌ను అవమాన పరిచే రీతిలో సచిన్‌ను 'భారత రత్న’కు ఎంపిక చేసినట్టు హడావుడి ప్రకటన వెలువడింది. 200వ టెస్టుతో సచిన్ తన క్రికెట్ కెరీర్‌ను ముగించిన మరుక్షణమే కేంద్రం ఈ ప్రకటన చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే కారణమన్న వాదన బలంగా వినిపిస్తున్నది. రానున్న ఏన్నికల్లో యుపిఏ సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలంటే ఓటర్లకు గాలం వెయ్యాలి. దేశంలో యువత సంఖ్య ఎక్కువ కాబట్టి, సచిన్ పట్ల వారికి ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ తరం యువతకు హాకీ పట్ల మక్కువ లేదు. ఇక ధ్యాన్ చంద్ గురించి వారికి తెలిసిందీ తక్కువే. అందుకే, సచిన్‌కు ప్రకటించిన 'భారత రత్న’ ఓట్లు కురిపిస్తుందని కేంద్రం ఆలోచనై ఉండవచ్చు. కానీ, ధ్యాన్ చంద్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ వరకు, లియాండర్ పేస్ నుంచి అజిత్ పాల్ సింగ్ వరకూ క్రీడా రంగంలో భారత కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎవరూ క్రీడా ‘రత్నాలు’ కారన్న చందంగా కేంద్రం సచిన్‌కు అవార్డు ప్రకటించడం ఆక్షేపణీయం. క్రీడా రంగం నుంచి ధ్యాన్ చంద్‌కు మొదటి 'భారత రత్న’ అవార్డును ప్రకటించి ఉంటే ఆ తర్వాత సచిన్ ఎంపికపై ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండేవారు కారేమో! ఐదు పర్యాయాలు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విశ్వనాథన్ ఆనంద్ పేరును కూడా ఈ అవార్డుకు పరిశీలించి ఉంటే బాగుండేది. అయితే, ఏ ప్రాతిపదికన సచిన్ పేరును ఖాయం చేశారన్నది ఎవరికీ అర్థంకాని విషయం. ఇందులో రాజకీయ ప్రయోజనాలే తప్ప, నిజంగా క్రీడా రంగానికి గుర్తింపునివ్వాలన్న ఆలోచన లేదన్నది పలువురు వాదన. సచిన్ రిటైర్మెంట్ రోజే హడావుడిగా నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల, ఆ ఒరవడిలో పడి ధ్యాన్ చంద్, ఆనంద్, పేస్ తదితరుల గురించి ఎవరూ ప్రస్తావించరన్నది ప్రభుత్వ యోచనై ఉండవచ్చు. ఈ విషయంలో యుపిఎ సర్కారు పొరపాటు చేసింది. క్రీడాభిమానులను తక్కువ అంచనా వేసింది. సచిన్‌కు 'భారత రత్న’ ఇవ్వడాన్ని అంతా ముక్త కంఠంతో పొగుడుతారని, భవిష్యత్తులో ఇదే ఓట్లను రాబడుతుందని అనాలోచి తంగా అంచనా వేసింది. సచిన్ ఎంపికను సమర్థించేవారు కూడా ధ్యాన్ చంద్‌ను విస్మరించడాన్ని విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఎవరూ డిమాండ్ చేయక ముందే పార్లమెంటు సభ్యులు ధ్యాన్ చంద్‌కు 'భారత రత్న’ ఇవ్వాలని డిమాండ్ చేశారంటే అతనికి ఉన్న పేరుప్రఖ్యాతులు ఏమిటో యుపిఏ సర్కారు అర్థం చేసుకొని ఉండాలి. జర్మనీ నియంత హిట్లర్‌ను సైతం విస్మయానికి గురి చేసిన ధ్యాన్ చంద్‌ను ‘హాకీ మాంత్రికుడు’ అని ఎందుకు పిలుస్తారని ఒక్క నిమిషయం ఆలోచించి ఉంటే అతని స్థాయి ఏమిటో తెలిసేది. వియత్నాంలో ధ్యాన్ చంద్ విగ్రహాన్ని నాలుగు చేతులు, నాలుగు హాకీ బ్యాట్లతో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించివుంటే తొలి 'భారత రత్న’కు అతనే అర్హుడని స్పష్టమయ్యేది. మరోవైపు భారత తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చెస్‌లో సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. అతను కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వాడే. టెన్నిస్‌లో పేస్ భారత్‌కు తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్ నుంచి ఒలింపిక్ పతకం వరకూ ఎన్నో టైటిళ్లను అందించాడు. వీరిలో ఎవరి పేరునూ పరిశీలించకుండా, చర్చించకుండా, అభిప్రాయ సేకరణ జరపకుండా ఏక పక్షంగా సచిన్ పేరును ఖరారు చేయడమే విమర్శలకు తావిస్తోంది. సచిన్‌కు 'భారత రత్న’ ఇవ్వడం తప్పుకాకపోయినా, నిర్ణయం ప్రకటించిన తీరు మాత్రం ఆక్షేపణీయం. అగ్రతాంబూలం ఖచ్చితంగా ధ్యాన్ చంద్‌కే దక్కాలి. ఈ కనీస మర్యాదను కూడా కేంద్రం పాటించకపోవడంతో సచిన్ ఒక్కడే క్రీడా రత్నమా? మిగతా వారంతా ఆ స్థాయి క్రీడాకారులు కారా అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. వీటికి సమాధానం ప్రభుత్వం వద్ద లేదు. హాకీ రంగం మొత్తం ధ్యాన్ చంద్‌ను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. నిజానికి అతని లాంటి ఆటగాడు భారత్‌కు అంతకు ముందుగానీ, ఆతర్వాగానీ లభించలేదు. కేవలం భారత్‌కే అతని సేవలు పరిమితం కాలేదు. ప్రపంచ హాకీ మొత్తం ద్యాన్ చంద్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంది. 