‘అక్కడ ఒక సెంటర్లో ఆధార్ కార్డ్ కోసం నమోదు చేస్తున్నారు. అక్కడికి మీ రేషన్ కార్డు తీసుకెళ్లి, నమోదు చేసుకోండి’ అనగానే అందరూ పరుగెత్తారు. అక్కడికెళ్లి ముసలీ ముతకా అందరూ లైన్లో నుంచుని, ఫొటోలు తీయించుకున్నాక, పోస్టులో ఒస్తుంది వెళ్లండన్నారు. కొందరికొచ్చి, కొందరికి రాకపోతే, కొన్ని నెలలైయ్యాక, ఈ లోపల గ్యాసు సిలిండర్లు ఇవ్వమని ఆధార్ కార్డు లేకపోతే, అని గోల చేశాక, భోగట్టా చచ్చీచెడీ ఆన్‌లైన్లో చూసుకుని అడిగితే, తెలిసే విషయం ఈ నంబర్లన్నీ మిస్సయ్యాయని! ఎందుకు మిస్సయ్యాయో, ఎలా మిస్సయ్యాయో ఎవ్వరూ చెప్పరు. అలా కొన్ని నెలలు గడిచాక, గ్యాస్ వాళ్లు గ్యాస్‌ని నాలుగు వందల పనె్నండు రూపాయల గ్యాస్‌ని, పదకొండు వందల యాభైకిగానీ ఇయ్యమంటారు. లబోదిబోమని ఎంత మొత్తుకున్న, వినేవాళ్లు ఎవ్వరూ వుండరు. అంతా అరణ్యరోదనే. ఈ బాధ చాలదన్నట్లు కొత్తిమీరకట్ట అయిదు రూపాయలు, అదీ పండిపోయి ఎండిపోయిన నాలుగు రెబ్బల కట్ట! టమాటాలు అరవై, ఉల్లిగడ్డలు తొంభై, ఇతర ఆకుకూరలు పది రూపాయలు, మూడు రెబ్బలవి మూడు. డాక్టర్లు ఆక్కూరలు బాగా తినాలి అంటారు. ఇక పండ్లు, సీతాఫలాలు, మామూలువి డజను నలభై, నలభై అయిదు బాగా పెద్దవి బాగున్నాయని వాటిమీద చెయ్యిపెడితే, డజను యాభై రూపాయనగానే, చేతికి షాక్ కొట్టినట్టు, గబుక్కున చెయ్యి పండుమీంచి లేచిపోతుంది. అన్నీ ఇలాగే, ఇక పప్పులూ, బియ్యం అడగక్కర్లేదు. మంచి నెయ్యి ఎలాగూ, మర్చిపోయాం. థాంక్స్ టు కొలెస్ట్రాల్, బి.పీ, వగైరా. కనీసం మంచి నూనెలు కూడా చుక్కలను దాటుతున్నాయి. దేముడి దగ్గర రెండు పూట్లా దీపం వెలిగిస్తే, నూనె సీసా వారం రోజులే వచ్చేది. కొన్నప్పుడు సీసాలో, సీసా (కిలో) నూనె అంటే సీసాలో మూడొంతులే వుంటుంది. ఆ పావూ ఎందుకు ఖాళీ.. అంటే ఎవ్వరికీ తెలీదు. సీలు బాగానే వుంటుంది. అలాగే హార్లిక్స్ సీసా, మరేదైనా కూడా! అటువంటి పరిస్థితిలో, ఉద్యోగస్థులకే, ఊపిరి తీసేస్తున్న కరెంటు బిల్లులూ, నీళ్ల బిల్లులతోపాటు ఈ పెరుగుతూన్న ధరలు, ప్రాణాలు తీసేస్తూంటే, గోరుచుట్టుకు రోకటిపోటులా, ఈ ఆధార్ కార్డ్, పదకొండు వందలూ ప్లస్, తెచ్చినందుకుగానో, తెచ్చుకోవడానికో అన్నీ కలిపి పనె్నండు వందలు!. ఏమిటయ్యా ఇవన్నీ ఎందుకు మనుషులను ఇబ్బందిపాలు చెయ్యడం, అంటే అక్రమంగా జరుగుతున్న గ్యాస్ వినియోగదారులలో, ఏజెన్సీలలోని అన్యాయాలను అరికట్టడానికి అన్నారు.
