అసాంఘిక అమానవీయ బీభత్సకారులిద్దరినీ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగారశిక్షను విధించడం ‘పరువు’ పేరుతో ప్రాణాలను మంటగలుపుతున్న పిశాచ ప్రాయులకు భయం కలిగించగల పరిణామం. ఈ భయం పరువు హత్యలను నిరోధించడానికి దోహదం చేయగలిగినప్పుడు మంగళవారం సాయంత్రం న్యాయమూర్తి శ్యామ్‌లాల్ చెప్పిన తీర్పునకు సార్ధకత ఏర్పడుతుంది. యావజ్జీవ కారాగృహవాసానికి గురి యవుతున్న ఈనేరస్తులు కన్న బిడ్డను కాటేసిన కసాయి హంతకులు! తమ ఇంటిలో సహాయకుడిగా పనిచేస్తుండిన మరో యువకుడిని పొట్టన పెట్టుకున్న కిరాతకులు. రాజేశ్ తల్వార్, నూఫుర్ తల్వార్ అన్న ఈ నేరస్థులు తమ కన్న కూతురు పదునాలుగేళ్ళ ఆరుషిని ఐదున్నర ఏళ్ళక్రితం నోయిడాలోని తమ ఇంట్లోనే చంపివేయడం దేశవ్యాప్తంగా విస్మయ ప్రకంపనలను సృష్టించిన దురంతం. తమ కుమార్తెతో అసభ్యకరమైన సంబంధం కలిగివున్నాడన్న నెపంతో ఈ హంతక దంపతులు హేమరాజ్ అన్న తమ గృహ సహాయకుడిని చంపేశారన్నది న్యాయస్థానం నిర్ధారించిన నిజం. ఎంతటి భయంకరమైన పాపం చేసిన పిల్లలనైనా తల్లిదండ్రులు హత్య చేయడం మానవమాత్రులు ఊహించలేని విషయం. ఇలాంటి ఘోర పాషాణ హృదయుల చిత్తవృత్తిని గురించి ఊహించడం కూడ ఒడలు గగుర్పొడిచే భయంకరమైన అనుభూతి. తల్లిదండ్రులు తమ పిల్లల జన్మకు కారణభూతులు, అస్తిత్వ ప్రదాయకులు, వారి బతుకులకు అద్వితీయమైన రక్షకులు. రక్షకులు ఇలా భక్షకులు కావడం పైశాచిక చర్యకు పరాకాష్ఠ. పసిమి ప్రాయం చెరగని మిసిమి ప్రాంగణంలో అడుగు పెట్టిన ఆ పదునాలుగేళ్ళ బాలిక తండ్రి తనను తలపై ‘గోల్ఫ్ క్లబ్’తో కొట్టి చంపుతాడని కలలోనైనా ఊహించి ఉండదు! తల్లి ఇందుకు సహకరిస్తుందని తలపోసి ఉండదు. భద్రతా విశ్వాసానికి అద్వితీయ స్థానమైన సొంత ఇంటిలోనే ఆ ‘మొగ్గ’ బతుకు బుగ్గిపాలు కావడం దుర్భరమైన దృశ్యం. కానీ దృశ్యాన్ని ఆవిష్కరించడానికి ఆమెను కన్నవారు వనె్నల మెకంగా మారడం మానవత్వం పరువు తీసిన ఉన్మాద విషనృత్యం. చంకలో ఒదిగి నవ్వులు చిందిస్తున్న శిశువును కన్నతల్లి మండుతున్న పొయ్యిలోకి విసిరినట్టు, నిర్భయంగా నిద్రిస్తుండిన ఆరుషిని ఆమె తల్లిదండ్రులు ఆహుతి కొనడం ఆక్షరాలలో ఇమడని, భావానికి అందని దానవత్వం..
ఇలా ఇద్దరిని చంపిన ఈ హంతక దంత వైద్య దంపతులకు న్యాయస్థానం వారు మరణశిక్షను ఎందుకు విధించలేదన్నది కూడ సమాధానం లభించవలసిన సందేహం. ఇలా ఇద్దరిని కొట్టి చంపడమేకాదు, హత్యానేరాన్ని తమ వైద్యశాలలోను, ఇంటిలోను పనిచేస్తుండిన ఇద్దరు సహాయకులపైకి నెట్టడానికి యత్నించడం వారి వంచక ప్రవృత్తికి నిదర్శనం. నిజం నిగ్గుతేలింది కనుక ఆ నిర్దోషులిద్దరూ ఊపిరి పీల్చుకోగలుతున్నారు. ‘‘తల్లిదండ్రులు స్వంత కుమార్తెను ఎలా చంపుతారు?’’ అన్న మీమాంసకు లోనై పోలీసులు కాని, సిబిఐవారు కాని తప్పుదారి పట్టడం వల్ల కొంతకాలం పాటు కృష్ణరాజ్, కుమార్ అన్న గృహ సహాయకులను అనుమానించారు. తమ కుమార్తెను హేమరాజ్ చంపేశాడని నమ్మించడానికి సైతం హంతకులు యత్నించడం మరో ఘోరం. హేమరాజ్ మృతదేహం కూడా ఇంటికప్పుపై ఉన్న ఒక గదిలో దొరికిన తరువాత కాని పోలీసుల దృష్టి తల్వార్ దంపతులపైకి మళ్ళలేదట. ఆరుషిని, హేమ్‌రాజ్‌ను హత్య చేసింది తల్వార్ దంపతులేనని అనుమానించడానకి అవకాశం ఉన్నప్పటికీ నేరం ఋజువు చేయడానకి వీలుకాదని సిబిఐ వారు ఒకదశలో నిర్ధారించి న్యాయస్థానానికి నివేదించడం ఈనేర విచారణ ప్రక్రియలోని తీవ్రమైన వైపరీత్యం. మరోదశలో సిబిఐవారు రాజేశ్ తల్వార్‌ను నిర్దోషిగా భావించి నిర్బంధం నుండి విడుదల కూడ చేశారు. దర్యాప్తు పలుకుబడి కలిగిన బాహ్యశక్తుల ఒత్తడికి గురి అయిందన్న వాస్తవానికి ఇవన్నీ సాక్ష్యాలు. అభియోగాన్ని రద్దు చేయడానికి, తల్వార్ దంపతులను నిర్దోషులని భావించడానికి ‘సిబిఐ’ వారి అభియోగాలను విచారించే ప్రత్యేక న్యాయమూర్తి 2011 పిబ్రవరిలో నిరాకరించేవరకు నేరస్థులు తప్పించుకొనే ప్రమాదం నిరంతరం ప్రస్ఫుటమైంది. దర్యాప్తు సంస్థల పనితీరుపై ఈ ఉదంతం అనేక అనుమానాలను కలిగించడం సహజం!