1947-48 సీజన్‌లో అప్పటి ఈస్ట్ ఆఫ్రికాలో చివరి అంతర్జాతీయ సిరీస్ ఆడిన ధ్యాన్ చంద్ 22 మ్యాచ్‌ల్లో 61 గోల్స్ సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ ‘లెజెండ్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఒకసారి ధ్యాన్ చంద్ ఆటను స్వయంగా చూశాడు. ‘క్రికెట్‌లో పరుగులు సాధించినంత సునాయాసంగా ధ్యాన్ చంద్ గోల్స్ చేస్తున్నాడు’ అని వ్యాఖ్యానించాడు. బ్రాడ్‌మన్ నుంచి ప్రశంసలు అందుకోవడమే ధ్యాన్ చంద్ అత్యుత్తమ నైపుణ్యానికి నిదర్శనం. ఈస్ట్ ఆఫ్రికా సిరీస్ ముగిసిన వెంటనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ధ్యాన్ చంద్ సాదాసీదా వ్యక్తిగానే జీవించాడు. అహంభావం అంటే ఏమిటో కూడా అతనికి తెలియదు. హాకీలో భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉండాలని తపన పడ్డాడు. అకుంఠిత దీక్షతో, అనన్య సామాన్యమైన ప్రతిభతో లక్ష్యాలను అందుకున్నాడు. ‘నేను సగటు భారతీయుడ్ని’ అని పలు సందర్భాల్లో చెప్పడం అతని వ్యక్తిత్వానికి తార్కాణం. అందుకే, సచిన్‌కు 'భారత రత్న’ అవార్డును ప్రకటించిన మరుక్షణమే ధ్యాన్ చంద్ పేరును ఎందుకు పరిశీలించలేదన్న ప్రశ్న ఉదయిస్తున్నది. క్రీడా రంగం నుంచి ధ్యాన్ చంద్‌కు మొదట 'భారత రత్న’ అవార్డును ఇవ్వాలనడం సచిన్‌ను అవమానించడం కాదు. సచిన్‌ను ఎంపిక చేసి, ధ్యాన్ చంద్‌ను మరచిపోవడం మాత్రం ఖచ్చితంగా అతనిని అవమానించడమే. ఇక పేస్ గురించి ప్రస్తావిస్తే, సచిన్ కంటే అతను కొన్ని వారాలు చిన్నవాడు. సచిన్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన సుమారు ఏడాది తర్వాత పేస్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. డేవిస్ కప్‌లో 86 విజయాలు సాధించి, కేవలం 31 మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్నాడు. 1991-1998 మధ్యకాలంలో ప్రపంచ గ్రూప్ పోటీల్లో భారత్‌ను గౌరవ ప్రదమైన స్థితిలో నిలిపాడు. 1993లో భారత్ ఈ పోటీల్లో సెమీస్ వరకూ చేరిందంటే, దాని వెనుక పేస్ కృషి ఎంతో ఉంది. తన అంతర్జాతీయ ప్రస్థానంలో హెన్రీ లెకొంటే (1993), గొరాన్ ఇవానిసెవిచ్ (1995), వేన్ ఫెరీరా (1994), జిరీ నొవాక్ (1997), జాన్ సిమెరిన్క్ (1995) వంటి మేటి ఆటగాళ్లను ఓడించి సత్తా చాటాడు.
చెస్‌లో ఆనంద్‌ను మించిన భారత ఆటగాడు లేడు. ఐదు పర్యాయాలు విశ్వవిజేతగా నిలిచిన అతను సచిన్ కంటే మూడేళ్లు సీనియర్. అతి చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను సంపాదించిన భారతీయుడిగా అప్పట్లో రికార్డు సృష్టించాడు. టోర్నమెంట్, మ్యాచ్, నాకౌట్, ర్యాపిడ్ విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సంపాదించిన ఏకైక ఆటగాడు అతనే. సచిన్ (1994) కంటే ముందుగానే అర్జున అవార్డును ఆనంద్ (1985), పేస్ (1990) స్వీకరించారు. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డును అందుకున్న తొలి ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఆతర్వాత పేస్‌కు ఈ అవార్డు లభించింది. వీరి తర్వాత సచిన్‌కు ‘ఖేల్ రత్న’ అవార్డు దక్కింది. పద్మ విభూషణ్ అవార్డును పొందిన తొలి క్రీడాకారుడిగా ఆనంద్ రికార్డు నెలకొల్పితే, ఆతర్వాతే సచిన్‌కు ఈ పురస్కారం లభించింది. ఏ రకంగా చూసినా ఆనంద్, పేస్ ఇద్దరూ కూడా 'భారత రత్న’ అవార్డుకు అర్హులే. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు పర్యాయాలు ధ్యాన్ చంద్ పేరును ‘భారత రత్న’కు ప్రతిపాదించింది. ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా సచిన్‌కు ‘భారత రత్న’ ఇవ్వడం తొందరపాటు చర్యే. క్రీడా ప్రముఖులను అవమానించడమే.
సచిన్ తెండూల్కర్‌కు 'భారత రత్న’ ఇవ్వడం తప్పుకాదు
english title:
bharat ratna
Date:
Sunday, November 24, 2013