అంధులయితేనేమి? జబల్‌పూర్‌లో ఒక అంధ విద్యార్థుల హాస్టల్‌లోనికి ఒక దొంగ గప్‌చిప్‌న ప్రవేశం చేస్తూంటే పట్టుకుని ఓ రేవు పెట్టేశారు. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే చిల్లర దొంగ ‘విక్కీ’-మొన్న 13న గ్రుడ్డివాళ్ళకి పట్టుబడ్డాడు. వాళ్ల చెవులంత షార్ప్ మరి.
జబల్‌పూర్ యూనివర్సిటీ సరిహద్దు గోడ దగ్గర- ‘చీకట్లో’ (వాళ్లకి దాంతో ప్రమేయం లేదుగా) ‘‘దబ్బు’’మన్న శబ్దం అయింది. తర్వాత హాలులోని తలుపు తోస్తున్న చిన్న ‘కిర్రు’మన్న శబ్దం కూడా వినవచ్చింది... అంతే, విద్యార్థులంతా లేచి గొంగ బయటికి పోకుండా- ‘గోడ’ (వలయంగా నిలబడి) కట్టేశారు. ఇరుక్కున్న ‘విక్కీ’ని చావచంపి- చెవులు మూసి- పోలీసులకి అప్పగించారు. వాళ్ళ హాస్టల్‌కో చెయ్యి లేని అవిటి వాచ్‌మెన్ వున్నాడు. ఈలోగా ఎక్కణ్నుంచో అతగాడు వచ్చాడు- తాపీగా!
బుద్ధ భగవాన్‌కి
బంగారం కావాలా?
బిహార్‌లోని ‘మహాబోధిగయా’- బౌద్ధాలయం మీద మొన్న జూలై నెలలో - ఇస్లామిక్ మిలిటెంట్లు దాడిచేసిన సంగతి అందరికీ తెలుసు.
2500 సంవత్సరాల క్రితం గౌతమబుద్ధుడికి ఇక్కడే బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం అయింది. ఆ పవిత్ర స్థలంలో నిర్మించిన రుూ చరిత్రాత్మక పురాతన బౌద్ధాలయానికి శ్రీలంక మొదలు జపాన్‌దాకా గల దేశ దేశాలనుంచి భక్తులు దర్శనార్థం వస్తూంటారు. తాజా వార్త ఏమిటీ అంటే ఇప్పుడీ దేవాలయానికి 660 ‘పౌండ్ల’ బంగారం విరాళంగా వచ్చింది. ఒక పౌను అంటే నాలుగు వందల యాభై నాలుగు గ్రాములు. థాయిలాండ్ దేశం రాజుగారు రుూ బంగారంతో ఆలయ గోపురానికి - మలామా చేయించమని కోరుతూ- ఈ బంగారాన్ని నలభై మంది ప్రత్యేక దూతల బృందంతో యిటీవల ఇండియాకి పంపించాడు. ఈ బృందంతోపాటు 24 మంది ‘కమెండో’లు కూడా వచ్చారు. మొత్తానికి బంగారం 13 పేటికలలో పెట్టి పంపించారు. అంతా బుద్ధదేవునికి అంకితం.
ఐతే- గౌతముడు తపస్సు చేసి- జ్ఞానోదయం పొంది- సర్వసంగ పరిత్యాగం చేసిన రుూ వైరాగ్య స్థలంలో రుూ బంగారు కానుకలకు చోటుందా? అని, దలైలామా అనుయాయులు చెవులు కొరుక్కుంటున్నారు. కోపతాపాలు, రాగద్వేషాలు, ఇహలోక సుఖభోగాలు- అన్నీ త్యజించి బుద్ధుడైన గౌతముడి గుడికి- ‘బంగారం పూత’ని భక్తులు ఎంతగానో కోరుకుంటారు గానీ- ప్రజల సేవ నిమిత్తం యిలాంటి విరాళాలు ఉపయోగపడితేనే బాగుంటుందని ఉత్తర ఐరోపాలో దలైలామా ప్రతినిధి అయిన బౌద్ధగురువు తుబ్తేన్ సందూప్‌గారు అన్నారు. మానవ సేవకే బుద్ధుడు విలువ యివ్వమన్నాడని వ్యాఖ్యాంచాడు. ఐతే భక్తుల కోరికని మన్నిస్తే తప్పులేదని కూడా అంగీకరించాడులెండి!
అంధులయితేనేమి? జబల్‌పూర్‌లో
english title:
a
Date:
Wednesday, November 27, 2013