Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చెక్కు రాసిస్తే చాలు...పనులన్నీ సులువే!

$
0
0

...............
పూర్వం పెళ్లి చెయ్యడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పచారీ సామాన్లూ, కూరగాయలు కొనడం దగ్గరినుంచి అన్ని పనులూ చేసుకోవాలి. వంటవాళ్ళు చెప్పిన ఎస్టిమేట్ ఎక్కువై సరుకులు మిగిలిపోతే మార్కెట్‌లో సగం రేటుకి తిరిగి ఇచ్చేసేదాకా అంతా పనే. అందుకే ఎక్కువమందిని పిలిస్తే నిభాయించగలమా అన్న భయముండేది. ఇప్పుడు ప్రయాస లేదు. వెయ్యిమందిని పిల్చినా భయంలేదు.
కేటరర్ కదా అంతా చూసుకునేది, మనకేం పని?
..............................

యాభై ఏళ్ళ క్రిందటిమాట. పెళ్లి చెయ్యడమంటే కన్యాదాతకు పెద్ద పని. పట్నాలలో కల్యాణ మంటపాలు ఉండేవి కానీ పల్లెటూళ్ళల్లో ఇంట్లోనే పెళ్లి. ఇంట్లో చేసినా, మంటపంలో చేసినా పనులు చాలా ఎక్కువగా ఉండేవి. ఇంటిముందు పందిరి వేయించేవారు. బియ్యం, పప్పులు, మసాలా దినుసులూ, పంచదార, నూనె వగైరా కొనాలి. స్వీట్లు చేయించాలి. పెళ్లికి రెండు రోజుల ముందు కూరలూ, పళ్ళూ, అరటి ఆకులూ కొనాలి. గాడి పొయ్యి తవ్వించాలి. వంటవాళ్ళపై అజమాయిషీకి కొందరూ, సరకుల గది కాపలాకి కొందరూ, మగపెళ్లివారికి బంధు మిత్రుల ఇళ్ళల్లో విడిదికి ఏర్పాటుచేసేవారు. అక్కడ మగపెళ్లివారి సేవకు కొందరుండేవారు. ఎందరో పనిచేస్తేకానీ పెళ్లి అనే కార్యక్రమం పూర్తయ్యేది కాదు.
ఇప్పుడేం చేస్తున్నారు? కల్యాణ మంటపం బుక్ చేస్తున్నారు. కాటరింగ్‌కి చెప్పేస్తున్నారు. కాటరింగ్‌వారే భోజనాలు సప్లై చెయ్యడమే కాక మగ పెళ్లివారికిచ్చే సారె, ఆహూతులకిచ్చే పాకెట్స్ కూడా తయరుచేసి ఇచ్చేస్తారు. ఫ్లోరల్ డెకరేటర్స్ అలంకరణలు చేస్తారు. కుర్చీలూ, టెంట్స్ అద్దెకిచ్చేవారుంటారు. ఇక కన్యాదాత చేసే పనేముంది? అందరికీ చెక్కులు రాయడమే.
ఇల్లు కట్టడమన్నా ఇదివరలో కష్టమైన పనే. ఇటుకలూ, సున్నమూ, సిమెంటూ, రెండు రకాల ఇసుకా, కంకరా, కలపా, ఇనుమూ అన్నీ సరైన ధరలో కొనుక్కోవాలి. కార్పెంటర్ చేత ద్వారబంధాలూ, తలుపులూ, కిటికీలూ చేయించుకోవాలి. పనివాళ్లు సరైన పాళ్ళలో సిమెంటూ, ఇసుకా కలుపుతున్నారా అని చూసుకోవాలి. నీళ్ళతో తడపడం జరుగుతోందా అని పర్యవేక్షించాలి. సరుకులు దొంగతనం కాకుండా చూసుకోవాలి. పనిదొంగతనం లేకుండా కాపలా కాయాలి. అంతా అయ్యాక కూడా బీటలు కన్పిస్తే నిట్టూర్చాలి.
ఇప్పుడేం చేస్తున్నారు? ప్లాట్ అయితే స్థలం కొనే పనిలేదు. ఇంటికయితే స్థలం కొనాలి. అంతటితో పనికి ఫుల్‌స్టాప్. అడుగుకి ఇంత అని రేటు మాట్లాడుకోవడం. ఇల్లు లేక ఫ్లాట్ పూర్తయ్యాక ఉడ్‌వర్క్‌కి కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం. ఇంకే ఎక్స్‌ట్రా అందాలు కావాలన్నా కాంట్రాక్టర్లుంటారు. చివరగా గృహప్రవేశ మహ్సోవానికీ డెకరేటర్స్, కాటరర్స్ రెడీగా ఉంటారు. చేసే పని ఒక్కటే చెక్కులు రాయడం.
