శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత సాధారణంగా స్పీకర్ సభను ‘సైన్ డై’ అంటూ వాయిదావేస్తారు. అలాంటి సందర్భంలో స్పీకర్ నోటీసు ఇచ్చి మూడు రోజుల్లోగా శాసనసభను సమావేశపరిచేందుకు వీలుంటుంది. ఒకవేళ వారం రోజులపైగా శాసనసభా సమావేశాలు జరగకపోతే నిరవధిక వాయిదా (ప్రోరోగ్) చేసేందుకు వీలుగా ఒక ఫైలును ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ఫైలును ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దీన్ని గవర్నర్ పరిశీలనకు పంపిస్తుంది. గవర్నర్ సదరు ఫైలుపై సంతకం చేస్తే, సమావేశాలను ప్రోరోగ్ చేసినట్టు ప్రకటిస్తారు. శాసనసభా సమావేశాలు ఒక పర్యాయం ప్రోరోగ్ అయిన తర్వాత మళ్లీ సమావేశం కావాలంటే ముఖ్యమంత్రి సూచనలు, సలహా మేరకు గవర్నర్ తిరిగి శాసనసభను సమావేశపరుస్తారు. ఇందుకు కొంత వ్యవధి పడుతుంది. సాధారణంగా సభను ప్రోరోగ్ చేయకపోతే ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసేందుకు వీలుకాదు. ప్రోరోగ్ అయినట్టు గవర్నర్ ప్రకటిస్తే, ఆర్డినెన్స్‌లు జారీ చేసేందుకు వీలుంటుంది. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం శాసనసభను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయి ఐదునెలలు దాటింది. అయినా ఇప్పటికీ, ‘సైన్ డై’లోనే ఉంది తప్ప ప్రోరోగ్ కాలేదు. ఈ కారణంగానే శాసనసభను సమావేశపరచాలని మా పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి)తో పాటు మరికొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండాలా.. విడిపోవాలా? అన్న అంశంపై చర్చ జరిపి, అసెంబ్లీ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని కోరాం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లోపడేది. ఈ సౌలభ్యం ముఖ్యమంత్రి చేతుల్లో ఉండగా, ఆయన ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. అంటే సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నట్టయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఒక నిర్ణయాన్ని తీసుకుని, కేంద్ర మంత్రులతో ఒక బృందాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్-జిఓఎం) ఏర్పాటు చేసి, బిల్లు రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ బిల్లును రాష్టప్రతికి పంపిస్తే, ఆయన దాన్ని శాసనసభలో చర్చకు పంపిస్తారు. ఈ సమయంలో శాసనసభను ప్రోరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌కు లేఖరాసారు. సమైక్య నినాదాన్ని ప్రజలకు తెలియచేసేందుకు గతంలో కలిసివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నించారనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకుండా, అవసరం లేని సమయంలో దీన్ని పెద్ద సమస్యలా మార్చాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకే ప్రోరోగ్ చేయాలని కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారా లేక తెలంగాణా బిల్లుకు ఎలాంటి ఆటంకం రాకుండా సభను రద్దు చేసి శాసనసభ అభిప్రాయాలే అవసరం లేకుండా చూసేందుకు మార్గం సుగమం చేసేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారా? అన్న విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.
శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత సాధారణంగా స్పీకర్ సభను ‘సైన్ డై’ అంటూ వాయిదావేస్తారు.
english title:
kiran
Date:
Thursday, November 28, 2013