ఏమయినప్పటికీ తల్వార్ దంపతులు నేరం చేసినట్టు ధ్రువపడిన తరువాత వారికి మరణశిక్ష విధించాలని ‘సిబిఐ’ కోరడం అభిలషణీయ పరిణామం. అలా తల్వార్ హంతకులకు మరణశిక్ష విధించి ఉండినట్టయితే అసాంఘిక బీభత్సం సాగిస్తున్న పరువు హంతకులకు వెన్నులో వణుకు పుట్టి ఉండేది. పరువును పరిరక్షించడం పేరుతో కుల పంచాయతీలు పెట్టి ప్రణయ జీవులను పరిమార్చుతున్న వారు దేశం పరువును తీస్తుండడం వర్తమాన వైపరీత్యం! హర్యానా వంటి రాష్ట్రాలలోను ఇతర చోట్ల మితిమీరిన ఈ పరువు హత్యల పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన చేసింది. పరువు పేరుతో, కులం పేరుతో, ఆర్థిక స్థాయి పేరుతో, సామాజిక ప్రతిష్ఠ పేరుతో హత్యలు చేస్తున్నవారిని తీవ్రంగా అభిశంసించిం ది. అయినప్పటికీ తమ పరువు భ్రాంతికి భిన్నమైన వివాహాలు చేసుకున్న తమ బిడ్డలను చంపివేస్తున్న తల్లిదండ్రులకు కనువిప్పు కలగడం లేదు. గత సెప్టెంబర్‌లో హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా ‘ఘర్నావతి’ అన్న గ్రామంలో నిధి బారక్, ధర్మేంద్ర బారక్ అనే యువతీ యువకులను ఆ యువతి తల్లిదండ్రులే చంపేశారు. వారు చేసిన నేరం ప్రేమించుకోవడం. ఊరినుండి పారిపోయి పెళ్ళి చేసుకోవడం. ‘‘తాలిబన్ తండాల రీతి’’లో వ్యవహరిస్తున్న కుల పంచాయతీలు హత్యలు చేయకుండా నిరోధించడానికి వీలైన శాసకీయ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. హత్యలు జరిపిన వారిని ఆ తరువాత విచారించి శిక్షించడం కన్నా, హత్యలను నిరోధించడానికి వీలైన శాసకీయ వ్యవస్థ ఏర్పడటం మేలు. కాని పిల్లి మెడలో గంట కట్టడం వంటి ఈ నిరోధక శాసకీయ వ్యవస్థ ఏ రాష్ట్రంలోకాని ఏర్పడిన సూచనలు లేవు.
పరువు హత్యలు అత్యంత హేయమైన అత్యంత అరుదైన నేరాలని ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు ధ్రువపడిన వారికి మరణశిక్ష విధించాలని 2011లో సుప్రీంకోర్టు నిర్ధారించి ఉంది. ఆరుషిని హత్య చేసిన తల్వార్ దుండగులు ఈ ‘పరువు’ పేరుతోనే ఈ అమానుష ఘాతుకానికి ఒడిగడ్టారన్నది స్పష్టం. నేరం ధ్రువపడింది కూడ. అందువల్ల వారికి మరణశిక్షను కాక యావజ్జీవ కారాగార శిక్షను విధించిందన్నది చర్చకు అవకాశం కలిగిస్తున్న అంశం. పథకం ప్రకారం కాక ఆవేశానికి, ఉన్మాదానికి లోనై హత్యలు చేసిన వారికి మాత్రమే న్యాయస్థానాలు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నాయి. పథకం ప్రకారం హత్య చేసిన వారికి మరణశిక్ష విధించకపోవడం అసాధారణమైన విషయం. మరి తల్వార్ దంపతులు పథకం ప్రకారం ఆ ఇద్దరినీ పొట్టన పెట్టుకున్నారా?? లేక తాత్కాలిక ఆవేశంలో హత్యలు చేశారా??
అసాంఘిక అమానవీయ బీభత్సకారులిద్దరినీ ఉత్తరప్రదేశ్‌లోని
english title:
paruvu
Date:
Wednesday, November 27, 2013