హైదరాబాద్, నవంబర్ 30: రాష్ట్రంలో మున్సిపల్ కార్పోరేషన్లు, పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను, నీటిబిల్లుల చెల్లింపులు ఇక నుండి ఆన్‌లైన్ ద్వారా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశలో ఎంపిక చేసిన 102 కార్పొరేషన్లు, పురపాలికల్లో ఈ సదుపాయం కల్పించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఛాంబర్‌లో ఇందుకు సంబంధించిన ఒప్పందం శనివారం జరిగింది. ఆక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులతో ప్రభుత్వం ఈ మేరకు అవగాహనా ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. ఇప్పటికే మీసేవ కేంద్రాల ద్వారా ఈ సదుపాయం కొనసాగుతోంది. ఇక నుండి వ్యక్తిగతంగా ఎవరైనా తమ బ్యాంకు అకౌంట్ల నుండి మున్సిపాలిటీలకు ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్ను, నీటిపన్ను చెల్లించేందుకు ఏర్పాటు చేశారు. దీనివల్ల పౌరులకు సమయం చాలా ఆదా అవుతుందని మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను, నీటిబిల్లులను వసూలు చేసేందుకు ప్రభుత్వ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ముందుకు వస్తాయేమోనని ఏడాది కాలంగా ఎదురు చూశామని, ఇందుకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్‌కు ఇతర బ్యాంకులు ఏవీ ముందుకు రాలేదన్నారు. అందువల్ల ప్రైవేట్ బ్యాంకులైనప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి, ఆక్సిస్ బ్యాంకులతో ఎంఓయు కుదుర్చుకున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
రెండు బ్యాంకులతో సర్కారు ఒప్పందం
english title:
online payments
Date:
Sunday, December 1, 2013