నిజమేమోననుకుంటే, నెలలు దాటిపోతున్నా ఆధార్ కార్డు అందలేదని బాధపడేవారు పడుతూ వుంటే ఆమధ్యనే విన్న సంగతి, ఒక్కొక్కరికి వేరే వేరే పేర్లతో వేరే వేరే అడ్రసులతో నాలుగేసి ఆధార్ కార్డులున్నాయట. ఆధార్ కార్డు సప్లయి చేసే ఆఫీసు ఎక్కడుందో ఎవర్ని కలవా లో, వారి పేర్లూ, ఫోన్ నెం బర్లూ ఎవ్వరికీ తెలియదు.
ఏ మూలో వున్న ఆఫీసు వివరాలు తెలుసుకోవడానికి తిరగాలి కాళ్లరిగేలా! మళ్లా అదే సమాధానం! ‘ఆన్‌లైన్లో చూసి మీ నంబరు మిస్సయింది మళ్లీ నమోదు చేసుకోండి అని’. ఎక్కడికెళ్లి నమోదు చేసుకోవాలి ఎవర్నడగాలి? ఎంత తిరగాలి? అంతదాకా నెలకి సిలెండరుకి పనె్నండు వందలు కట్టి, మిగతా ఖర్చులెలా భరించాలి? మందులూ మాకులూ ఈ రోజుల్లో అందరికీ ఎక్కువయిపోయాయి. బెత్తెడంత డి.ఏ ఏడాదికో రెండేళ్లకో పెరిగితే సరా? అన్నీ అంతకి రెండింతలు పెరిగిన ఖర్చుల మాటేమిటి? మిడిల్ క్లాసు కుటుంబాలూ, మామూలు వాళ్లూ, పెన్షన్ల మీదే బతికేవాళ్ల బతుకులెలా? ఎవరికీ అఖ్కర్లేదు, ఎవరూ పట్టించుకోరు.
ఏమి చెయ్యలేని వాళ్లు ఎప్పుడూ నిస్సహాయులే! పదవిలో వున్న ఉద్యోగులూ, పాలకులూ కూడా అలాగే అయితే, ఛస్తు బతుకుతున్నారు జనం. ‘ఈసురోమని మనుజులుంటే, దేశమేగతి బాగుపడునోయ్’, ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుజులోయ్’ అన్న గురజాడ మాట, పెరుగన్నం మూట కాదు, పాసిపోయిన పనికిరాని ఫలహారం మూట! ‘దేశమంటే మనుషులు కాదు దేశమంటే మట్టే! మనుషులు ఛస్తారు, పుడతారు.
కానీ, మట్టి శాశ్వతం, బంగారం’ అని ఋజువు చేస్తున్నారు నేటి పాలకులు. మేథావులూ, యువత అందుకే దేశం వదలి వలసపోతున్నారు, ఉన్న వూరునీ, కన్నవారినీ వొదిలిపెట్టి! అలా జరక్కుండా అందరికీ అన్నీ అమర్చే విధానాలు, ప్రభుత్వాలకి కనబడడంలేదా? పాలకులకి తోచడం లేదా? పెద్దల పిల్లలు వెళ్లిపోతున్నారు సౌఖ్యాలను వెతుక్కుంటూ.
లేనివాళ్లు నిరాశా నిస్పృహల మధ్య, నిట్టురుస్తూ, నీలుగుతూ బతుకుతున్నారు. ఇదేనా మన దేశం? ఇదా భారతదేశం? గతాన్ని నెమరేస్తూ బతకడమేనా గతి?
మరమరాలు
english title:
maramaraalu
Date:
Wednesday, November 27, 2013