హైదరాబాద్, నవంబర్ 30: బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డిని కలిశారు. కృష్ణయ్య వెంట బిసి నేతలు దాసరి మల్లేశం, జాజుల శ్రీనివాస్ గౌడ్, గడ్డ కృష్ణ, ర్యాగ రమేష్, సి రజేందర్, బోరంపేట వంశీకృష్ణ తదితరులున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. 50వేల కోట్లతో బిసిలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని, పంచాయతీరాజ్ సంస్థలో బిసిల రిజర్వేషన్లు జనాభా ప్రకారం 34 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బిజెపి నేతలను కృష్ణయ్య కోరారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుండి బిసిలను మినహాయించాలని, బిసి పరిశోధక విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాదిరి నెలకు 22వేల రూపాయిలు ఫెలోషిప్ ఇవ్వాలని అన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను , 90 వేల బిసి బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. (చిత్రం) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసిన బిసి సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య
బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు
english title:
bc leaders
Date:
Sunday, December 1, 2013