ఏ గుంపులోని చిలకలు ఆ గుంపు పలుకులే పలకాలి, నా రూటు సపరేటు అంటూ ఆ గుంపులోని పక్షి వేరుగా మాట్లాడితే తోటి చిలకలు ముక్కుతో పొడిచిపొడిచి చంపేస్తాయి. గతంలో జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మంత్రులు, పోలీసు అధికారులు రోజూ పిలు పు ఇచ్చేవారు. రెండు చేతులా సంపాదిస్తూ పి ల్లా పాపలతో హాయిగా ఉండకుండా కొంత మంది సమ సమాజం, తొక్క తోలు అంటూ ఏవేవో మాటలకు, పాటలకు ఆకర్షితులై అడవుల బాట పట్టేవాళ్లు. అలాంటి వేరు చిలకులు తమ గుంపులో కలిసిపోవాలని చెప్పడానికి జన జీవన స్రవంతిలో కలవాలని, అంటే మాలా సంపాదనలో మునిగిపోవాలని కోరుతూ పెద్ద లు పిలుపు ఇచ్చేవారు. కొత్త చిలుక సొంతంగా బియ్యపు గింజలు సంపాదించుకోవడం కష్టం కాబట్టి జనజీవన స్రవంతిలో కలిసిన చిలుకలకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్లు. ప్రతి చిలుకా తమలానే ఉండాలని చిలుకలు కోరుకోవడం లోక సహజం. సత్యహరిశ్చందుడి కథ తెలుసు కదా! సురులు, అసురులు, శత్రువులు మిత్రులు అందరూ ఆయన్ను కష్టాలు పాలు చేశారు. రాజ్యపాలన చేయాల్సిన ఆయన స్మశాన వాటికలో ‘ఇచ్చోటనే..’ అంటూ పాటలు పాడుతూ కాపలా కాయాల్సి వచ్చింది. ఎందుకలా అని ప్రశ్నిస్తే, ఇంకెందుకు దేవతలంతా హరిశ్చంద్రుని సత్యసంధతను లోకానికి చాటేందుకు అలా పరీక్షలు పెట్టారు. అని చెబుతారు. ఇది నిజంగా నిజమా? అనుమానమే?
ఇప్పట్లా అప్పుడు మీడియా ఉండి ఉంటే హరిశ్చంద్రుడితో ఆఫ్‌ది రికార్డ్‌గా మాట్లాడిస్తే ఏం తేలేది? అందరూ అబద్ధాలతో జీవిస్తుంటే, నిజం చెప్పడం తప్పని నా జీవితం ద్వారా నేను గ్రహించాను అని చెప్పేవాడేమో! లోహితాస్యుడిని అడిగితే చచ్చాక నిజం చెప్పవద్దనే సత్యాన్ని గ్రహించానని చెప్పేవాడేమో! మహారాణిలా అధికారం చలాయించాల్సిన నేను అష్టకష్టాలు పడాల్సి వచ్చిందంటే మా ఆయన అబద్ధం చెప్పక పోవడం వల్లే కదా కాబట్టి సత్యం చెప్పకండి అని హరిశ్చంద్రుడి భార్య హితబోధ చేసేవారేమో! ఇంతకూ హరిశ్చంద్రునికి ఆ పరీక్షలన్నీ ఎందుకు పెట్టారు అంటే చిలక సిద్ధాంతం గుర్తొస్తోంది. మేమంతా అబద్ధాలపై జీవించే చిలుకలం, అస్సలు అబద్ధం చెప్పని చిలకగా నువ్వు ఉండాలనుకోవడం సహించరాని నేరం అనే ఆగ్రహంతోనే అందరూ హరిశ్చంద్రునికి అలా పరీక్షలు పెట్టారేమో! చిలకల్లో చిలకలా చేరిపోయి చిలక పలుకులు పలికితే హాయిగా గడిచిపోతుంది. దారి తప్పారా?అంటే దారి లేకుండా చేస్తారు.
