అధిక జనాభాను అదుపు చేయాలన్న పట్టుదలతో కమ్యూనిస్టు పాలకులు విధించిన ఆంక్షలు అక్కడి ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపించాయి.. ‘ఒక కుటుంబానికి ఒకే శిశువు’ నిబంధన ఫలితంగా దశాబ్దాల తరబడి జనం అమానవీయ పరిస్థితులను ఎదుర్కొన్నారు.. రెండో సంతానం కోసం గర్భం దాల్చిన మహిళలు జరిమానాలు, జైలుశిక్షలతో పలురకాల వేధింపులను అనుభవించక తప్పలేదు.. ద్వితీయ సంతానం కనేందుకు సిద్ధపడిన మహిళలకు అధికారులే బలవంతంగా గర్భస్రావాలు చేయించిన సంఘటనలు కోకొల్లలు.. గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిస్తే భ్రూణహత్యలు, గర్భస్రావాలు చేసేందుకు కొన్ని కుటుంబాల్లో వెనుకాడని పరిస్థితి.. అర్హతల్లేని వారు సైతం ‘అబార్షన్లు’ చేయడంతో ప్రాణాలు కోల్పోయిన, దీర్ఘ అనారోగ్యం పాలైన మహిళలెందరో.. ఈ దుర్భర పరిస్థితుల్ని వౌనంగా భరిస్తున్న చైనా ప్రజలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ‘ఒకే బిడ్డ’ నిబంధన ఫలితంగా కోట్లాది మంది ప్రజలు పడుతున్న అవస్థలపై మానవ హక్కుల బృందాలు చేస్తున్న పోరాటాలకు చైనా పాలకులు చివరకు తలవంచక తప్పలేదు. ప్రజల నిరసనలు, హక్కుల సంఘాల ఆందోళనల మేరకు చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం తాజాగా సామాజిక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. జనాభా నియంత్రణకు గత 34 ఏళ్లుగా అమలు చేస్తున్న ‘ఒకే బిడ్డ’ విధానంలో మార్పు చేసి, ఇకపై ఒక కుటుంబంలో ఇద్దరు సంతానం ఉండేందుకు అనుమతించాలని చైనాలోని అధిర కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల వల్ల ఇన్నాళ్లూ ఒక బిడ్డకే పరిమితమైన లక్షలాది మంది దంపతులు మరో బిడ్డను కనేందుకు సమ్మతిస్తూ ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా’ ప్లీనరీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ప్రఖ్యాతి పొందిన చైనాలో 1979లో ‘ఒక కుటుంబానికి ఒకే శిశువు’ నిబంధన విధించారు. ఆహారోత్పత్తులు, సహజ వనరులు, ఉపాధి అవకాశాలు నానాటికీ తగ్గుతున్నందున జనాభాను నియంత్రించాలన్న దృఢ సంకల్పంతో ‘ఒకే బిడ్డ’ నిబంధనను కఠినంగా అమలు చేయడంతో అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిబంధన ఫలితంగా గత 34 ఏళ్లలో దాదాపు 400 మిలియన్ల జననాలను అరికట్టగలిగామని చైనా పాలకులు ఘనంగా చెబుతున్నా, సామాజికంగా అనేక సమస్యలు తలెత్తాయి. ఓ వైపు వృద్ధుల సంఖ్య పెరగడం మరోవైపు మానవ వనరుల సామర్థ్యం తగ్గడంతో చైనా పాలకులు పునరాలోచనలో పడ్డారు.
కాగా, ‘ఒక బిడ్డ’ నిబంధనలో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు వివక్షకు అద్దం పట్టేలా ఉన్నాయన్న విమర్శలూ రాజుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని దంపతులు ఒక బిడ్డను మాత్రమే కనాలని, గ్రామీణ ప్రాంతాల దంపతులు తొలి సంతానం ఆడ శిశువైతే మరో బిడ్డను కనవచ్చని మినహాయింపు ఇచ్చారు. జనాభా రీత్యా తక్కువ సంఖ్యలో ఉన్న కొన్ని ప్రత్యేక తెగలకు కూడా సడలింపు ఇచ్చారు. రెండో బిడ్డను కనాలనుకునే గ్రామీణ ప్రాంత దంపతులు విధిగా అధికారుల నుంచి లిఖిత పూర్వకంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా మహిళలు రెండోసారి గర్భం దాల్చితే జరిమానాలు, జైలుశిక్షలు విధించడమే గాక బలవంతపు గర్భస్రావాలు కూడా చేయించారు. జరిమానాల కింద భారీ మొత్తంలో వసూలు చేసిన డబ్బును ఏం చేశారన్న అనుమానాలు సైతం చోటు చేసుకున్నాయి. జరిమానాల మొత్తంపై ఎలాంటి జవాబుదారీతనం లేకపోవడం విమర్శలకు దారితీసింది. ‘ఒక బిడ్డ’ నిబంధన ముసుగులో కొందరు అధికారులు అతిగా ప్రవర్తించడ కూడా వివాదాస్పదమైంది. 2012లో ఓ మహిళ రెండో సంతానం కనేందుకు గర్భం దాల్చగా అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలులో పెట్టారు. నిబంధనను అతిక్రమించినందుకు ఆరువేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆమె కుటుంబ సభ్యులను అధికారులు వేధించారు. ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో గర్భంతో ఉన్న ఆమెను జైలులో ఉంచి, గర్భస్థ శిశువు మరణించేలా ఇంజక్షన్ ఇచ్చారు. పోలీస్ కస్టడీలోనే ఆమె మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.మరోవైపు ఎక్కడా లేని విధంగా చైనాలో ఆడపిల్లల సంఖ్య తగ్గడంపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 1970 ప్రాంతంలో చైనా మహిళ సగటున నలుగురికి జన్మనివ్వగా, 2011 నాటికి ఆ సంఖ్య 1గా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికారిక కమ్యూనిస్టు పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు ప్రారంభించి జనాభా నియంత్రణ విధానాలపై సంస్కరణలు ప్రకటించక తప్పలేదు. ‘ఒక బిడ్డ’ నిబంధన సడలింపుతో ఇక ఏటా రెండు మిలియన్ల జననాలు నమోదు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఏటా 15 మిలియన్ జననాలు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పెద్దగా మార్పు ఉండక పోవచ్చని భావిస్తున్నారు.రెండో సంతానం కోసం ఆశిస్తున్న సుమారు 150 మిలియన్ల కుటుంబాల వారికి నిబంధన సడలింపుతో లబ్ధి జరగవచ్చని అధికారులు అంచనా.లింగ వివక్షను పెంచుతూ, తమ ప్రాథమిక హక్కుల్ని హరించి వేస్తున్న ‘ఒక బిడ్డ’ విధానంలో సడలింపులు ప్రకటించడం పట్ల చైనాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
*
చైనాలో సడలిన ఆంక్ష
english title:
r
Date:
Wednesday, November 27, 2013