శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేసేందుకు ఇది తగిన సమయం కాదు. శాసనసభ సమావేశాలు ముగిసి ఐదునెలలు దాటింది. సమావేశాలు వాయిదా (సైన్ డై) పడ్డ తర్వాత 15 రోజులకో, నెల రోజులకో అసెంబ్లీని ‘ప్రోరోగ్’ చేస్తే అర్థం ఉండేది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సాధారణంగా నెలరోజుల్లోగా ప్రోరోగ్ చేస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఒక సెషన్ సమావేశానికి, మరో సమావేశానికి మధ్య గడువు ఆరు నెలలు దాటకూడదని లెజిస్లేచర్ రూల్స్ చెబుతున్నాయి. ఈ గడువు మరో 24 రోజులు కూడా లేదు. 2013 డిసెంబర్ 20 నుండి తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం రాజ్యాంగపరంగా ఉంది. అంటే సభను ప్రోరోగ్ చేసినా, వెంటనే మళ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సభను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు. శాసనసభ ప్రోరోగ్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను పరిశీలించాను. ప్రోరోగ్ చేయాలంటూ ప్రభుత్వం శాసనసభ స్పీకర్‌ను కోరినట్టు మీడియాలో వచ్చింది. పరిపాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించి ఆర్డినెన్స్‌లను జారీ చేసేందుకు వీలుగా సభను ప్రోరోగ్ చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరిపాలన సజావుగా సాగేందుకు, అత్యవసర అంశాలపై ఆర్డినెన్స్‌లను జారీ చేసేందుకు సభ ప్రోరోగ్‌లో ఉండాల్సిందే. అందులో రెండో ఆలోచన ఏదీ లేదు. అయితే కీలకమైన అంశాల్లో ఆర్డినెన్స్‌లను జారీ చేసేందుకు మాత్రమే సభను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ బిల్లుకన్నా అతిముఖ్యమైన అంశం ఏం ఉంటుంది? 2004 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ మానిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం, యుపిఎ భాగస్వామ్యపక్షాలు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి. యుపిఎ భాగస్వామ్య పక్షాల నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు కొనసాగిస్తున్న తరుణంలో శాసనసభను ప్రోరోగ్ చేయాలని నిర్ణయించడం సముచితం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఏ క్షణంలోనైనా శాసనసభకు పంపించే అవకాశం ఉంది. బిల్లు వచ్చిన వెంటనే దీనిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో సభను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం గత అయిదు నెలల నుండి విడుదల చేయని ఆర్డినెన్స్‌లు మరో 20-25 రోజుల్లో జారీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అంత ముఖ్యమైన ఆర్డినెన్స్‌లు ప్రభుత్వం ముందు లేవు కూడా! తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో ఇది కీలకమైన, సున్నితమైన సమయం. ఈ పరిస్థితిలో ప్రజల్లో ఎవరు కూడా అనుమానాలు రేకెత్తించేందుకు ప్రయత్నించకూడదు. తెలంగాణ బిల్లుపై సమగ్రంగా చర్చించేందుకు మార్గం సుగమం చేయాల్సి ఉంది. ఈ విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలి.
శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేసేందుకు ఇది తగిన సమయం కాదు.
english title:
a
Date:
Thursday, November 28, 2013