తిరుపతి, మార్చి 6: ప్రముఖ పండితుడు సామవేదం షణ్ముఖ శర్మ రచించిన సప్తాచల సంకీర్తనల పాటల సిడిని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం సాయంత్రం తిరుమలలోని శ్రీనాదనిరాజనం వేదికపై ఆవిష్కరించారు. టిటిడి ఎస్వీబీసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షణ్ముఖ శర్మ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవంగా తిరుమల గిరుల్లోవెలిసి వున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పర్వత ప్రాశస్థ్యాన్ని ఈ పాటల రూపంలో ఆవిష్కరించామన్నారు. స్వామివారి సుప్రభాతంలో పేర్కొన్న విధంగా ఏడు కొండల తత్వాన్ని రమ్యంగా రచించానన్నారు. తరువాత ఆయన ఒక్కొక్క కీర్తనకు వ్యాఖ్యానం చేస్తుండగా డాక్టర్ శ్రీకాంత్, ఆర్ రాధిక, ఆర్ రోహిణి గానం చేశారు. ఈ పాటలకు సంగీతాన్ని శ్రీ ఉషాకాంత్ సమకూర్చారు. కాగా ఈ సిడిలో శ్రీనివాస నివాసమే శేషాచలం, కానగా.. కానగా కమనీయం, పావనం శ్రీ వెంకటాచలం, నారాయణ కరుణామృత .. వేయి పడగలను విప్పుకుని, మంగాంబికాపతికి అనే 9 పాటలు వీనుల విందుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు, టిటిడి ధార్మిక సలహాదారు పివిఆర్‌కె ప్రసాద్, ఎస్వీబీసీ ముఖ్యఅదికారి రామానుజం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
===
చల్లని వెన్నెల వెలుగులో.. తెప్పలపై శ్రీహరి విహారం
తిరుపతి,మార్చి 6: చల్లటి పిల్ల గాలులు వీస్తుండగా.. చంద్రుని పండువెన్నెల వెలుగులు ...విద్యుత్ అలంకరణల జిలుగులు.. మరో వైపు వేద మంత్రోచ్ఛరణలు.. మంగళ వాయిద్యాలు నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో సర్వాలంకారభూషితుడై ముగ్ధమనోహర రూపంలో శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీహరి తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. చక్కటి వాతావరణంలో స్వామివారి సుందర నందన రూపాన్ని తిలకించి ముగ్ధులైన శ్రీవారి భక్తులు చేసిన భగవన్నామ స్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం రాత్రి శ్రీస్వామి వారు పుష్కరిణిలోని అలంకృతమైన తెప్పలపై విహరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మంగళహారతులు పలికారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రమణ్యం, జేఇఓ శ్రీనివాసరాజు, సివిఎస్‌ఓ ఎంకెసింగ్ తదితరులు పాల్గొన్నారు.
===
శ్రీవారి సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
తిరుపతి, మార్చి 6: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మంగళవారం ఉదయం లఘు దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం తిరుమల గోగర్భం మార్గంలో టిటిడి నిర్మించిన కల్యాణ వేదికలో పెజావర్ పీఠాధిపతి విశే్వశ్వర తీర్ధస్వామి సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ రోశయ్య ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు మహాద్వారం వద్ద సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. 10 నిమిషాల పాటు స్వామివారి ఆలయంలో గడిపిన గవర్నర్ రంగనాయక మండపం చేరుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వాదం పలికారు. రోశయ్య బృందానికి తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల విలేకరులు ఉప ఎన్నికల ఫలితాలపై ఆయనను ప్రశ్నించగా తాను ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఈ రాష్ట్ర రాజకీయాలపై స్పందించకూడదన్నారు. అయితే ఏ పార్టీ గణాంకాలు ఆ పార్టీకి వుంటాయంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
కొణిజేటి రోశయ్యకు ఘన స్వాగతం
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు విచ్చేసిన సందర్భంగా స్థానిక పద్మావతి అతిథిగృహంలో తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.