స్పర్శకు కూడా ఓ భాష వుంది. భావవ్యక్తీకరణకు భాషలేని రోజులలో కూడా భయం ఆందోళన, కోపతాపాలు సంతోషం. బాధ వంటి అనేక భావాలను కేవలం స్పర్శల ద్వారానే వ్యక్తపరచుకోవడం జరిగినదంటే ఆశ్చర్యం కలుగక మానదు.
చేతితో తాకడం, కరచాలనం చేయడం, ఆలింగనం చేసుకోవడం, చుంబించడం- ఇలా ఒక్కో స్పర్శకు ఒక్కో విధమైన అనుభూతి, ఉపయోగం కూడా ఉంటుందన్నది మానసిక విశే్లషకుల నిర్థారణ. స్పర్శ ద్వారా రోగాలను తగ్గించే విధానాన్ని ‘టచ్ థెరపీ’ అంటారు. కొన్ని దేశాలలో ఈ వైద్య విధానం చాలా ప్రాచుర్యంలో వుంది.
కరచాలనం, చుంబనం, కౌగిలింత, వెన్నుతట్టడం, బుగ్గగిల్లడం, చక్కలిగింతలు, నుదుటిపై ముద్దు, జుట్టు సవరించడం.. ఇలా వందకుపైగా స్పర్శానుభూతులు ఉన్నాయంటే ఆశ్చర్యమే మరి.
ఒకరి స్పర్శ మరొకరికి హాయినిస్తుంది. శారీరక స్పర్శవల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. శరీరంలో కొన్ని రసాయనాలు విడుదలై మనసుని, శరీరాన్ని ఎంతో ఉత్తేజపరుస్తాయి. ముఖ్యంగా ఒక మంచి పాజిటివ్ స్పర్శవలన టెన్షన్ తగ్గుతుంది. ధైర్యం కలుగుతుంది. పిరికితనం పోతుంది. నూతనోత్సాహం పొందగలరు. మనసులో గూడుకట్టుకున్న బాధ, ఆదుర్దా తగ్గిపోతాయి. మంచి నిద్ర కూడా పడుతుంది. అంతేగాక అతి ముఖ్యమైన రోగ నిరోధక వ్యవస్థ క్రమబద్ధమవడమే కాకుండా పటిష్టమవుతుంది. దీనివల్ల శారీర దృఢత్వం ఆరోగ్యం తప్పకుండా పెరుగుతాయి.
శరీరాన్ని మర్థన చేయడం వలన ఆస్త్మా, డయాబెటిస్ వంటి వ్యాధులు తగ్గుముఖం పట్టడమే కాకుండా రోగులకు మంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వం తలనొప్పి అనగానే తలను వేరే వారిచేత మృదువుగా ఒత్తించుకుంటారు. ఆ స్పర్శవలన తలనొప్పి సగం నివారించబడుతుంది. ఒళ్లు మసాజ్ చేయడం అనేది టచ్ ధెరపీలో ఒక భాగం.
ఇక చాలామందికి, బాగా అలవాటైనదీ, ఇష్టమైనదీ, ఎంతో సులువైనది కరచాలనం. కరచాలనం ఆత్మీయతను, స్నేహానుభూతిని తెలియజేస్తుంది. ఇది విశ్వవ్యాపితంగా కోట్లాదిమంది అనుసరించే ఇష్టమైన స్నేహపూర్వకమైన చర్య. షేక్‌హ్యాండ్ అనేది శతృవులను కూడా మిత్రులుగా మార్చగలిగే శక్తివంతమైన స్పర్శాప్రక్రియ. అందుకే షేక్‌హ్యాండ్‌కి అన్ని దేశాలలోనూ, అన్నిరకాల మనుషులలోనూ ఎలాంటి అభ్యంతరం లేకుండా పాటిస్తున్నారు.
పసిపిల్లలను ఒంటరిగా పడుకోబెడితే ఊరికే ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంటారు. వారికి నిద్రాహారాలకన్నా చల్లని ఓదార్పు, కమ్మటి స్పర్శ కావాలి. వారికా విషయం తెలియదు. కానీ వారి మనసు ఆరాటపడుతుంటుంది. ఆ సమయంలో తల్లి లేదా తండ్రి పక్కన పడుకోవడంవల్ల పసిపిల్లలలో భద్రతాభావం కలుగుతుంది. మనసు ఊరట చెందుతుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. తల్లిదండ్రుల లాలనలో అలా పెరిగిన పిల్లలలో పాజిటివ్ సెన్స్ ఎక్కువగా ఉండి, చదువుల్లోనూ, ఆటపాటల్లోనూ బాగా రాణిస్తారు. ఇది ఒక మంచి స్పర్శవలన వచ్చే ఉత్తమ ఫలితాలు.
ఇక స్పర్శవలన యువతీ యువకులలో మంచి ఎంత జరుగుతుందో! చెడూ అంతే జరుగుతుంది వీరిలో స్పర్శానుభూతుల పాళ్లు చాలా ఎక్కువ. అందుకే పెళ్లికానివారిలో చెడు జరిగితే క్రొత్తగా పెళ్లయినవారిలో స్పర్శ గొప్ప అనుభూతులను, నూతనోత్సాహాన్ని, జీవితంలో ముందుకుపోయే విధంగా ఆలోచన్లను పెంచుతుంది. కౌగిలింతల పరిష్వంగంవల్ల యువతీ, యువకులలో కలిగే రసానుభూతిని వర్ణించడానికి ప్రబంధకావ్యాలే కావాల్సి ఉంటుంది. ఈ అనుభవాలను మాటలలో చెప్పడం కష్టం. ప్రేమికుల మధ్య స్పర్శానుభూతుల కౌగిలింతలు, చుంబనాలు ఎన్నో రెట్లు ఉత్సాహాన్ని, మానసిక, శారీరక శక్తులను పెంచుతుంది. కౌగిలించుకున్నపుడు శరీరంలోని ఎడ్రినల్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. అది ఉత్పత్తి చేసే హార్మోనులవల్ల సరియైన ఎమోషన్స్ కలిగి ఆనందం పెల్లుబుకుతుంది. దీనివలన అత్యంత ప్రేమానురాగాలు ఒకరిపట్ల ఒకరికి కలిగి జీవితం సుఖమయమవుతుంది.
ఇక ఆశీర్వచనంలో తలమీద చేయి వేసినప్పుడు కలిగే స్పర్శ తప్పకుండా శుభం జరుగుతున్నదన్నది చాలా పూర్వం నుండీ అనేక దేశాలలో ప్రగాఢమైన విశ్వాసం. విశ్వాసం, నమ్మకం అన్నవి ఎంతగా ఉంటే అంతగా సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా పాటిస్తే గొప్ప పాజిటివ్ మంత్రాలుగా పనిచేసి మంచి ఆరోగ్యకరమైన ఫలితాలను ప్రసాదిస్తాయనడంలో ఎలాంటి సందేహం అఖ్కరలేదు. స్పర్శ ద్వారా ఎన్ని ఉపయోగపడే పనులున్నాయో పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్క స్పర్శ బోలెడు ఉపయోగాలు అన్నది మాత్రం యదార్థమే.
స్పర్శకు కూడా ఓ భాష వుంది
english title:
a
Date:
Wednesday, November 27, 2013