కాటరర్స్‌నీ డెకరేటర్స్‌నీ మాట్లాడుకోడం శుభలేఖలు అచ్చు వేయించి పంచి పెట్టడం కూడా కష్టమనిపిస్తోందా? భయపడం దేనికి? ఈవెంట్ మేనేజర్స్ రెడీగా ఉన్నారు. మొత్తం కార్యక్రమంతా వాళ్ళే నిర్వహస్తారు. మీకూ సుఖమే. ఒక్క చెక్కు రాసేస్తే చాలు. ఇప్పటి తరానికి చెక్కులు రాసే పని కూడా లేదు. ఆన్‌లైన్ ట్రాన్సఫర్ చేసేస్తారు.
ఇల్లు కట్టి చూడు, పెళ్లిచేసి చూడు అన్న లోకోక్తికి ఇప్పుడు కాలం చెల్లింది. చాలా హాయిగా రెండు పనులూ చేసెయ్యచ్చు. ఇక బెంగ ఎందుకు? బెంగ పెట్టుకునే పని లేనే లేదా? ఈ ప్రక్రియలో కష్టనష్టాలు లేనేలేవా? ఒక్కసారి ఆలోచిద్దాం.
పూర్వం పెళ్లి చెయ్యడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పచారీ సామాన్లూ, కూరగాయలు కొనడం దగ్గరినుంచి అన్ని పనులూ చేసుకోవాలి. వంటవాళ్ళు చెప్పిన ఎస్టిమేట్ ఎక్కువై సరుకులు మిగిలిపోతే మార్కెట్‌లో సగం రేటుకి తిరిగి ఇచ్చేసేదాకా అంతా పనే. అందుకే ఎక్కువమందిని పిలిస్తే నిభాయించగలమా అన్న భయముండేది. ఇప్పుడు ప్రయాస లేదు. వెయ్యిమందిని పిల్చినా భయంలేదు. కేటరర్ కదా అంతా చూసుకునేది, మనకేం పని?
ప్రయాస లేదు నిజమే. వ్యయం మాట ఏమిటి? వెయ్యిమందిని పిల్చి భోజనం పెట్టటానికి ఎంత ఖర్చవుతుంది? పని సులువుగా అని ఖర్చు ఎక్కువ చేసేస్తున్నారు. చేతిలో డబ్బు లేకపోతేనేం పెర్సనల్‌లోన్ ఇవ్వడానికి పది బాంకులు క్యూలో నిల్చుంటాయి. అప్పు తీర్చడానికి కన్యాదాత ఎంత ప్రయాస పడాలో కల్యాణ సమయంలో ఎవరికీ గుర్తుండదు.
ఇల్లు కట్టడంలోనూ ఇదే తీరు కన్పిస్తున్నది. ఇప్పటికి ఇంటిమీద కప్పు పడింది, అల్మైరాలు తరువాత చూసుకుందాం అన్న రీతి కన్పించడంలేదు. ఎవరికీ చేసే పని ఏమీ లేదు కదా. అద్దె మిగుల్తోంది కదా లోన్ తీర్చడమెంతసేపు అన్న ధీమా. అప్పు తీరేదెప్పుడు, ఇల్లు సొంతమయ్యేదెప్పుడు? మన ఆలోచనలకు తగినట్లే రియల్ ఎస్టేట్ యజమానులేమి, చార్టర్డ్ అకౌంటెంట్లేమి, ఇనె్వస్ట్‌మెంట్ కన్సల్టంట్లేమి ఇంటికన్నా మంచి పెట్టుడిలేదనీ, అప్పుచేసి ఇల్లు కడితే ఆరింతలు లాభమనీ నమ్మిస్తారు. ముందు చాలా హాయిగా ఉంటుంది. అప్పు తీర్చేటప్పుడే అసలు ప్రయాస.ఆనాడు వ్యయ ప్రయాసలు వెంటనే కన్పించి మనుషులను నిలువరించేవి. నేడు ప్రయాసలేదనిపిస్తూ మోయలేనంత బరువుని మీద పడేస్తున్నది.
ఇల్లు కట్టి చూడు, పెళ్లిచేసి చూడుతోపాటు ఇంకొకదాన్ని చేర్చవచ్చు. అది యాత్ర చేసి చూడు. కాశీకి వెళ్ళడం కాటికి వెళ్ళడం ఒకటేనని అనేవారు. దారిలో గజదొంగలు, నరబలి ఇచ్చేవారు క్రూరజంతువులు ఉండంతో భయంగా ఉండేది. రైలు మార్గాలూ, రోడ్లూ వచ్చిన తరువాత కూడా కాశీ యాత్రలో ప్రాణభయం తగ్గిందేమోకానీ అంత సులభం కాలేదు. కాశీదాకా ఎందుకు, కలియుగవైకుంఠానికి వెళ్లి తిరుమలేశుని దర్శించుకోవడం కూడా అంత సులువుగా ఉండేది కాదు. రేణిగుంటవరకూ బ్రాడ్‌గేజి, ఆపైన మీటర్‌గేజి. రాష్ట్ర రాజధాని నుంచి మొత్తం మీటర్‌గేజి. కొండపైకి దేవస్థానం బస్సులు మాత్రమే నడిచేవి. అందుకే నాలుగైదేళ్ళకి కాని స్వామివారిని ఎవరూ దర్శించుకోలేకపోయారు.
