అసెంబ్లీ ప్రొరోగ్‌కు, రాష్ట్ర విభజనకు ఎలాంటి సంబంధం లేదు. దీనిని రాజకీయం చేయడం తగదు. ప్రొరోగ్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. ఆర్డినెన్సులు జారీ చేయడంతో పాటు పాలనా పరమైన వ్యవహారాలతో ముఖ్యమంత్రి ప్రొరోగ్ చేయమని కోరినప్పుడు అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిందే, దీనిలో ఎలాంటి రాజకీయాలకు అవకాశం లేదు. తెలంగాణ మంత్రులు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రొరోగ్ చేయవద్దని కోరడం సరికాదు. ఇక ఈ వ్యవహారంలో శాసన సభావ్యవహారాల శాఖ మంత్రిది పోస్ట్‌మెన్ పాత్రనే. ప్రభుత్వం ప్రొరోగ్ చేయమని కోరినప్పుడు స్పీకర్ నుంచి ఫైలు తన వద్దకు వస్తే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దాన్ని గవర్నర్‌కు పంపడం మినహా మరో బాధ్యత లేదు. ప్రొరోగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయం ముఖ్యం కానీ స్పీకర్, మంత్రి పాత్ర స్వల్పం. సాధారణంగా ప్రొరోగ్‌కు సంబంధించిన ఫైలు ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు స్పీకర్ వెంటనే దానిని పంపిస్తారు. ఇలా ఆలస్యం చేయడం అంటూ జరగదు. కానీ ఇప్పుడు మాత్రం నెల రోజుల పాటు ఫైలును స్పీకర్ తన వద్దనే పెట్టుకున్నారని అంటున్నారు. ప్రభుత్వం ఫైలు పంపినప్పుడు స్పీకర్ అలా ఉంచాల్సిన అవసరం లేదు. తక్షణం ఫైలు పంపించాలి. ఇక రాష్ట్ర విభజనపై రాష్టప్రతి ఒక నిర్ణయానికి వస్తే, ప్రొరోగ్‌కు దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. గవర్నర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరుతూ బిల్లు పంపినప్పుడు అందులో ఎన్ని రోజుల్లో దీనిపై అభిప్రాయం పంపాలో స్పష్టంగా ఉంటుంది. వారం రోజుల్లో, 15 రోజుల్లో నిర్ణయాన్ని పంపించాలని పేర్కొంటారు. రాష్టప్రతి నుంచి బిల్లు రాగానే అసెంబ్లీని తప్పనిసరిగా సమావేశపరచాల్సిందే. సమావేశాన్ని నిర్వహించి సభ్యుల అభిప్రాయాలు వెల్లడించవచ్చు. అసెంబ్లీ సమావేశపరచక పోవడానికి అవకాశమే ఉండదు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించకపోతే అసెంబ్లీ తన నిర్ణయాన్ని వెల్లడించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి రాష్టప్రతిని అభ్యర్థించి మరింత గడువు కావాలని కోరవచ్చు అంతేతప్ప అసెంబ్లీని సమావేశపరచకుండా ఉండాలని భావిస్తే, విభజనకు అడ్డంకి ఏమీ కాదు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టుగానే భావిస్తారు. కానీ ఈ ప్రొరోగ్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం పారదర్శకత పాటించడం లేదు. ఇష్టానుసారం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. దానివల్లే ఇలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. మేం బిల్లు తీసుకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేశాం, మిగిలిన పక్షాలు సహకరించలేదు అని నెపం ఇతర పక్షాలపై నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్ర విభజన సాధ్యం కాదు. అలా చేసినా ఆ నిర్ణయం నిలబడదు.
అసెంబ్లీ ప్రొరోగ్‌కు, రాష్ట్ర విభజనకు ఎలాంటి సంబంధం లేదు.
english title:
rastra
Date:
Thursday, November 28, 2013