పార్లమెంటరీ వ్యవస్థలో లోక్‌సభకు నాయకుడు ప్రధానమంత్రి, శాసనసభకు నాయకుడు ముఖ్యమంత్రి. వీరిని విస్మరించి సభను నిర్వహించేందుకు ఇతర వ్యవస్థలు ప్రయత్నించడం అంటే ఘర్షణకు దారితీస్తుంది. జవాబుదారీ వ్యవస్థతో, పారదర్శకతతో అందరూ కూర్చుని సభను ఎలా నిర్వహించాలో తేల్చాలి. శాసనసభ నిర్వహణకు అధిపతి సభాపతి అంటే స్పీకర్. కాని శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి. గవర్నర్ అసెంబ్లీని సమావేశపరిచేందుకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో శాసనసభ నాయకుడిని విస్మరిస్తే పార్లమెంటరీ సంప్రదాయాలను మంటగలిపినట్లే. సాధారణంగా ఆరు నెలలకోసారి సభ సమావేశం కావాలి. సభ ముగిసిన వెంటనే ప్రోరోగ్ చేయడమనేది సంప్రదాయం. కాని ఈసారి ప్రోరోగ్ అనే విషయాన్ని తొలుత ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ప్రోరోగ్ అనే అంశం వివాదస్పదంగా మారింది. ప్రోరోగ్ కాకుండా ఆర్డినెన్సులు ఇవ్వడానికి వీలులేదు. ఒక్కోసారి ప్రధానమైన ఆర్డినెన్సులను జారీ చేయకపోతే ప్రజాప్రయోజనాలు దెబ్బతింటాయి. ప్రోరోగ్ అంశాన్ని వివాదస్పదం చేయరాదు. డిసెంబర్ 21వ తేదీలోగా శాసనసభ సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడూ సభ ప్రొరోగ్ విషయమై గందరగోళం కాలేదు. శాసనసభకు అధిపతి అయిన సభాపతి సభ ప్రారంభమైన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, అజెండాను ప్రకటిస్తారు. అందరి అభిప్రాయాలను తెలుసుకుంటారు. స్పీకర్‌ను కూడా ప్రోరోగ్ విషయంలో వివాదంలోకి లాగరాదు. పార్లమెంటరీ సంప్రదాయంలో మెజార్టీ పార్టీ నేత శాసనసభ నాయకుడిగా ఉంటారు. సభ నిర్వహణ వ్యవహారాలు స్పీకర్ చేతిలో ఉంటాయి. మన దేశంలో అధికార విభజన లేదు. దీనివల్లనే అప్పడప్పుడు గందరగోళం వస్తుంది. శాసనసభ నిర్వహణలో సంఘర్షణ తలెత్తరాదు. ఒక మంచి సంప్రదాయాన్ని అన్ని పార్టీలు అనుసరించాలి. లోక్‌సభలో ప్రధానమంత్రి మాటను స్పీకర్, ఇక్కడ ముఖ్యమంత్రి మాటను స్పీకర్ వినకపోతే ఇక పార్లమెంటరీ వ్యవస్థలో జవాబుదారీతనం లోపించి అరాచకానికి దారితీస్తుంది. ప్రోరోగ్ అనేది సాంకేతిక అంశం. మనముందు సభ జరగడం అనేది ముఖ్యం. కాబట్టి అటు శాసనసభ నాయకుడు, ఇటు స్పీకర్, అటు గవర్నర్ చట్టానికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు లోబడి నడుచుకుని ప్రజాస్వామ్య బద్ధంగా సభ నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జవాబుదారీతనం లోపించి అస్తవ్యస్థ పరిస్ధితులకు దారితీసేందుకు కారణమవుతాం.
పార్లమెంటరీ వ్యవస్థలో లోక్‌సభకు నాయకుడు ప్రధానమంత్రి, శాసనసభకు నాయకుడు ముఖ్యమంత్రి.
english title:
parlament
Date:
Thursday, November 28, 2013