అరవింద్ కెజ్రీవాల్ అనే యువకుడొకరు తన ఉద్యోగమేదో తాను చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో వచ్చాడు సరే అందరి మాదిరిగా తెల్లని బట్టలు, నల్లని ఆలోచనలతో రాజకీయ వ్యాపారం సాగించవచ్చు కదా? ఎన్నికల సమయంలో నేతలు చీపురు పట్టుకుని ఊడు స్తూ మీడియాకు ఫోజులిస్తుంటారు. కెజ్రీవాల్ కూడా అలా చీపురు పట్టుకుంటే సర్లే మన గూటి పక్షే అనుకున్నారు. ఆయన మాత్రం మా గూడు వేరు, మా రెక్కలు వేరు, మేం ఎగిరే తీరే వేరు అంటూ అప్పటి వరకు గుంపులు గుంపులుగా ఉన్న చిలకలన్నింటిపై దాడి మొదలు పెట్టాడు. కొత్త పక్షులను తీసుకు వచ్చి తమపై దాడిగి దిగడంతో కొమ్ములు తిరిగిన పాత పక్షులు కొద్ది సేపు వౌనంగానే ఉన్నాయి. అంతలోనే చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్. ఊరూపేరులేని సందట్లో సడేమియా అనే మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ చేసి కెజ్రీవాల్ పార్టీ నాయకులు సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బులు గడిస్తున్నాడని వీడియోను మీడియాకు విడుదల చేసింది. ఈ లోపుగానే అసలు మీ చీపురు పార్టీ కార్యకర్తలు రోజూ రెండు పూటలా తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి అంటూ విచారణ కమిషన్ వేశారు. కోట్లు కొల్లగొట్టేవాడ్ని వదిలి చీపురు కట్టలతో ఉన్నవారిని పట్టుకున్నారేమిటంటే , ‘‘మరి వీడొక్కడే మాలో కలువ కుండా తానేదో సత్యహరిశ్చంద్రుడిని అని చెబుతున్నాడు అలాంటప్పుడు హరిశ్చంద్రుని కష్టాలు వీడికి చూపాల్సిందే లేకపోతే మా వ్యాపారాలు మూసుకోవలసి వస్తుంది..’’ అనేది పాత చిలుకల గుంపు వాదన. వేల కోట్ల పెట్టుబడులతో సాగే రాజకీయ వ్యాపారంలో చీపుర్లతో ప్రవేశిస్తే ఈ రోజు ఢిల్లీ మాదే అంటాడు, రేపు దేశం మాదే అంటాడు చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటున్నారు. మన రాష్ట్రం జెపి అని ఒకాయన అచ్చం మేధావిలానే కనిపిస్తారు. 2009 ఎన్నికల ఫలితాలు రాగానే టిడిపి వాళ్లు జెపి చిలకను పొడిచిన చోటు పొడవ కుండా పొడిచారు. జెపి సోనియా ఏజెంట్. సోనియా జెపికి జాతీయ స్థాయిలో పదవి ఇచ్చింది. జెపికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు. మీది పెద్ద పార్టీ. ఏక్ నిరంజన్ ఆయనపై ఎందుకంత కక్ష అని తెలుగు ఎమ్మెల్యేను అడిగితే. ఆయన కూడా ఈ గూటి పక్షే కానీ తానేదో ప్రత్యేక జాతి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ గూటి పక్షే అని తేల్చేస్తే చాలు లేకపోతే ఏకు మేకవుతుంది అని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో జెపి చిలుక భాష బాగానే నేర్చుకున్నారు. ఎలాగైనా ఉన్న ఒక్కసీటు నిలబెట్టుకోవడానికి జెపి నేను మీ గూటి పక్షినే అంటూ అచ్చం బాబు పలుకులే పలుకుతున్నారు.
తరుణ్ తేజ్‌పాల్ అత్యాచార యత్నం వ్యహారం కోర్టు తేలుస్తుంది. జాతీయ చానల్స్‌లో అతని గురించి హడావుడి చూస్తుంటే, వాడూ మా వాడే అని తృప్తి పడుతున్నట్టుగా ఉంది. బిజెపిపై స్ట్రింగ్ ఆపరేషన్ చేసినందుకు ఆయనపై చాలా కాలం నుంచి చాలా మందికి కోపంగా ఉంది. ఇప్పుడు మా గూటి పక్షే అని నిరూపించేందుకు అవకాశం లభించింది అందు కే అంత ఉత్సాహం. ఐఎంఎఫ్ అధ్యక్షుడు అ లాంటి తప్పు చేస్తాడా? తరుణ్ తప్పు చేశాడా? అంటూ ప్రశ్నలు వినిపించినప్పుడు రజనీష్‌ను గుర్తు చేసుకుంటే.. హోదా తరువాత.. ముందు మనిషి. వాళ్ళనే దేవుళ్లు అనుకోవడం నీ తప్పు. మనిషికుండే అవలక్షణాలన్నీ ఆ మనిషికి ఉంటాయి అనే జీవిత సత్యం కళ్ల ముందు మెదులుతుంది.
ఏ గుంపులోని చిలకలు ఆ గుంపు పలుకులే పలకాలి
english title:
kezriwal
Date:
Wednesday, November 27, 2013