ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడల జనాభా కోటికి పైనే ఉందని జనాభా లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి. హరితాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం దీనికేం సమాధానమిస్తుంది? మురికివాడల జనాభాలో 15 శాతం పైబడి దేశంలోనే రెండో స్థానాన్ని పొందిన మన రాష్ట్రం, వెనుకబడిన బీహార్ కంటే ఈ జనాభాలో 8 రెట్లు ఎక్కువ కలిగి ఉండటం కలవరపాటును కలిగిస్తుంది. పేద ప్రజల సంక్షేమార్థం అధిక నిధులు వెచ్చించే రాష్ట్రాల్లో ముందు వరసలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఈ దుస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.
- పట్టెం వెంకట నాగేశ్వరరావు, చెరుకుపల్లి
సీమాంధ్ర ప్రభుత్వానికి తిప్పలు
సీమాంధ్ర ప్రభుత్వం ‘ఎక్కువలో ఎక్కువగా’ పది సంవత్సరాలపాటు హైదరాబాద్ నుండే పనిచేయవలసి ఉండటంవలన గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, అధికారులు మొ. వ్యవస్థ ఇక్కడినుండే పనిచేయటం ప్రారంభంలో కొంత అసహజంగా అనిపించినా క్రమక్రమంగా అందరూ అలవాటుపడతారనటంలో సందేహం లేదు. ‘ఇంకొక రాష్ట్ర రాజధాని నుండి’ పనిచేస్తూ, అక్కడే నివసిస్తూ నియోజక వర్గాలకు ‘వెళ్లి వస్తూండే’ ప్రజాప్రతినిధులు ప్రజలతో ‘మానసిక అనుబంధాన్ని’ కలిగించుకోవటం చాలా కష్టం కావచ్చు. ఏది ఏమైనా అలవాటు పడేదాకా సీమాంధ్ర ప్రజలకి ప్రభుత్వానికి తిప్పలు తప్పవు.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్
వంటగ్యాస్ ఇక్కట్లు
ఆఘమేఘాల మీద ఆధార్ కార్డులన్నారు. బ్యాంకు ఎకౌంట్లు అర్జంటుగా అవసరమన్నారు. వాటిని గ్యాస్ కార్డులకు అనుసంధానం చేస్తేగాని గ్యాస్ సబ్సిడీ రాదన్నారు. అక్షరం ముక్కరాని వారు కూడా ఎంతో మంది ఎన్నో యిక్కట్లుపడి వాటిని పూర్తిచేసుకున్నారు. గ్యాస్ సిలెండర్ దాదాపు వెయ్యి రూపాయలకు మించి చెల్లించి కొనుక్కుంటున్నారు. సిలెండర్ డెలివరీ తీసుకున్న తరువాత బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ డబ్బులు పడటం లేదు. నెలుల గడిచిపోయినా, ఎంతకాలమైనా, అసలు సబ్సిడీ డబ్బు కలుస్తుందో లేదో తెలియుట లేదు. అందజేసిన ప్రూఫ్ కాగితాలను మళ్ళీ మళ్ళీ అందజేయమని ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
- రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం
తీవ్రవౌతున్న ధాన్యం కొరత
ప్రపంచ వ్యాప్తంగా నేడు ఆహార ధాన్యాల కొరత తీవ్రవౌతోంది. అభివృద్ధి చెందిన దేశాలుఒక్క గింజ కూడా వృధా కాకుండా ఆహార ధాన్యాల నిల్వలకు ఆధునిక పద్ధతులను అమలుపరుస్తుండగా మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. గత దశాబ్ద కాలంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగినా వాటిని నిల్వచేసేందుకు గిడ్డంగుల నిర్మాణం అదే నిష్పత్తిలో జరగలేదు. అకాల వర్షాల కారణంగా పంటలు పాడైపోయి, వాటిని కొనేందుకు ప్రభుత్వం విముఖత చూపించడంవలన రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా ప్రభుత్వం తక్షణం గిడ్డంగుల వికేంద్రీకరణకు తక్షణ చర్యలు చేపట్టాలి. మండల స్థాయిలో తగినన్ని గిడ్డంగులను నిర్మించి చౌక ధరలలో వాటిని రైతులకు అందుబాటులోనికి తేవాలి. ఆహార ధాన్యాలను నిల్వచేయడంలో ్రఅత్యాధునిక విధానాలను అందుబాటులోనికి తేవాలి.
- సి.ప్రతాప్, విశాఖపట్నం
ఎన్నిసార్లు పెంపు?
పెరిగిన కూరగాయలు, ఉల్లి ధరలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. గ్యాసు ధర రు.250 పెరగబోతున్నదని పిడుగు లాంటి వార్తొచ్చింది. ఇదే నిజమైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. సాలుసరి ఆదాయం ఐదు లక్షలు దాటితే నో సబ్సిడి అన్నారు. అంతమటుకు బాగానేవుంది. నిత్యావసర వస్తువుల్లో గ్యాసు ఒకటి. ఏపాటు తప్పినా సాపాటు తప్పదుగా. పోనీ సిలిండర్ని అటకెక్కించి కరెంట్ స్టౌతో వంట చేసుకుందాం అంటే సర్‌ఛార్జీలతో చావగొడ్తున్నారు. ఆయిల్ కంపెనీలు నష్టాల్లో వుంటే పూడ్చుకునే మార్గాలే లేవా? వెర్రిజనాలు తినకుండా పస్తులుంటారా? ఉంటే ఎంత కాలం వుంటారు? అప్పోసప్పో చేసి గ్యాసు కొనుక్కుంటారు అని ప్రభుత్వ ధీమాగా కనిపిస్తున్నది.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
మరో ప్రపంచ వింత
గుజరాత్ ప్రభుత్వం ఉక్కుమనిషిగా పేరొందిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని 2500 కోట్ల రూపాయలతో 597 అడుగుల ఎత్తుతో తయారుచేసి ప్రతిష్టించడం, దీని పేరు ‘‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’’ అని నామకరణం చేయడం ముదావహం. దీన్ని చూడాలంటే దూరాన్నుంచే చూడాలి. ఇంత ఎత్తయిన పటేల్ విగ్రహం ప్రపంచ వింతల్లో చేరడం ఖాయం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడల జనాభా కోటికి పైనే ఉందని జనాభా లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి.
english title:
p
Date:
Wednesday, November 27, 2013