ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో, సమాజంలో మనం ఏవైతే చూస్తున్నామో అవే ఈ చిత్రంలో కనిపిస్తాయని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్రోకర్-2’. మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. స్నేహ (పరిచయం) కథానాయిక. బెనర్జీ, జీవా, సిరిశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఫిలింనగర్‌లో చిత్రీకరణ జరుగుతోంది. గురువారం జరిగిన షూటింగ్‌తో టాకీపార్ట్ పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ- కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు వాటిలో కొన్నింటిని ఫిల్టర్ చేసి మాట్లాడతాం. కానీ ఈ చిత్రంలో చెప్పాలనుకున్నది స్ట్రెయిట్‌గా చెబుతున్నాం. ప్రస్తుత రాజకీయాలకు అద్దంపట్టేలా ఈ చిత్రముంటుంది. దర్శకుడు అద్భుతంగా మలిచారు అని తెలిపారు. దర్శక నిర్మాత మద్దినేని రమేష్ మాట్లాడుతూ- అన్యాయానికి గురైన ఓ మహిళను రాజకీయ నాయకులు తమ స్వార్థానికి ఏ విధంగా ఉపయోగిచుకున్నారనేది కథ. రాజకీయాల్లోని అసమర్థతను ఎత్తిచూపే చిత్రమిది. ఓ ముఖ్యమైన పాటలో మాదాల రవిగారు నటించారు. డిసెంబర్ 20న పాటలు విడుదల చేసి జనవరి నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఆర్.పి.పట్నాయక్ తెరకెక్కించిన బ్రోకర్ చిత్రం స్టాండర్డ్స్‌ని తగ్గించకుండా ఈ చిత్రముంటుందని అన్నారు. స్నేహ, జీవా, సిరిశ్రీ, అనితానాధ్, మలినేని లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: యార్లగడ్డ నాగేంద్రదేవ్, పాటలు: చైతన్యప్రసాద్, కెమెరా: వెంకట్ మన్నం, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వెంకట్ వర్థినేని, సంగీతం: విజయ్ బాలాజి, కథ, నిర్మాత, స్క్రీన్‌ప్లే: మద్దినేని రమేష్.
ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో
english title:
broker
Date:
Saturday, November 30, 2013