ఇప్పుడేముంది ఐఆర్‌సిటిసి, జెట్ ఎయిర్‌వేస్, స్టేట్ టూరిజం, ఇంకా ఎన్నో ప్రైవేటు టూరిస్టు కంపెనీలు కొండపైకి క్షణాలమీద తీసుకెడుతున్నాయి. తిరుమలకేకాదు, కాశీ, గయ, ప్రయాగ, అష్టాదశ పీఠాలు, ద్వాదశలింగాలు, చార్‌ధామ్ ఏది కావాలంటే అదిక్షణాలమీద బయలేదరవచ్చును.
తప్పేముంది? తీర్థయాత్రలు చెయ్యడం పుణ్యదాయకమే కదా. తప్పన్నది ఎవరూ అనరు. ఒక్కక్షణం ఆలోచించండి. ఏ మాత్రం వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉన్నా ఇంతమంది బయల్దేరేవారా? మన రాష్ట్రం నుంచి ఛార్‌ధామ్ యాత్రను సొంతంగా చెయ్యాలంటే మార్గమేమిటి? రైల్వే రిజర్వేషన్ చేయించుకుని ఢిల్లీ వెళ్లాలి. అక్కడనుంచి బస్సు మార్గంలో టిక్కెట్లు తీసుకొని ఒక్కొక్క చోట ఆగుతూ, ఇంకొక బస్సు ఎక్కుతూ యాత్రలు చెయ్యాలి. భాష రాకుంటే మరీ కష్టం, బసకీ, భోజనానికీ ఏర్పాట్లు మనమే చేసుకోవాలి. ఇవన్నీ సొంతంగ చేసుకుంటూ వెళ్లాలంటే ఎంతమంది వెళ్లి ఉండేవారు? తక్కువమందే ఉంటే ప్రకృతి వైపరీత్యాలలో ఇంతమంది మృత్యువుపాలై ఉండేవారా? ఈమధ్యకాలంలో మధ్యప్రదేశ్‌లో జరిగిన ప్రమాదానికీ ఇదే ప్రశ్ని వర్తిస్తుంది. కష్టమేమీ లేదనుకుంటూ కష్టాలను ఎక్కువ కొనితెచ్చుకుంటున్నాం. భగవంతుడు సర్వంతర్యామి అన్న సంగతిని విస్మరిస్తున్నాం.
చివరగా చిన్న పరిజ్ఞానం. పనికిరానిదేమోకానీ పనికి వస్తుందేమోనన్న ఆశ. చార్‌ధామ్‌లు ఏవి? ఉత్తరాన బదరీనాధం, తూర్పున పూరీ జగన్నాధం, దక్షిణాన రామేశ్వరం, పశ్చిమాన ద్వారకలను చార్‌ధామ్ లేదా నాలుగు ధామాలంటారు. బదరీనాధ్, రామేశ్వరాలు ఒకే రేఖాంశాన, పూరీ (సముద్రంలో మునిగిన) ద్వారకలు ఒకే అక్షాంక్షాన ఉండడంవల్ల చతురస్రాకారం ఏర్పడుతుంది. పూరీ జగన్నాథక్షేత్రంలో బయలేదరి గడియారం ముల్లువలె ప్రయాణం చేస్తూ రామేశ్వరం, ద్వారక, బదరీనాథాలు దర్శించడం చార్‌ధామ్ యాత్ర. బదరీనాధ్, కేదార్‌నాధ్, గంగోత్రి, యమునోత్రిల యాత్ర చోటా చార్‌ధామ్ యాత్ర. టూరిస్టు ఆపరేటర్లు సులభంగా ఏర్పాటుచెయ్యగలిగిన ఈ యాత్రనే ప్రస్తుతం చార్‌ధామ్‌యాత్ర అంటున్నారు. శంకర భగవత్పాదుల వలె ఆసేతు హిమాచలం కాలినడకన యాత్ర చెయ్యడం పరమాత్మలో ఐక్యమవడానికి అసలైన మార్గం కాదా?

పూర్వం పెళ్లి చెయ్యడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని.
english title: 
chekku
author: 
-పాలంకి సత్య

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>