హైదరాబాద్, మార్చి 5: వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్ కోసం మాజీ చాంపియన్ దక్కన్ చార్జర్స్ జట్టు ఐదుగురు యువ ఆటగాళ్లను కొత్తగా చేర్చుకుంది. అభిషేక్ ఝుంఝున్‌వాలా, అచ్యుతరావు, సయ్యద్ అహ్మద్ ఖాద్రీ, వీర్‌ప్రతాప్ సింగ్, స్నేహ కిషోర్ తాజాగా దక్కన్ చార్జర్స్ జట్టులో చేరారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఝుంఝున్‌వాలా, కుడిచేతి వాటం పేసర్ వీర్‌ప్రతాప్ సింగ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరితో పాటు హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అహ్మద్ ఖాద్రీ, ఎడమచేతి వాటం ఆంధ్రా ఫాస్ట్ బౌలర్ అచ్యుతరావు రంజీ సీజన్‌లో చక్కటి ప్రతిభ కనబర్చడంతో దక్కన్ చార్జర్స్ జట్టులో స్థానం లభించింది. అలాగే ఆంధ్రా ఎడమచేతి వాటం యువ స్పిన్నర్ స్నేహ కిషోర్‌ను చేర్చుకుని చార్జర్స్ జట్టు తమ స్పిన్ బౌలింగ్ విభాగానికి మరింత పదును పెట్టింది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపిఎల్-5 కోసం ఈ ఐదుగురు యువ ఆటగాళ్లు తమ జట్టులో చేరడం సంతోషాన్ని కలిగిస్తోందని దక్కన్ చార్జర్స్ సిఒఒ (చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్) వెంకట్‌రెడ్డి తెలిపారు. వీరి చేరికతో చార్జర్స్ జట్టు మరింత బలాన్ని, ప్రత్యేకతను సంతరించుకోగలదని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపిఎల్-2లో టైటిల్ విజేతగా నిలిచిన దక్కన్ చార్జర్స్ జట్టు ఆ మరుసటి ఏడాది సెమీస్‌కు చేరిన విషయం విదితమే.
వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్ కోసం
english title:
deccan
Date:
Tuesday, March 6, 2012