హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ గందరగోళంలో ఉందని, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తామని చెప్పిన తర్వాత సంబంధం లేని విషయాలను జోడిస్తూ ఎన్నో వాదనలు బయటకు వస్తున్నాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. రోజూ ఏదో ఒక రకమైన విచిత్ర ప్రకటనలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ పనితీరుకు రాష్ట్రంలో పాలన అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరుసగా తుపాన్లు చుట్టుముట్టాయని, అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని దత్తాత్రేయ విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు ఎస్ కుమార్, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ గురువారెడ్డి, ఎన్ రామచంద్రరావు, ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. రైతాంగాన్ని ఆదుకునే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయిందని అన్నారు. తడిసిన ధాన్యం కొనే ఆలోచన చేయడం లేదని, దాంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రైతులకు దక్కకుండా పోయిందని అన్నారు. వాణిజ్యపంటలు నష్టపోయినా రైతాంగానికి పైసా కూడా సాయం అందలేదని చెప్పారు. మంత్రులు, ముఖ్యమంత్రి కూర్చుని రాష్ట్ర విభజన గురించి చర్చించడమే తప్ప, రైతాంగం గురించి వారికి పట్టింపు లేకుండా పోయిందని విమర్శించారు. ఈ దశలోనైనా మూడు తుఫాన్లుకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు 10వేల కోట్ల రూపాయిలను తక్షణం విడుదల చేయాలని, రైతాంగానికి దీర్ఘకాలిక అప్పులపై వడ్డీ మాఫీ చేయాలని, కొత్తగా తాత్కాలిక రుణాలు ఇవ్వాలని అన్నారు. బ్యాంకర్లకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. పంట బీమా, నష్టపరిహారం చెల్లింపులో శాస్ర్తియ విధానాన్ని పాటించాలని సూచించారు.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అందరికీ తీవ్రమైన అన్యాయం చేసిందని దత్తాత్రేయ అన్నారు. జలాల ట్రిబ్యునల్స్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ విఫలమవుతూ వచ్చిందని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో మనకు లభించిన హక్కును కూడా మనం కోల్పోతున్నామని అన్నారు. అన్ని రకాల రక్షణ పొందాల్సిన రాష్ట్రం తన వాదనలను వినిపించడంలో విఫలమైందని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని అఖిలపక్షం నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని చెప్పారు. అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా రాష్ట్రంలో 32వేల కోట్ల రూపాయిలతో చేపట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని అన్నారు. సుప్రీంకోర్టులో సైతం సీనియర్ న్యాయవాదులతో న్యాయపోరాటం చేయాలని చెప్పారు. విభజన విషయాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా మారుస్తున్నారని రాజకీయాల్లో సస్పెన్స్ ఉంటే అది సంక్షోభానికి దారితీస్తుందని అన్నారు.
గందరగోళంలో రాష్ట్ర ప్రభుత్వం తుపాన్లు వస్తున్నా పట్టింపు లేని యంత్రాంగం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ
english title:
dattatreya
Date:
Sunday, December 1, 2013